వర్షాకాలమంటూ ఒక ప్రత్యేక కాలమే లేని దేశం లో, ఈ కాలం ఆ కాలం అని లేకుండా.... ఏ కాలమైనా అకాలం గా వూడి పడగల ఏకైక అతిధి మాకు ఈ వాన జల్లే కదా.. జల్లంటే జల్లూ కాదు విరి జల్లు కాని, విరులంటే విరులూ కాదూ వరదల్లే కాని అని పాడుకోవటమే మాకు వాన వూసు వస్తే... వసంతమొచ్చిందో అని గుట్టలు పోసిన మంచు మీద పడ్డ వాన చినుకేగా, మొదటి సారి మరి మాకు వుప్పందించేది.
ఆ కబురు కరిగిన నీరై, ఆ పైన మెరిసిన వాన చినుకుల తెల్లాటి మెరుపుల మురిసే లోపు, మేమొచ్చామో అని వాన చినుకు కు తోడు పూలు పైకొచ్చి పలకరిస్తాయి. ఇక పాడుకోవటం మొదలెడతాము కోటి ఆశలను గుండె నిండా నింపుకుని "April showers bring May flowers " అని, ఇంకా మా కోసమని విరబూయ బోయే వనాల వరదలను తలచుకుంటూ... ఆ పైన మురుసుకుంటూ...
ఇక చూడు ఆ చినుకమ్మ విన్యాసాలు, ఎన్ని కబుర్లను మోసుకొని తెస్తుందనుకుంటున్నారు. ఇదుగో దూర దేశానికి నిరుడు తరలి పోయిన ఆ పెద్ద డేగ లొస్తున్నాయి జాగర్త... ఇక్కడే కదా అని ఆలస్యం గా గూటికి చేరుకోకు అని చిన్ని గువ్వ పిట్ట కు రెక్క నిమురుతూ ఒక చినుకు...
తన పిల్లలను పొదగటానికి ఎక్కడ నుంచో ఎగిరి మా అడవులకు రానున్న ఎర్ర కళ్ళ బుల్లి పిట్టలకు గూడు మెత్త గా వుందో లేదో అని ఆకు ఆకుని బతిమాలి గాలితో కలిపి తడిపి పక్క చేస్తున్న ఒక చినుకు.... వసంతమంతా మా ముంగిట పోయటానికి ముందటేడూ మిగిలిన ఆకుల అవశేషాలను వూడ్చి కళ్ళపి జల్లి పోతూ ఎన్నెన్ని చినుకులు పలకరిస్తాయనుకుంటున్నారు. సరి ఆ వసంత వీర భోగం అవుతుందా..
ఇలా ఇన్ని హొయలు పోయిన చినుకమ్మ ఆగుతుందా... సూరీడు కాసంత కనుమరుగవ్వటానికి తయారవుతూ.... రాత్రి ఏడు కల్లా అలసి పోయానోయ్ అని తన ఎరుపును చెట్టు కొమ్మల అంచున అద్ది, నును లేత చలి గాలి దుప్పటి కప్పుకుంటుంటే....... మరి నేను కూడా వెళ్ళాలోయ్ అని కన్నీరు మున్నీరు గా మా ముంగిట ధారలై నిలుస్తుంది. కొమ్మ కొమ్మ ను పువ్వు పువ్వు ను శెలవడిగి... మా అందరికి Happy Thanks giving, Merry Christmas ఆ పైన Happy new year అని చెపుతూ.... అప్పటికి వచ్చే విజయ దశమి కి చేమంతుల పూబంతులను పన్నీట జలకాలాడించి దుర్గమ్మకు పెట్టమని నిద్ర ఆలస్యం గా లేస్తానేమో అని మా కిటికి పైన ఈడ్చి కొట్టి మరి నిద్ర లేపుతుంది... ఇది మాత్రం చినుకమ్మ నాకొక్క దానికే ఇచ్చే ప్రత్యేక బంపర్ ఆఫర్.
ఇలా మా అందరితో ఎన్నెన్నో భావాల, అనుభవాల, అనురాగాలను పంచుకుంటూ...... మా మధ్యన నీటి తెర గా, ఆ అపైన పొగ మంచు తెర గా, చివరికి మంచు లా ఘనీభవించి.. మా శెలవడిగి, తెల్లటి చలి దుప్పటి కింద బొజ్జుని మరుసటి ఏడుకే నా పలకరింపు అని చెప్పి మాయమవుతుంది. ఇదండి మా వూరి వాన చినుకు చెప్పిన సద్దులు. బాగున్నాయా. ఒక జ్నాపకం అని చెప్పి ఎన్ని చెప్పానో చూసారా.. ఇందులో అన్నీ అందరికి తెలిసినవే ఐనా మంచి కబురు నలుగురితో మళ్ళీ మళ్ళీ పంచుకోమంటారు కదండి అందుకని ఇలా మీతో.
నీ చినుకు జ్ఞాపకాలు నీ కవితలంత కమ్మగా ఉన్నాయి. తొలకరి చినుకంత చల్లగా ఉన్నాయి. పచ్చని అరిటాకు మీదనుంచి జారుతున్న చినుకుని కిటికీలోంచి చూస్తూ మింగుతున్న వెచ్చని కాఫీ ఉన్నాయి. కమ్మని వాసనని పంచుతూ వర్షం కల్గించే మైమరపులా హాయిగా తీయగా ఉన్నాయి.