కిందటి సారి మా వూరు గురించి చెప్పేను కదా అటువంటి వూరు లోకి, పెళ్ళి చేసుకుని, చేసుకున్నోడి చిటికిన వేలు పట్టుకుని వెయ్యి ఆశలతో మెట్టినింటికి నడిచి వచ్చిన ముద్దుగుమ్మల ముచ్చట్లు వినండి.. ఈ రోజు మొదటిది మాత్రమే ఇస్తున్నా అన్నీ కలిపితే మరీ పెద్దదై పోతుందని.
1.
జీవితం లో అమెరికా వచ్చిన తరువాత మార్పుల గురించి రాయాలంటే ముందు రాయవలసింది మార్పు రాక ముందు నేనెలా వున్నాను, నేనేమనుకున్నాను అనేది. కదు......!!!. ఇక్కడకు రాక ముందు నేను కల లో కూడా అనుకోలేదు అమెరికా రావాలని, వస్తానని. దానికి ముఖ్య కారణం అమ్మ వాళ్ళకు, అక్క వాళ్ళకు దూరం గా వుండటం అనే వూహ నాకు రుచించక పోవటమే అనుకోవాలి.కాని అన్ని అనుకున్నట్లు జరగవు కదా (అదేనేమో ముందు నేను నేర్చుకుంది అమెరికా రావటం అనే ప్రాసెస్ లో). నా నిజ జీవిత హీరో గారు మార్పు ను ఆహ్వానించటం లో పెద్ద బిడ్డ. తన సూచన తో, జీవితం లో మార్పు అప్పుడప్పుడు అవసరం జీవితాన్ని నిత్య నూతనం గా వుంచటానికి అనే మొదటి పాఠం నేర్చుకోవటం తో పాటు బుర్ర లోకి కూడా ఎక్కించుకుని విమానమెక్కేసేను. (మరి ప్రియమైన మొగుడు గారు కదండి, కొన్నాళ్ళకే వెళ్ళొద్దాము అంటే కాదని ఎలా అంటాను కదా).
వచ్చి రావటం తోనే అమ్మ వాళ్ళ ను వదిలి వచ్చాననే బెంగ ను మరిపించేందుకేమో ప్రకృతి మాత రంగు రంగుల దుప్పట్లు పరిచి రంగులు అన్నిపక్కల నుంచి చిలకరిస్తూ పలకరించింది.
(అవునండి ఆకులు రాలు కాలం, ఫాల్ సీజన్ లో వచ్చాను ఇక్కడకు) నిజంగా ప్రకృతి ని ఆస్వాదించటం, ఆనందించటం అంటే ఏమిటో అప్పుడే అర్ధం అయ్యింది. ఏ రంగు వైపు చూడాలో, మా అపార్ట్మెంట్ వెనుక చెట్టునే చూడాలో, కొండల కోనల అంచుకు వెళ్ళి ఆ రంగుల అంబరాన్ని చలి గాలుల తో కలిపి విసురుతున్న అందాలు చూడాలో అర్ధం కాక సతమత మయ్యే దానిని. వాటితో కలిపి ప్రకృతి మనకిచ్చే పుట్ట తేనెలు, జొన్న కంకులు, చేమంతులు, పూబంతులు బోనస్.
ఆ అందాల ఆస్వాదన లో మునకలైన నేను తేరుకోకముందే మంచి మంచు చినుకుల వానలు మొదలయ్యాయి. మొదటి సారి పువ్వులు చెట్టుకు కాకుండా ఆకాశం లో పూచి నాకోసం నేల మీదకు వచ్చి చెట్టులకు అలంకారమయ్యి మెరిసి మురిపిస్తాయని తెలిసి ఆ మంచు పూల వాన నాకిచ్చిన సంతోషాన్ని ఎన్ని మాటలతో వర్ణించగలను.
నిద్ర పోతే వుషోదయపు మంచు కాతులను చూడలేనని, పొద్దుటే అలారం పెట్టుకుని లేచి మరి చూసే దాన్ని స్నో పడుతుంది అంటే..
తినగ తినగ వేము తియ్యగుండు అనే సామెత ను నిజం చేస్తూ మంచులోని అందాన్ని ఆస్వాదించటం తో పాటు చలి లోని చేదు ను, సరి గా నడవకపోతే జారుడు బల్ల ల సయ్యాటలు తొందర లోనే నేర్చుకున్నాను.
ఇక నయాగరా ఫాల్స్ ను చూడటం అనేది జీవితం లో ఒక మర్చిపోలేని అనుభూతి.
ఇక్కడ వున్న అందరు తప్పక చూడవలసిన ప్రదేశం. మొదటి సారి ఆ అనంత జలరాశుల ముందు నుంచుని తలపైకెత్తి ఆ హోరు ను వింటూ, తల వంచి ఆ తుంపరల ఆశీర్వాదాలను తీసుకుంటూ, బిర బిరా పాకే ఏటి తో పక్క గా నడుస్తూ ఆ నీటి ని చూడటం, కిందకు వురికిన నీటి మధ్య గా పడవలో వెళ్ళి చుట్టూతా కమ్ముకున్న నీటి తుంపరల మేఘాల మధ్య వుండి ఆ అందాన్ని చూడటం ఒక మధురమైన అనుభవం. నాకు ఆ అనుభవం తో అర్ధమైంది ప్రకృతి ముందు మనమెంత అల్పులమో ప్రతి క్షణం దాని నుంచి మనమెంత నేర్చుకోవాలో, ప్రతి పాఠం నుంచి నేర్చిన సారాన్ని జీవితం లో ఎలా ప్రతిష్టించుకోవాలో..
సరే జీవితానికి అనుసంధానం గా జరిగేవి పక్కన పెట్టి జీవితం లో జరిగిన మార్పులను చెప్పాలంటే... వు... ఒక్క మాట లో చెప్పాలంటే జీవితాన్ని ఆసాంతం గా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. దానిని విడగొట్టి వివరించి చెప్పాలంటే కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త మనుష్యులను, కొత్త అలవాట్లను, కొత్త సంస్కృతి ని చూడటం వాటిని అర్ధం చెసుకోవటం, వాటిని మన అలవాట్ల తో మనదైన రీతి లో మలచుకోవటం, ఇష్టం లేని వాటికి దూరం గా వుండటం లోని తప్పని ఘర్షణ. ఇవి కొత్త ప్రాతం, కొత్త దేశానికి వచ్చినప్పుడు ఎవ్వరికి తప్పని పాట్లు కదా. అందరిని పలకరించాలని వుంటుంది. ఒక్కో సారి తెల్ల వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పటం, మన వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళ తో మాకేంటి అన్నట్ళు తల తిప్పుకుని గమనించనట్లు వెళ్ళి పోవటం. ఇంకొన్ని సార్లు అపరిచితులైన మన వాళ్ళు చిటిక లో చిన్నప్పటి నుంచి తెలిసిన చిర పరిచితులయ్యి మర్చిపోలేని అనుభందాన్ని మాకు కానుకివ్వటం. ఇలా ఎన్నో అనుభూతుల మాలను గుచ్చి జీవన పధాన గుర్తులు గా అక్కడక్కడ తగిలించుకుంటూ వెళ్ళి పోవటం అలవాటయ్యింది.
వీటన్నిటిని చేయటం లో సర్దుకు పోవటానికి నాకు దొరికిన ఒక ఆలంబన ఇక్కడ పరిచయమయ్యిన నా స్నేహితులే అని చెప్పుకోవొచ్చు.
మంచి చెడూ ఆనందం దుఃఖం అన్నిటిని కలిసి పంచుకోవటం లో కాలాన్ని సాగదీయటం కోసం కొత్త కొత్త (మాకు కొత్త, అమెరికా కు కాదండోయ్) ఆటలు ( Scrabble, Pictionary etc.... ) ఆడటం లో అన్నిటి లో జత వుండే స్నేహితులు దొరకటం కూడా అదృష్టమే కదా. ఆ అదృష్టం లో మాకు తోడైన ఇంకో చిన్న బొమ్మ నా స్నేహితురాలు శర్వాణి వాళ్ళ అమ్మాయి శ్రేయ. శ్రేయ తో ఆడుకుంటున్నప్పుడే నాకు జీవితం లో ఇప్పటి వరకు పరిచయం కాని కొత్త ఆనందం దొరికనట్లనిపిస్తుంది ఎప్పుడూ కాదు కాని అప్పుడప్పుడూ కొత్త వంటలు చేయటం లోను వాటిని నా చుట్టుపక్కల వారికి ఇచ్చి మెచ్చుకోళ్ళు పొందటం లో ( ఏమి చేస్తారు లెండి, ఇచ్చి ఎదురుగా నుంచుని చూస్తూ వుంటే బాగుందనక..... అది కాక నేను మాత్రం తరువాత వాళ్ళ వంటలు మెచ్చుకోవద్దు) కాలం అలా వేళ్ళ సందుల నుంచి జారి పోతూ వుంటుంది.
వీటన్నిటి తో పాటు ఇప్పటి వరకు ఎప్పుడూ వుద్యోగ యత్నం చెయ్యక పోయినా బయటకు వెళ్ళి ఆ వుద్యోగం కూడా చేసి పారేస్తే పోలా అని అనిపిస్తూ వుంటుంది, చూద్దాము నాకోసం అమెరికా ఇంకేమి రత్నాలను దాచివుంచిందో బహుమతి గా ఇవ్వటానికి.

కొత్తపాళి గారన్నట్లు కాసేపు మనం వున్న దేశం, మన చుట్టూతా జరిగే జీవితాలు,మార్పులను... మన నిత్య జీవితాలలోని ఒడి దుడుకులని.... ఎదుర్కుంటున్న సమస్యలు వెతుక్కుంటున్న పరిష్కారాలు వీటి గురించి రాయాలనిపించింది నాకు కూడా.
సరే పాలిటిక్స్ గురించి మాట్లాడదామంటే అంత మనసనిపించలేదు, ఏమి వుంది రెండు, రెండంటే రెండే పార్టీ లు మనకు మల్లే తిట్టుకోరు చెప్పులు విసురుకోరు బంద్ లు చెయ్యరు. అంత మజా రాదు. జాతి వివక్షత, లంచగొండి తనం, లాబీయింగ్ (అదే పార్టీ ఫండ్ లు గట్రా) వుంటాయి కాని ఏమి వుంది లే తరువాత రాయొచ్చు అని పక్కన పెట్టేను.
ఆర్ధిక విధానం, రాజకీయం గా వ్యక్తి గతం గా అది ఇక్కడ జీవితాలను ప్రభావితం చెసే విధానం హ్మ్మ్.. అదీ రాయొచ్చు, కాని అంత వివరం గా రాసే అనుభవం లేదు పైగా గ్లోబలైజేషన్ అయ్యాక ఆర్ధిక పరిస్తితి అనేది దాదాపు గా తెరిచిన పుస్తకమయ్యింది. ఏది అవలేదు అనుకోండి.
ఎంత గ్లోబలైజేషన్ ఐనా ఇంకా చెప్పుకోవటానికి పంచుకోవటానికి చర్చ పెంచుకోవటానికి తేలిక గా నా వంటి నాన్ రచయత్రులు (పదం బాగుంది కదు) రాయ తగినది ఏమి వుంది.. ఆ అదే అదే వస్తున్నా దాని దగ్గరకే.
రోజు వారి జీవితం గురించి. అదే నేను పైన ప్రస్తావించినది. ఎంత సేపైనా చెప్పుకోవొచ్చుజీవితం అందులోని మార్పు లు చేర్పులు కూర్పులు (రెండూ ఒకటే అనుకుంటా కదా ఏదో ప్రాస బాగుందని వాడేను లెండి) అమెరికా లో నైనా, భారత దేశం లో ఐనా. అదే కదా మన కబుర్ల ఇంధనం.
దీని గురించి ఒక వరుస క్రమం లో రాయలేను కాని తోచిన విషయాలు రాయాలని నిర్ణయించుకున్నా. మా వర్క్ లో ఆడవాళ్ళు, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కలిసి ఒక గ్రూప్ వుంది మాకు. మంచి చెడు, సుఃఖం కష్టం కలబోసుకుంటాము అప్పుడప్పుడు. యాధృచ్చికం గా అంతకు ముందే ఆ గ్రూప్ లో అమెరికా రావటం లో మన జీవితాలలో, మనం విషయాలను చూసే తీరు లో, జీవిత దృక్పధం లో వచ్చిన మార్పులు అనే దాని గురించి అందరి అభి ప్రాయాలు పంచుకోవాలనుకున్నాము. ఆ పైన ఈ దేశం లో కి రావటం వలన మా కుటూంబాలలో మా జీవితాలలో వచ్చిన స్ట్రెస్ (వొత్తిడి), దానిని మేము ఎలా డీల్ చేసేము అనే దాని గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాము. మా గ్రూప్ లో చాలా మంది నా బ్లాగ్ చదువుతూ వుంటారు. వాళ్ళ అభిప్రాయాలను బ్లాగ్ లో పెడతాను అన్నప్పుడు అందరు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ లో రాసినవి నేను తెలుగు లో తర్జుమా చేసి పెడదామని కూడా నిర్ణయించుకున్నాము. ఈ గ్రూప్ లో కొత్త గా పెళ్ళి అయ్యి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడకు వచ్చి 14 ఏళ్ళయిన నా వరకు వున్నారు. కొందరు తేలిక గా క్లుప్తం గా వాళ్ళ మనసును వ్యక్తీకరిస్తే, కొందరు వాళ్ళ జీవితం లో సహచరుడు పంచిన ప్రేమ, బిడ్డలు తో తెచ్చుకున్న జ్ఞానం గురించి చెపితే, మరి కొందరు వాళ్ళు జీవితం లో సాధించిన విజయాలు పంచుకుంటే, ఇంకొందరు కెరీర్, జీవితం మధ్యన సమన్వయం చేసుకున్న విధానాన్ని చెప్పేరు. రేపటి నుంచి ఒక్కొక్కరి అనుభవాలను ఈ పశ్చిమ దేశాల గడపల అలంకరించిన తోరణాల మాలికలను మీ ముందు వుంచుతా.
చెప్పే ముందు మీ అందరికి అమెరికా దాని వైశాల్యాల, వైవిధ్యాల గురించి చెప్పి విసుగు తెప్పించను కాని మేము వుంటున్న వూరు దాని స్తితి గతులు కొంచం సేపు... సరేనా..
మేము దేశం లో ఒక మూల కు బోస్టన్ పక్క గా వుంటాము. రాష్ట్రమంటే మరీ మన ఆంధ్రా లా పెద్దది వూహించుకోకండీ. ఇది ఒక బుల్లి రాష్ట్రం, అందులో కూసినన్ని నగరాలు, ఎక్కువే పట్టణాలు ( నాకు ఈ విషయం ఎప్పుడూ కన్ఫ్యూజనే 14 ఏళ్ళు ఐనా వచ్చి. మాంచెస్టర్ సిటీ అంటారు మళ్ళీ టౌన్ హాల్, టౌన్ లో అంటారు మళ్ళీ ఈ వూరులన్ని బాగా పెద్ద వూరు పక్కన వుంటాయి కాబట్టి ఇవి అన్ని సబ్ అర్బ్స్ అదే పల్లెటూళ్ళు అంటారు, ఇందులో ఏది నిజమో నాకైతే తెలియదు)
మన ఆంధ్రా లో ఒక మాదిరి పట్టణం అనుకోండి. సరే మన బ్లాగ్ లోకం లో బాగా వూరు గురించి (డబ్బా అని నాలాంటి గిట్టని వాళ్ళు అన్నప్పటికి అది అభిమానమనే అనుకోవాలి లే) అభిమానం వున్న బ్యాచ్ ఎవరు? అదుగో మీకు గుర్తు వస్తోంది....... అదే అండీ నరసరావు పేట. అబ్బో సుజాత గీతాచార్య ఇంకా ఆబ్యాచ్ చూపుల చురుకు కంప్యూటర్ లు దాటి తగులుతోందే.. ఆ నరసరావు పేట మాదిరి వూరనుకోండి ఇది కూడా. అన్ని వుంటాయి కాని ఏమి పెద్ద లేనట్లే సిటీ లతో పోల్చుకుంటే.. మన వూర్లు చాలా నయం కాని ఇక్కడ అమెరికా లో ఇలాంటి వూర్లు పెద్ద వూర్లే, వుద్యోగాలు బోలెడన్ని వుంటాయి పెద్ద కంపెనీ లు కొన్ని ఇలాంటి చోట్ల మొదలెడతారు కామట్టి. కాని పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ వుండదు పెద్ద గా. ఏదో పెద్ద రోడ్ ల మీద బస్ లు అవి వెళుతూనే వుంటాయి కాని అర కొరా గా అంతే. కార్ లే ముఖ్యమైన ప్రయాణ సాధనం మిగతా అన్ని వుంటాయి.
నాకు బయటకు వెళ్ళాలని వుంది అనగానే చటుక్కున చెప్పులేసుకుని బయటకు వచ్చి ఏ రిక్షా నో ఆటో నో పట్టుకుని వెళి పోయేటట్లు వుండదు. ముందస్తు గా బయట వాతావరణం చూసుకోవాలి మాకు బాగానె చలి ఎక్కువ. అమెరికా లో నాలుగు కాలాలు అని బడాయి గా ప్రజలు చెప్పుకోవటం కద్దు కాని నిజానికి రెండే. చలి కాలం, చలి లేని కాలం. మొదటిది 9 నెలలుంటుంది, ఆ తొమ్మిది నెలలనే బడాయి గా స్ప్రింగ్, వింటర్, ఫాల్ అని అంటారు కాని మన వరకు అంతా చలి కాలమే. మిగతా మూడు నెలలు చలి లేని కాలం ఎండా కాలమా అంటే వూ ఇంచుమించు గా, రమా రమి గా, అటు ఇటు గా అంతే అని మొహమాట పడుతూ చెపుతాము.
సరే ఈ వాతావరణ వివరాలు వదిలేసి మా జీవితాల గోల కు వస్తే మా వూరు పేట లెక్క అని చెప్పేను కదా. అలాంటి వూరు లో ఒక చిరు వుద్యోగం చేస్తున్నా నేను నాతో పాటు గా చాలా మంది మనోళ్ళు. అవునండి మన వాళ్ళు ఎక్కువే ఇక్కడ. నేను వుండే టౌన్ లో ఐతే, నేను వుండే వీధి లో మొత్తం అందరం మన దేశమోళ్ళే, ఒక పాకిస్తాను అతను ఒక తెల్లోళ్ళూ అంతే. చాలా ప్రశాంతం గా సాయింత్రమైతే అంతు లేని చుక్కలను, తెల్లరితే మంచుపూల వుషోదయాలను ఎక్కడ చూసినా చెట్లు, పచ్చ పచ్చ గా, చల్ల చల్ల గా అందం గా వుంటుంది లెండి మా వూరు. అలాంటి చోట వుండే మా గోల వినటానికి ముందు గా మీ అందరిని మానసికం గా ఆయత్తం చేసినట్లు వున్నా కదు. ఇక ఈ సోది ఆపి రేపు, యెల్లుండి లలో మొదలు పెడతాను మా జీవన గీతాలాపన. అందాకా అందరికి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.
స్వాంతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు
చిన్ని జోక్ లాంటి ఒక నిజం మా ఆడవాళ్ళ స్వాతంత్రం మీద మేమే .....
మనకు స్వాతంత్రం వచ్చింది అంటగా ?????
వెన్నెలంటే నా కిష్టం. సముద్రపు హోరంటే నా కిష్టం. .. వెన్నెలలో తడిసి అలలపై మెరిసే నురగంటే నా కిష్టం. వీటన్నిటిని మొగలి పూల దొప్పలో కలిపి ఇచ్చే మా వూరంటే నాకింకా ఇష్టం...... మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలం గా అల్లుకున్న పొదరిల్లు మాది అన్నట్లు మాది అటు పల్లెటూరికి ఎక్కువ ఇటు పట్టణానికి తక్కువ గా వుండే ఒక మోస్తరు వూరు....
మావూరు అనగానే గుప్పెడు సన్నజాజులు గుండెలపై కుమ్మరించినట్లు ఎన్నో అనుభూతులు ఒక్క సారి మనసును చుట్టుముట్టేస్తాయి నాకు. .. కొన్ని గాఢం గా సాంబ్రాణి పొగలా చుట్టు ముట్టేస్తూ వుక్కిరి బిక్కిరి చేసి మధురమైన స్మృతులను తలపుకు తెస్తే, కొన్ని అప్పుడే విచ్చిన చంద్రకాంత పూలు గాలితో కలిపి తెచ్చే పరిమళాలు మనసుకు అందిస్తాయి. ఇక మరి కొన్ని ఎండిన నేలపై కురిసే తొలి చినుకుల విరిని లేపుతూ మరీ ఆనందాన్ని ఇస్తాయి.
భాష ఏదైనా భావమొక్కటే గుండెకు. అనుభూతుల సాంద్రత వేరైనా సారం మాత్రం ఒక్కటే నాకు మా వూరును తలుచుకుంటే...
మా వూరికి మాత్రమే పరిమితమైన విశ్లేషణలు చాలానే వున్నాయి. నా చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి పొట్టకూటి కోసం ఈ దేశానికి వలస వచ్చే వరకు నా జీవితం మొత్తం మా వూరిలోనే గడిచింది. పుట్టటం దగ్గర నుంచి, చదువు, పెళ్ళి, వుద్యోగం అన్నీ కూడాను.. మా వూరు సరస్వతి నిలయం. ఒక్క మెడిసన్ తప్ప మా వూరిలో లేని చదువు అంటూ ఏమి లేదు.. అబ్బో అదేమి గొప్ప అంటారు మీరందరు, ఇప్పుడు గొప్ప కాదేమో కాని మరి 1980 ల లోనే అన్ని కాలేజీల్లోని కోర్స్ లు మా వూరిలో వున్నాయంటే మరి అది మాకు గర్వ కారణమే కదా..
మా వూరి లో మిరప కాయ బజ్జీ తిన్న వారెవ్వరైనా ఒప్పుకోవలసిందే ఇంత మంచి బజ్జీ ఎక్కడా తినలేదు అని.... అంతే కాదు మా వూరు జగద్విఖ్యాతమైన లడ్డు కు కూడా పేరెన్నిక కన్నది, తిరుపతి కాదండోయ్...తిరుపతి లడ్డు తరువాత అంత గా ప్రఖ్యాతి చెందిన బందరు లడ్డు మరి మాదే కదా...
లడ్డు ఏమిటి లెండి, హల్వా, అది అనే కాదు అసలు మా వూరి పేరు మీదే అంటారు కదా బందర్ మిఠాయి అని.
మా వూరికి ఒక్క పేరే కాదండోయ్..... మచిలీపట్టణం అని కూడా అంటారు.. ఎప్పుడో పోర్చుగీసు వాళ్ల కాలం లో జాలరులకు ఒక పేద్ద చేప దొరికితే , ఆ చేప కన్ను తో ఫోర్ట్ తలుపే కట్టించారట అందుకే మచిలీ (చేప) పట్టణం అని పేరు వచ్చిందట. మత్య ప్రియులకు మా వూర్లో చాలా రకాల చేపలు,పీతలు గట్రా దొరుకుతాయి.
మా వూరికు పక్కనే సముద్రం, క్రిష్ణమ్మ సంగమపు అందాలు చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కాదు.... నదులన్నీ వచ్చి సముద్రం లో కలవటం ఎంత సహజమో చదువుల కోసం, కోర్టు పనుల కోసం, మంచి వైద్యం కోసం, మా వూరుకు రావటం అంత సహజం గా వుండేది ఒకప్పుడు.
ఇప్పుడంటే రెసిడెన్షియల్ కాలేజ్ కల్చర్ పెరిగి పోయింది కాని మా వూరి హిందు కాలేజ్, నేషనల్ కాలేజ్ ఎంత మంది గొప్ప విద్యా వేత్తలకు, కళాకారు లకు పుట్టినిల్లు గా వుండేవి అనుకుంటున్నారు. ఆ లిస్ట్ మొదలు పెడితే అబ్బో ఇప్పట్లో అయ్యేది కాదులెండి. అంత ఎందుకండి... మా వూరి గురించి మంచి దర్శకులుగా పేరు వున్న జంధ్యాల గారు ఒక సినిమానే తీసేరు అంటే ఇంక మాటలెందుకు లెండి... ఏమిటా సినిమా అనుకుంటున్నారా? ష్... గుప్... చిప్.... చూడండి మీకు అందరికీ మా వూరి గొప్ప తనం తెలియక పోతే నేను మీ అందరికి ఫ్రీ గా ఒక డీ.వీ.డి పంపుతాను మరి...
ఈ దేశం వచ్చేక కూడా మా వూరి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ ఒక్క సారి మా పాండు రంగడి ని, మా పున్నాగ పూల ను, మా మాలతీ లతలను, అంత కంటే ఎక్కువ మా సముద్రపు గాలిని తలిచి మురవక పోతే మా కంటే కూడా మా పక్కన వాళ్ళు ఆశ్చర్య పోతారు... కావాలంటే మా బోస్టన్ లో ఎవరిని ఐనా అడగండి. నిజం... మా వూరి మీద ఒట్టు...!!!!!!!
సుజన రంజని కోసం ఎప్పుడో రాసిన ఈ టపా ను ఎక్కడో పారేసుకున్నా, అడగ గానే వెతికి ఇచ్చిన కాంతి కిరణ్ గారికి ధన్య వాదాలతో..
