Subscribe RSS



చినుకు జ్ఞాపకం 


వాన అనగానే అందరికి చిన్నఫ్ఫుడు వానా వానా వల్లప్ప అని తిరిగిన లేత చినుకుల నవ్వులో ... లేక యుక్త వయసు లోని చిలిపితనాల చిందులు తొక్కించిన చినుకుల చిట పటలో , ఇంకా ముందుకు వస్తే శ్రీవారి/శ్రీమతి తో కలిసి ఆషాడానికి ముందు వెనుకలు గా సాగిన పరవళ్ళు తొక్కే చినుకుల సరాగాలు గుర్తు వస్తాయి. ఆ పైన భాద్యతల వరదలో మునిగి తేలుతూ, మళ్ళీ మునకలేస్తూ.... చినుకెప్పుడొచ్చిందో... పోయిందో తెలియని హడావుడి లో కూడా, ఇంటి ముంగిటకొచ్చి నన్ను పట్టించుకోవే అని చిందులు తొక్కిన, గారాల వయ్యారాల వాన పలుకుల జ్నాపకమొకటి మీతో పంచుకుంటూ...  


వర్షాకాలమంటూ ఒక ప్రత్యేక కాలమే లేని దేశం లో, ఈ కాలం ఆ కాలం అని లేకుండా.... ఏ కాలమైనా అకాలం గా వూడి పడగల ఏకైక అతిధి మాకు ఈ వాన జల్లే కదా.. జల్లంటే జల్లూ కాదు విరి జల్లు కాని, విరులంటే విరులూ కాదూ వరదల్లే కాని అని పాడుకోవటమే మాకు వాన వూసు వస్తే... వసంతమొచ్చిందో అని గుట్టలు పోసిన మంచు మీద పడ్డ వాన చినుకేగా, మొదటి సారి మరి మాకు వుప్పందించేది.  






ఆ కబురు కరిగిన నీరై, ఆ పైన మెరిసిన వాన చినుకుల తెల్లాటి మెరుపుల మురిసే లోపు, మేమొచ్చామో అని వాన చినుకు కు తోడు పూలు పైకొచ్చి పలకరిస్తాయి. ఇక పాడుకోవటం మొదలెడతాము కోటి ఆశలను గుండె నిండా నింపుకుని "April showers bring May flowers "  అని, ఇంకా మా కోసమని విరబూయ బోయే వనాల వరదలను తలచుకుంటూ... ఆ పైన మురుసుకుంటూ...


ఇక చూడు ఆ చినుకమ్మ విన్యాసాలు,  ఎన్ని కబుర్లను మోసుకొని తెస్తుందనుకుంటున్నారు. ఇదుగో దూర దేశానికి నిరుడు తరలి పోయిన ఆ పెద్ద డేగ లొస్తున్నాయి జాగర్త... ఇక్కడే కదా అని ఆలస్యం గా గూటికి చేరుకోకు అని చిన్ని గువ్వ పిట్ట కు రెక్క నిమురుతూ ఒక చినుకు... 




తన పిల్లలను పొదగటానికి ఎక్కడ నుంచో ఎగిరి మా అడవులకు రానున్న ఎర్ర కళ్ళ బుల్లి పిట్టలకు గూడు మెత్త గా వుందో లేదో అని ఆకు ఆకుని బతిమాలి గాలితో కలిపి తడిపి పక్క చేస్తున్న ఒక చినుకు.... వసంతమంతా మా ముంగిట పోయటానికి ముందటేడూ మిగిలిన ఆకుల అవశేషాలను వూడ్చి కళ్ళపి జల్లి పోతూ ఎన్నెన్ని చినుకులు పలకరిస్తాయనుకుంటున్నారు. సరి ఆ వసంత వీర భోగం అవుతుందా..




పూలతో సొమ్మసిల్లి ఎండలకు తేరుకుంటూ... ఎండాకాలం మాకు పంటల కాలం అని పాటలు పాడుకుంటూ...... ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపుసొలుపేమున్నది అని కూని రాగాలు (గిట్టని వాళ్ళు ఖూనీ రాగాలనటం కద్దు)  తీసుకుంటూ పనులు చేసుకుంటున్న మమ్ములను .. ఎండలలో మేమెక్కడ మాడి పోతామో అని ఒక వారం ఎండలు మండేయా, వెంటనే నేనున్నానని ఒక గ్రీష్మ గానం,  ఎండల ఎర్ర దనాన్ని పల్లవి గా చేసి, వుడుకు పొగల తాళం వేసి ఆ పైన చినుకమ్మలు..... గబ గబా గుబ గుబా వచ్చి వూసులాడుతూ.... పాటలాడతాయి.  మా పెరళ్ళలో అమృత ధారలు కురిపించి శక్తి నిస్తాయి. ఇక అడవులను, దారిలోని చెట్లకు.... లాల పోసి లాలించే తల్లై పాడే చినుకు రాగం, సెలయేళ్ళ ధారలను జీవ ధారలతొ నింపే ఆ చినుకు మహిమ వర్ణించ నా తరమా... 

ఇలా ఇన్ని హొయలు పోయిన చినుకమ్మ ఆగుతుందా... సూరీడు కాసంత కనుమరుగవ్వటానికి తయారవుతూ.... రాత్రి ఏడు కల్లా అలసి పోయానోయ్ అని తన ఎరుపును చెట్టు కొమ్మల అంచున అద్ది, నును లేత చలి గాలి దుప్పటి కప్పుకుంటుంటే....... మరి నేను కూడా వెళ్ళాలోయ్ అని కన్నీరు మున్నీరు గా మా ముంగిట ధారలై నిలుస్తుంది. కొమ్మ కొమ్మ ను పువ్వు పువ్వు ను శెలవడిగి... మా అందరికి Happy Thanks giving, Merry Christmas ఆ పైన Happy new year అని చెపుతూ.... అప్పటికి వచ్చే విజయ దశమి కి చేమంతుల పూబంతులను పన్నీట జలకాలాడించి దుర్గమ్మకు పెట్టమని నిద్ర ఆలస్యం గా లేస్తానేమో అని మా కిటికి పైన ఈడ్చి కొట్టి మరి నిద్ర లేపుతుంది... ఇది మాత్రం చినుకమ్మ నాకొక్క దానికే ఇచ్చే ప్రత్యేక బంపర్ ఆఫర్.


ఇలా మా అందరితో ఎన్నెన్నో భావాల, అనుభవాల, అనురాగాలను పంచుకుంటూ...... మా మధ్యన నీటి తెర గా, ఆ అపైన పొగ మంచు తెర గా, చివరికి మంచు లా ఘనీభవించి.. మా శెలవడిగి, తెల్లటి చలి దుప్పటి కింద బొజ్జుని మరుసటి ఏడుకే నా పలకరింపు అని చెప్పి మాయమవుతుంది. ఇదండి మా వూరి వాన చినుకు చెప్పిన సద్దులు. బాగున్నాయా. ఒక జ్నాపకం అని చెప్పి ఎన్ని చెప్పానో చూసారా.. ఇందులో అన్నీ అందరికి తెలిసినవే ఐనా మంచి కబురు నలుగురితో మళ్ళీ మళ్ళీ పంచుకోమంటారు కదండి అందుకని ఇలా మీతో.  

     స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి.....    




ఎప్పుడో 230 ఏళ్ళ పై మాటే అమెరికా కు స్వాతంత్రం వచ్చి... వుహూ బ్రిటన్ వాళ్ళ నుంచి తీసుకుని ... ఎంత పెద్ద విజయమో.. !!!!ఎన్నెన్ని ఎత్తు పల్లాలో... ఎన్నెన్ని వివక్షతలో... వితరణలో... ఎన్నెన్ని దేశాల నుంచి ఎన్ని లక్షల మందో వచ్చి ఈ దేశాన్ని తమది గా చేసుకున్న వైనం. తలచుకుంటే చిత్రం...!!! స్వయం శక్తి తో ఆలోచించి తెచ్చుకున్న అబ్బుర పరిచే శక్తి..... ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చుకోగల ధీయుక్తి.. 

బానిసలు గా తెచ్చుకున్న నల్ల జాతీయులు... వారి తిరుగుబాటు... ఇప్పటికి వారిని బానిసలు గానే గుర్తిస్తున్న కొన్ని రాష్ట్రాల confederates...... మూతి మీద మీసమున్న వాడల్లా అరబిక్ సాహెబులు అనే అమాయకత్వం లో కొందరు.... ఇండియా వాళ్ళు కనపడితే వూరికే చేతులూపకుండా (షేక్ హేండ్స్) నమస్తే చెప్పి తప్పుకునేంత గా మన సంస్కృతి తెలిసిన వాళ్ళు మరి కొందరు... తెల్ల వాళ్ళ మధ్యనే కొందరిని చిన్న చూపు....... మరి కొందరికి పెద్ద పీట, అసలు వాళ్ళ దేశమైన రెడ్ ఇండియన్స్ కు వెనుకబడిన తెగల, జాతుల కింద రిజర్వేషన్స్. సంస్కారమంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి అనేంత గా ఎదుటి వాళ్ళను గౌరవించే తత్వం, ఎదుటి వాళ్ళ నమ్మకాలకు విలువలకు ప్రాధాన్యత నిచ్చే సాంప్రదాయం... ఎన్నెన్నో దేశాల, జాతుల, తెగల  మధ్యన.... భినత్వం లో ఏకత్వం... ఏకత్వం లో కోకోటి స్వరాలు.....ఇది ఈ దేశం గురించి నాలుగు మాటలలో చెప్పాలనుకుంటే...

నిజం గా నిజం చెప్పాలంటే ఈ దేశానికి ఎందుకొచ్చానో నాకే తెలియదు. బాగా డబ్బులు సంపాదించాలనా? బాగా చదువు కోవాలనా? పిల్లల కు మంచి భవిష్యత్తు (అంటే మనకు అందనిది, అదేమిటో మరి తెలియదు) ఇవ్వాలనా? ఇలా అనుకోవటానికి కొంచం చిత్రం గానే వున్నా ఏమో ఇప్పుడు తలచుకుంటే అప్పట్లో నా మనసులో ఏమి వుందో నిజం గా గుర్తు రావటం లేదు ....

ఏమోలే ఎందుకొచ్చినా...... ఈ దేశపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశం గురించి నాలుగు మంచి మాటలు పంచుకోవటమే సముచితమని నా ఆలోచన.


 మధ్య తరగతి జీవితాలలో పెద్ద గా ఎదుర్కోని వొడి దుడుకులు.... ఒక క్రమశిక్షణ.. నిబద్ధత... ఎన్ని ఆర్ధిక మాంద్యాలొచ్చినా ఇది వరకల్లే నే తేరుకుని వువ్వెత్తున పైకి లేస్తుందనే ఆశ... ప్రకృతి పచ్చదనం ఆ ప్రకృతిలోని వైవిధ్యత..... ఇంకో పక్క మనది కాని సంస్కృతిని మనది చేసుకునే మమైకత..

నాకు ఈ దేశం లో బాగా నచ్చేదేమిటంటే వాళ్ళ ప్రజలకు.... వాళ్ళ ప్రాణాలకు.. వాళ్ళు ఇచ్చే విలువ... వెంటనే అడుగుతారు మీరు.. వాళ్ళది కాని సమస్య కోసం వాళ్ల వాళ్ళను యుద్ధానికి పంపి చంపుకుంటున్నది ఇతరులను చంపించేది అమెరికా కాదా అని. బహుళ జాతి సామాజిక ఆర్ధిక ప్రయోజనాల కోసం అవును అమెరికా తీసుకున్న నిర్ణయాలు మిగతా కొన్ని దేశాలకు కంటగింపు గానే వుంటాయేమో కాని అమెరికా లోని పౌరులకు ఆఖరు లో మంచి ఫలితాలనే ఇవ్వటానికి దేశం ప్రయత్నిస్తుంది అని నా నమ్మకం. 

ఇక దేశం లోని మన పరిస్తితి అంటే, నాకైతే ఏం ఇబ్బంది అనిపించదు మరి... కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఆ వివక్షత కనపడుతుంది అంటారు కాని మా వైపు ఏమి అనిపించదు. ఇప్పటికే మనమేదో బాగా తెలివైన కుందేళ్ళమని, మనం ఈ దేశం లో బాగా నాటుకు పోయే మైనారిటీలమని ఇక్కడి అందరి బలమైన నమ్మకం. అలా పాతుకు పోవటానికి మనం పెట్టే పణం ఏమిటో మనం కోల్పోయే జీవితం ఏమిటో వీళ్ళకు అర్ధం కాదు. కోల్పోయే వాళ్ళకే అర్ధం కాదు ఇంక బయట వాళ్ళకు ఏం అర్ధం అవుతుంది లే.


చాలా మంది అదే దో రూల్ లా పుట్టిన దేశమో ఈ దేశమో ఏదో ఒక దానినే ప్రేమించాలి మరొక దానిని ద్వేషించాలి అన్న పంధా లో వుంటారు... నాకైతే రెండు దేశాలన్నా ఇష్టమే ... ఒకటి ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు.. ఒకటి నను కన్న దేశం.. నా మూలాలని గట్టి పరచి నను పెద్ద చేసిన దేశం. ఇంకొకటి నే మెట్టిన దేశం. నా ఆలోచనల పరిధిని పెంచి విశాలత్వం నేర్పి..... జీవితమంటే నేర్పి న దేశం... ఏది గొప్పదంటే ఎలా చెప్పగలం.


మొత్తానికి ఈ దేశం నాకు ఒక మంచి జీవన విధానాన్ని, ఒక మంచి జీవిత అనుభవాన్ని, నా మాతృ దేశం గురించి నేను సమూలం గా గర్వ పడగల సంస్కారాన్ని కూడా పెంచింది. అందుకే ఎవరేమన్నా I love America. Yes it's a capitalistic country. Which isn't ? 


Happy Independence Day .....