Subscribe RSSవేసవి పొగల కాలం దాటి, హేమంతాల సడీ వచ్చి...... చలి సందడిలో సద్దుమణిగి, మళ్ళీ వసంతాల ఉరుకులలో కాలం గిర్రుమని తిరిగి వచ్చినా నేను మాత్రం రాయటం అనేది పూర్తి గా మర్చి పోయాను. టైం లేదు అనే ఒక అందమైన అభద్దం తో నన్ను నేనే నమ్మించేసుకుని అందరిని కూడా నమ్మించేసి తిరుగుతున్నా. ఈ రోజు నా కోసం కాకపోయినా నా స్నేహితురాలికి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటం కోసం నెమ్మది గా వేళ్ళు విరుచుకుని "బద్ధకము, సందె నిద్దుర వద్దు సుమీ.... మొద్దందురు తోడి వారలు దద్దిరంబు వచ్చును దానిన్" అని సగం గుర్తు ఉన్న పద్యమొకటి పాడేసుకుని ఒక కాఫీ తెచ్చేసుకుని కూర్చున్నా.
జన్మ దినమంటే ఇష్టం లేని దెవరికి చెప్పండి.... అందునా స్నేహితురాలి జన్మ దినమంటే ఇష్టం లేని వాళ్ళు అసలే ఉండరు నా ఉద్దేశం ప్రకారం. చిన్నప్పుడైతే చాక్లెట్ లు, ఇంటికి పిలిచి కేక్ పెడతారు. ఆ రోజు హోమ్‍వర్క్ లు చేయనక్కర్లేదు, ఎంచక్క గా చీకటి పడే వరకు వాళ్ళ ఇంట్లోనే ఆడుకోవొచ్చు. మా నాగమణి, శేషుమణి వాళ్ళ పుట్టిన రోజైతే అక్కడే ఒక మూల కూర్చుని తెలుగు లో అనువదించిన రష్యా కధల పుస్తకాలు ఆ నునుపు దనం, ఆ మెరుపు.... వేళ్ళ తో అనుభవిస్తూ తాన్యా ఎక్కడెక్కడికి వెళ్ళి , ఏమి చేసిందో ఆ చల్లని మంచు కొండలలో తెలుసు కోవొచ్చు.
ఇంక రమ పుట్టిన రోజైతే వాళ్ళ అమ్మ కేక్ లా వండిన దిబ్బరొట్టి తినెయ్యొచ్చు. రాత్రి వాళ్ళ నాయనమ్మ ముద్దలు చేసి అందరికి కలిపి పెట్టే ఉసిరికాయ అన్నం ముద్దలు తింటూ, చీకటి పడే వరకు అన్నం తినమని మారాము చేసి, చీకట్లో అన్నం తిన్నందుకు వచ్చే జన్మ లో రాక్షసులై పుట్టిన వాళ్ళ కష్టాలు, వాళ్ళకు ఒక్క మనిషి కూడా తినటానికి దొరక క బాధ పడ్డ కధ లు వినొచ్చు..


అలా స్నేహితుల పుట్టిన రోజులకు మనకెన్ని విందులో వినోదాలో.. ఆనందపు నవ్వులో.. కేరింతల హేలలో.


ఇక పెద్ద అయ్యే కొద్ది వినోదాల విందుల కాల పరిమితి అనంతమయ్యి.. ఇంట్లో వాళ్ళకి ఎందుకొచ్చిన ఈ స్నేహితుల పుట్టిన రోజులు రా బాబు, దీనిని పట్టలేము ఆ రోజు అనే దీవెనల జల్లు లు తీసుకుంటూ పెరిగేస్తాము కదా.

చిన్న వయసులలో స్నేహితుల పుట్టిన రోజులను చూసిన సినిమాలతోనూ, చేసుకున్న పార్టీలతోను, కొనుకున్న చీరలతోను కలిపి, పుట్టిన రోజు ఆనందాన్ని అంచనా వేసుకోవటం అలవాటు అయ్యినా, పెద్ద అయ్యే కొద్ది జీవితపు రంది లో పడి స్నేహితుల సంఖ్య తగ్గుతుంది (చిన్నప్పుడు అందరూ ప్రాణ స్నేహితులే కదా మరి) ,  ఆ స్నేహితుల పుట్టిన రోజులను గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పటమే వాళ్ళకు మనకూ కూడా తలకు మించిన జ్నాపకం ఐపోతుంది. :-(


కాని వీటన్నిటి మధ్యన కూడా స్నేహమంటే నిజమైన అర్ధాన్ని, ఆ స్నేహ భందం లోని చిక్కదనాన్ని చక్క దనాన్ని ఒక్క వన్నె తగ్గకుండా, ఒక పిసరంతైన మధురిమ తగ్గించకుండా... కలిసిన చేతుల మధ్యగా అనంతమైన ఆప్యాయతను, లెక్కలేనంత... లెక్క కట్టలేనంత ప్రేమ ను కలబోసి ఇచ్చే నా నెచ్చలి జన్మ దిన శుభాకాంక్షలు చెప్ప గలగటం నా కొక అపూర్వమైన వరం..


నేస్తమా .... గుండె చప్పుడు లోని లయలో నీ మాట, అనంతమైన సముద్రపు కెరటాల నీ ప్రేమ, ఎగిరే పిట్ట రెక్కల సవ్వడుల నీ నవ్వు, రేపటి పొద్దున విరిసే పువ్వుల అంచున విరిసే తళుకున నీ ఆశ కలబోసి ఉంటావేమో, వీటన్నిటిని చూసినప్పుడల్లా నువ్వెప్పుడూ నాకు గుర్తు కొస్తూనే ఉంటావు. నే చెప్పక పోయినా, నా గుండె కష్టం లో మునిగితే.... నీ కంట నీరు తిరిగిందెదుకో అని ఆదుర్దా గా నాతో మాట్లటడటం కోసం ఫోన్ చేస్తావు... దినసరి జీవితం తో తలమునకలై నా ఆచూకి నాకే తెలియటం లేదని బిక్క మొహం పెడితే రేపటి జీవనాల పువ్వుల బాటను మాటల మంత్రజాలం తో నా ముందుఉంచి నడక సునాయసమే అని నచ్చ చెప్పి నవ్విస్తావు.

జీవితపు ప్రతి అడుగునా నిజమైన స్నేహానికి భాష్యం చెపుతూ... చేసే ఆకతాయి పనులను అమ్మ లా మన్నిస్తూ, చెప్పే వెర్రి మొర్రి మాటలను అక్క లా ఆలకిస్తూ, పరుగెత్తి మోకాలు పగలకొట్టుకుంటుంటే నిజమైన నేస్తం లా హెచ్చరిస్తూ, వినక పోయినా ఓర్పు గా చేయూతనిస్తూ , ఆరిందాల సలహాలిస్తుంటే చెల్లి లా వాటన్నిటీకి తల వూచుతూ... జీవితపు ఆటు పోట్ల గమనాలను నెచ్చలివై నాతో పంచుకునే నా నేస్తమా... నీ జన్మ దినాన ఈ నేస్తం నీకు కొత్త గా ఇవ్వగలిగినదేమి ఉంది... ఎప్పటిలానే శుభాకాంక్షలను చెప్పటం తప్ప...

ఏడు రాగాల వర్ణాలను కలిపి ఆనందపు హరివిల్లును చేసి గులాబితో పాటూ ఈ పాటనూ మా మరువాల కొమ్మ కు  కానుకిస్తూ...


జన్మ దిన శుభాకాంక్షలు ఉష. 
నీ ఉంటే వేరే కనులెందుకు.. నీకంటే వేరే బతుకెందుకూ...

ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు నాతో కలిసి నువ్వు పంచుకుంటావని నీ పుట్టిన రోజున నేనే నిన్ను కానుక అడుగుతున్నా.. ఇస్తావు కదు.చినుకు జ్ఞాపకం 


వాన అనగానే అందరికి చిన్నఫ్ఫుడు వానా వానా వల్లప్ప అని తిరిగిన లేత చినుకుల నవ్వులో ... లేక యుక్త వయసు లోని చిలిపితనాల చిందులు తొక్కించిన చినుకుల చిట పటలో , ఇంకా ముందుకు వస్తే శ్రీవారి/శ్రీమతి తో కలిసి ఆషాడానికి ముందు వెనుకలు గా సాగిన పరవళ్ళు తొక్కే చినుకుల సరాగాలు గుర్తు వస్తాయి. ఆ పైన భాద్యతల వరదలో మునిగి తేలుతూ, మళ్ళీ మునకలేస్తూ.... చినుకెప్పుడొచ్చిందో... పోయిందో తెలియని హడావుడి లో కూడా, ఇంటి ముంగిటకొచ్చి నన్ను పట్టించుకోవే అని చిందులు తొక్కిన, గారాల వయ్యారాల వాన పలుకుల జ్నాపకమొకటి మీతో పంచుకుంటూ...  


వర్షాకాలమంటూ ఒక ప్రత్యేక కాలమే లేని దేశం లో, ఈ కాలం ఆ కాలం అని లేకుండా.... ఏ కాలమైనా అకాలం గా వూడి పడగల ఏకైక అతిధి మాకు ఈ వాన జల్లే కదా.. జల్లంటే జల్లూ కాదు విరి జల్లు కాని, విరులంటే విరులూ కాదూ వరదల్లే కాని అని పాడుకోవటమే మాకు వాన వూసు వస్తే... వసంతమొచ్చిందో అని గుట్టలు పోసిన మంచు మీద పడ్డ వాన చినుకేగా, మొదటి సారి మరి మాకు వుప్పందించేది.  


ఆ కబురు కరిగిన నీరై, ఆ పైన మెరిసిన వాన చినుకుల తెల్లాటి మెరుపుల మురిసే లోపు, మేమొచ్చామో అని వాన చినుకు కు తోడు పూలు పైకొచ్చి పలకరిస్తాయి. ఇక పాడుకోవటం మొదలెడతాము కోటి ఆశలను గుండె నిండా నింపుకుని "April showers bring May flowers "  అని, ఇంకా మా కోసమని విరబూయ బోయే వనాల వరదలను తలచుకుంటూ... ఆ పైన మురుసుకుంటూ...


ఇక చూడు ఆ చినుకమ్మ విన్యాసాలు,  ఎన్ని కబుర్లను మోసుకొని తెస్తుందనుకుంటున్నారు. ఇదుగో దూర దేశానికి నిరుడు తరలి పోయిన ఆ పెద్ద డేగ లొస్తున్నాయి జాగర్త... ఇక్కడే కదా అని ఆలస్యం గా గూటికి చేరుకోకు అని చిన్ని గువ్వ పిట్ట కు రెక్క నిమురుతూ ఒక చినుకు... 
తన పిల్లలను పొదగటానికి ఎక్కడ నుంచో ఎగిరి మా అడవులకు రానున్న ఎర్ర కళ్ళ బుల్లి పిట్టలకు గూడు మెత్త గా వుందో లేదో అని ఆకు ఆకుని బతిమాలి గాలితో కలిపి తడిపి పక్క చేస్తున్న ఒక చినుకు.... వసంతమంతా మా ముంగిట పోయటానికి ముందటేడూ మిగిలిన ఆకుల అవశేషాలను వూడ్చి కళ్ళపి జల్లి పోతూ ఎన్నెన్ని చినుకులు పలకరిస్తాయనుకుంటున్నారు. సరి ఆ వసంత వీర భోగం అవుతుందా..
పూలతో సొమ్మసిల్లి ఎండలకు తేరుకుంటూ... ఎండాకాలం మాకు పంటల కాలం అని పాటలు పాడుకుంటూ...... ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపుసొలుపేమున్నది అని కూని రాగాలు (గిట్టని వాళ్ళు ఖూనీ రాగాలనటం కద్దు)  తీసుకుంటూ పనులు చేసుకుంటున్న మమ్ములను .. ఎండలలో మేమెక్కడ మాడి పోతామో అని ఒక వారం ఎండలు మండేయా, వెంటనే నేనున్నానని ఒక గ్రీష్మ గానం,  ఎండల ఎర్ర దనాన్ని పల్లవి గా చేసి, వుడుకు పొగల తాళం వేసి ఆ పైన చినుకమ్మలు..... గబ గబా గుబ గుబా వచ్చి వూసులాడుతూ.... పాటలాడతాయి.  మా పెరళ్ళలో అమృత ధారలు కురిపించి శక్తి నిస్తాయి. ఇక అడవులను, దారిలోని చెట్లకు.... లాల పోసి లాలించే తల్లై పాడే చినుకు రాగం, సెలయేళ్ళ ధారలను జీవ ధారలతొ నింపే ఆ చినుకు మహిమ వర్ణించ నా తరమా... 

ఇలా ఇన్ని హొయలు పోయిన చినుకమ్మ ఆగుతుందా... సూరీడు కాసంత కనుమరుగవ్వటానికి తయారవుతూ.... రాత్రి ఏడు కల్లా అలసి పోయానోయ్ అని తన ఎరుపును చెట్టు కొమ్మల అంచున అద్ది, నును లేత చలి గాలి దుప్పటి కప్పుకుంటుంటే....... మరి నేను కూడా వెళ్ళాలోయ్ అని కన్నీరు మున్నీరు గా మా ముంగిట ధారలై నిలుస్తుంది. కొమ్మ కొమ్మ ను పువ్వు పువ్వు ను శెలవడిగి... మా అందరికి Happy Thanks giving, Merry Christmas ఆ పైన Happy new year అని చెపుతూ.... అప్పటికి వచ్చే విజయ దశమి కి చేమంతుల పూబంతులను పన్నీట జలకాలాడించి దుర్గమ్మకు పెట్టమని నిద్ర ఆలస్యం గా లేస్తానేమో అని మా కిటికి పైన ఈడ్చి కొట్టి మరి నిద్ర లేపుతుంది... ఇది మాత్రం చినుకమ్మ నాకొక్క దానికే ఇచ్చే ప్రత్యేక బంపర్ ఆఫర్.


ఇలా మా అందరితో ఎన్నెన్నో భావాల, అనుభవాల, అనురాగాలను పంచుకుంటూ...... మా మధ్యన నీటి తెర గా, ఆ అపైన పొగ మంచు తెర గా, చివరికి మంచు లా ఘనీభవించి.. మా శెలవడిగి, తెల్లటి చలి దుప్పటి కింద బొజ్జుని మరుసటి ఏడుకే నా పలకరింపు అని చెప్పి మాయమవుతుంది. ఇదండి మా వూరి వాన చినుకు చెప్పిన సద్దులు. బాగున్నాయా. ఒక జ్నాపకం అని చెప్పి ఎన్ని చెప్పానో చూసారా.. ఇందులో అన్నీ అందరికి తెలిసినవే ఐనా మంచి కబురు నలుగురితో మళ్ళీ మళ్ళీ పంచుకోమంటారు కదండి అందుకని ఇలా మీతో.  

     స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి.....    
ఎప్పుడో 230 ఏళ్ళ పై మాటే అమెరికా కు స్వాతంత్రం వచ్చి... వుహూ బ్రిటన్ వాళ్ళ నుంచి తీసుకుని ... ఎంత పెద్ద విజయమో.. !!!!ఎన్నెన్ని ఎత్తు పల్లాలో... ఎన్నెన్ని వివక్షతలో... వితరణలో... ఎన్నెన్ని దేశాల నుంచి ఎన్ని లక్షల మందో వచ్చి ఈ దేశాన్ని తమది గా చేసుకున్న వైనం. తలచుకుంటే చిత్రం...!!! స్వయం శక్తి తో ఆలోచించి తెచ్చుకున్న అబ్బుర పరిచే శక్తి..... ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చుకోగల ధీయుక్తి.. 

బానిసలు గా తెచ్చుకున్న నల్ల జాతీయులు... వారి తిరుగుబాటు... ఇప్పటికి వారిని బానిసలు గానే గుర్తిస్తున్న కొన్ని రాష్ట్రాల confederates...... మూతి మీద మీసమున్న వాడల్లా అరబిక్ సాహెబులు అనే అమాయకత్వం లో కొందరు.... ఇండియా వాళ్ళు కనపడితే వూరికే చేతులూపకుండా (షేక్ హేండ్స్) నమస్తే చెప్పి తప్పుకునేంత గా మన సంస్కృతి తెలిసిన వాళ్ళు మరి కొందరు... తెల్ల వాళ్ళ మధ్యనే కొందరిని చిన్న చూపు....... మరి కొందరికి పెద్ద పీట, అసలు వాళ్ళ దేశమైన రెడ్ ఇండియన్స్ కు వెనుకబడిన తెగల, జాతుల కింద రిజర్వేషన్స్. సంస్కారమంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి అనేంత గా ఎదుటి వాళ్ళను గౌరవించే తత్వం, ఎదుటి వాళ్ళ నమ్మకాలకు విలువలకు ప్రాధాన్యత నిచ్చే సాంప్రదాయం... ఎన్నెన్నో దేశాల, జాతుల, తెగల  మధ్యన.... భినత్వం లో ఏకత్వం... ఏకత్వం లో కోకోటి స్వరాలు.....ఇది ఈ దేశం గురించి నాలుగు మాటలలో చెప్పాలనుకుంటే...

నిజం గా నిజం చెప్పాలంటే ఈ దేశానికి ఎందుకొచ్చానో నాకే తెలియదు. బాగా డబ్బులు సంపాదించాలనా? బాగా చదువు కోవాలనా? పిల్లల కు మంచి భవిష్యత్తు (అంటే మనకు అందనిది, అదేమిటో మరి తెలియదు) ఇవ్వాలనా? ఇలా అనుకోవటానికి కొంచం చిత్రం గానే వున్నా ఏమో ఇప్పుడు తలచుకుంటే అప్పట్లో నా మనసులో ఏమి వుందో నిజం గా గుర్తు రావటం లేదు ....

ఏమోలే ఎందుకొచ్చినా...... ఈ దేశపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశం గురించి నాలుగు మంచి మాటలు పంచుకోవటమే సముచితమని నా ఆలోచన.


 మధ్య తరగతి జీవితాలలో పెద్ద గా ఎదుర్కోని వొడి దుడుకులు.... ఒక క్రమశిక్షణ.. నిబద్ధత... ఎన్ని ఆర్ధిక మాంద్యాలొచ్చినా ఇది వరకల్లే నే తేరుకుని వువ్వెత్తున పైకి లేస్తుందనే ఆశ... ప్రకృతి పచ్చదనం ఆ ప్రకృతిలోని వైవిధ్యత..... ఇంకో పక్క మనది కాని సంస్కృతిని మనది చేసుకునే మమైకత..

నాకు ఈ దేశం లో బాగా నచ్చేదేమిటంటే వాళ్ళ ప్రజలకు.... వాళ్ళ ప్రాణాలకు.. వాళ్ళు ఇచ్చే విలువ... వెంటనే అడుగుతారు మీరు.. వాళ్ళది కాని సమస్య కోసం వాళ్ల వాళ్ళను యుద్ధానికి పంపి చంపుకుంటున్నది ఇతరులను చంపించేది అమెరికా కాదా అని. బహుళ జాతి సామాజిక ఆర్ధిక ప్రయోజనాల కోసం అవును అమెరికా తీసుకున్న నిర్ణయాలు మిగతా కొన్ని దేశాలకు కంటగింపు గానే వుంటాయేమో కాని అమెరికా లోని పౌరులకు ఆఖరు లో మంచి ఫలితాలనే ఇవ్వటానికి దేశం ప్రయత్నిస్తుంది అని నా నమ్మకం. 

ఇక దేశం లోని మన పరిస్తితి అంటే, నాకైతే ఏం ఇబ్బంది అనిపించదు మరి... కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఆ వివక్షత కనపడుతుంది అంటారు కాని మా వైపు ఏమి అనిపించదు. ఇప్పటికే మనమేదో బాగా తెలివైన కుందేళ్ళమని, మనం ఈ దేశం లో బాగా నాటుకు పోయే మైనారిటీలమని ఇక్కడి అందరి బలమైన నమ్మకం. అలా పాతుకు పోవటానికి మనం పెట్టే పణం ఏమిటో మనం కోల్పోయే జీవితం ఏమిటో వీళ్ళకు అర్ధం కాదు. కోల్పోయే వాళ్ళకే అర్ధం కాదు ఇంక బయట వాళ్ళకు ఏం అర్ధం అవుతుంది లే.


చాలా మంది అదే దో రూల్ లా పుట్టిన దేశమో ఈ దేశమో ఏదో ఒక దానినే ప్రేమించాలి మరొక దానిని ద్వేషించాలి అన్న పంధా లో వుంటారు... నాకైతే రెండు దేశాలన్నా ఇష్టమే ... ఒకటి ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు.. ఒకటి నను కన్న దేశం.. నా మూలాలని గట్టి పరచి నను పెద్ద చేసిన దేశం. ఇంకొకటి నే మెట్టిన దేశం. నా ఆలోచనల పరిధిని పెంచి విశాలత్వం నేర్పి..... జీవితమంటే నేర్పి న దేశం... ఏది గొప్పదంటే ఎలా చెప్పగలం.


మొత్తానికి ఈ దేశం నాకు ఒక మంచి జీవన విధానాన్ని, ఒక మంచి జీవిత అనుభవాన్ని, నా మాతృ దేశం గురించి నేను సమూలం గా గర్వ పడగల సంస్కారాన్ని కూడా పెంచింది. అందుకే ఎవరేమన్నా I love America. Yes it's a capitalistic country. Which isn't ? 


Happy Independence Day .....

సుప్రభాత రాగాలు


ఉదయపు సుప్రభాత రాగాలను నాకు అనిపించిన/కనిపించిన/వినిపించిన రీతిన పంపిస్తుంటే వాటిలో కొన్నిటికి వర్ణాలద్ది ఒక టపా లా చేసి ఇచ్చిన నా ప్రియ/ప్రాణ మిత్రురాలు ఉష కు ప్రేమ తో ఈ టపా.....

ROYGBIV - VIBGYOR ఏదమ్మా నీ వైనం?


కెంపువర్ణ నునుసిగ్గు బుగ్గలు భూదేవి మురిపెమా?
రాత్రంతా ఆగాగి కురిసిన వాన జల్లులన్నీ భూదేవి ని స్నానమాడించి ప్రభాకరుని తో కలయిక కోసం సిద్ధం చేసాయి. జలకమాడిన పడతి మేనికి పుప్పొడి జాజర పూసి ఋణం తీర్చుకున్నట్లున్నాయి పూల కొమ్మలు... మేమేమైనా తక్కువా అని రాత్రి మిగిలిన నీటి తుంపరలను తెలి ముసుగు చేసి ఆమెకు అలంకరణలో సాయమోచ్చాడు వరుణదేవుడు. దుముకులాడే ఏరేమో ఆమె వొంపు సొంపుల్లో... ఎత్తు పల్లాల మధ్య సర్దుకుని పక పక లాడింది. ఇంత అలంకరణతో ప్రియురాలిని చూసిన సూరీడు రోజు కంటే ముందే వచ్చేసాడు ఆమె కోసం ఆనంద కిరణాలను వెద జల్లుకుంటూ.. అబ్బో రసికుడే.. అను నిత్యం జరిగే వారి సమాగమపు ఆనందాన్ని మొగ్గలేసి పువ్వులేసి కిల కిలా పిట్టల నవ్వులేసి.... ప్రకృతి సంబరాన్ని చేస్తోంది.... లోకులంతా సంబరపు నవ్వు బాకాలను , సంతోషాల బూరలను చేత పట్టి ఈ అధ్బుత ఆనంద రాగాలను వర్ణ మిశ్రమం చేసి పాడటానికి తయారవుతున్నారు. మరి భూదేవి మురిపెపు సిగ్గుల మెరుపు కాక ఏమిటి ఆ లేత వన్నెల ఎరుపు......


*****


నారింజ వన్నె పొద్దు ఆ వన్నె నెదుకుతూ పొద్దుగూకే వరకు..
ఎప్పటి లానే ఈ ఉదయం కొత్త వెలుగుల సూరీడుని, మరువలేని వెలుగులను తీసుకోచ్చేసింది.
ఎప్పటిలానే మానస మొక పద్మమయ్యి కనుల రేకుల విచ్చింది.
మరి ఎప్పటికి రాని చెలుని జాడలీనాడైనా ఆగాగి వీచే గాలి తెమ్మెర తెచ్చేనా...??????
దూరాన తానున్నా.... తన నీడ నేనైనా...... నేను నా నీడా కలిసేమా..
ఉదయమా చెప్పమ్మా సూరీడుని కుంగబోకమని
కుంగిన వెలుగున దీర్ఘమైన నా నీడ, మాయమయ్యి చెలికాని తలపు నుంచి నన్ను తప్పిస్తుందేమో....
నారింజ వర్ణాల వెలుగు  కమ్ముతుందేమో అని  ఉదయమే ఆశ 
సాయింత్రానికి  చెలుని జాడ కానక కాపు కాసిన చీకటి దాని వెంబడి వున్నదని దిగులు మిశ్రమమే ఈ నారింజ వెలుగులు.. 


******


పవిత్ర సమాగమాలన్నీ  పసుపు కుంకుమల మేలుకలయిక కాదా?
ప్రతి వుదయమొక నూతన జీవన సౌందర్యమే గా చూడగలిగిన కన్నులకు... ఇంత అందం లోను కొంత వెలితి, ఆ వెలితిలోను నిండిన సంపుర్ణత్వం తోచే సౌందర్యం ఈ ప్రకృతి లో కాక ఇంకెక్కడ తోస్తుంది చెప్పు. ప్రకృతి అంటే మనమే కదా ఆ పంచ ధాతువులతో చేసిన ఈ శరీరం... దానిని, అందులోని మనసును, బుద్ధి ని, హృదయాన్ని ప్రతి క్షణం ప్రభావితం చేసే ప్రకృతి తో అనుక్షణం చేసే సమాగమపు సంబరాలు ఎన్ని చెప్పినా అది ఒక అసంపూర్ణ కావ్యమే... ఎన్ని రాసినా అది ఒక రాయటానికి మిగిలిపోయిన లేఖే కదా... మౌనం ఎన్ని సార్లు కోట్ల జీవ రాగాలను కట్టి .....ఆకులను తట్టి పోయే గాలి తో కలిపి.. మన చెంప నిమిరే మందహాసమై...... ఎన్నెన్నో సార్లు నీ బుగ్గల మీదకు జారే కన్నీటి రాగమై కధలు పాడీ వినిపించలేదు... ఎన్ని సార్లు మధ్యాన్నపు ఎండ ఏటి మీద నీటి ని గాలి తో కదుపుతూ జీవిత సారాంశాన్ని వేదాంతం గా "ప్రశాంతత ఒక్కటే నీకు కావలసిన ఏకైక సాధనం అది నీతోనే నీలోనే వుంటుంది" అని నెమ్మది గా బుజ్జగిస్తూ చెప్పలేదు. ఎన్ని సార్లు సాయింత్రపు కడపటి కిరణం దూరం గా పచ్చటి చెట్టు మీద మెరుస్తూ ప్రణయ గీతాలను గతించిన కాలాలను గడపవలసిన కాలానికి మధ్య వారధేస్తూ నిను ముందుకు నడిపిస్తూ తనేమో వెనక్కి వాలిపోలేదు.. ఎన్నెన్నో భావాల అనుభవాల చిత్రాల మిశ్రమం పసుపు వన్నెల వెలుగులే గా నేస్తం... 


******


ఆకుపచ్చ విప్లవమా ఈ ఉదయం ?
శుభోదయం. పక పక నవ్వే పచ్చటి వనాలను విసిరిన సూరీడుకు వందనాలతో.... చిటపట లాడే ఎండలకు చిర చిర లాడే చెమటలకు... వుస్సో అస్సో ఆప సోపాలకు.. శుభోదయం. .. ఊరంతా ఘుమ ఘుమ లాడే సుగంధాల జాజర పూసిన కల కల మన్న పువ్వులకు శుభోదయం. ఆకుపచ్చ విప్లవమే మా ఊరినిండా.... చల చల్లని గాలి కలలే మా కళ్ళ నిండా మా కోసం  సూరీడిలా వెలుగు రేకలిస్తాడని.... రేకల విచ్చుకున్న జీవన సౌందర్యం మా జీవితాల వికసిస్తుందనీను.. కలలను సాకారం చేసిన భాస్కరుడికి శుభోదయం. సుభోదయాల విరిసిన హరిత వర్ణాలన్నీ మరి భాస్కరుడు మండిచే  విప్లవమేగా ????? కాదంటావా.... 


*******


నిండు నీలాల హారాలు మా దేవికి నయగారాల మురిపాలు..   
ఆగనా మాననా తేల్చని చినుకేమో
ఆగనంటున్న చిగురు కొమ్మల అంచున ఆగాగి మెరుస్తోంది...
నది అద్దం లో చూసి షోకు పడుతున్న కొమ్మ రెమ్మ లతో
అద్దాన్ని కదుపుతూ ఆట పట్టిస్తూ పక పక లోడుతోంది ఇంకో చినుకు.
వయ్యారాల ధరణి పుత్రిక శృంగార సరాగాల తో బద్దకించిన సూర్య వంశీయుడు ప్రతాపాలు కట్టి పెట్టి బోజ్జున్నాడేమో.....
సింగారాల హైమవతి సరస సల్లాపాల తేలిన శైల పతి దరహాసాల చంద్రికల చాయలు భూమిని వీడలేదు..
తప్పక... తప్పించుకోని బతుకు పరుగు పందెం లో అన్నిటిని ఆస్వాదిస్తూ అంతలోనే వురుకులెడుతూ
గమ్యమేదో తెలియకున్నా, గతి తప్పని పరుగుకు సిద్దమా.....
ఇన్ని పరుగుల బతుకు గతుల నీలాల హారాలను ఆ తల్లి మనకల్లితే  ఆ తల్లి కంఠాన నీలాల హారాల మురిపాలను కానుకిస్తోంది ఈ ఉదయం... 


*****


నీలాకాశం మళ్ళీ తొంగిచూస్తేనో?  
ఒంపులు తిరిగి వయ్యారాలు పొయ్యే నదికి చినుకు సోకుల సింగారాన్ని అద్దుతోంది ఈ వాన. పలకరించే వసంతుడి పిలుపుకు పులకరింతలతో సమాగమించి పచ్చదనాన్ని ప్రసవిస్తున్న పుడమి తల్లి కి పచ్చిక వొత్తుల పచ్చదనాన్ని దుప్పటి కప్పి చిగురుమోలకల ఎర్రదనాల నిగారింపును ఇంకా మెరిపిస్తూ మొగ్గల ఆవిర్భావానికి తన వంతు  సాయమందిస్తూ ప్రకృతి లో మమేకమవ్వాలని కాబోలు ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా చివరకు మా కిటికీ అద్దాల మీద కూడా మంచు ముత్యాలై మెరుస్తూ ఎన్ని హొయలు పోతుంది వాన మా ఊరిలో.. హొయల వెనుక మెరిసే నీలాకాశం నీకు కానుకిస్తూ ఈ ఉదయం నీతో.. 


******


ఊదా రంగు ఉదాసీనత అనగలమా ఈ ఉషారైన ఉదయాన్ని?   
రేయి పగలైనా పగలింకా రేయి ఛాయ లో మిగిలి పోయిందదేమో. ఆగక కురిసే వాన వస్తానన్న సూరీడును ధిక్కరించి గాఢమైన మబ్బులలో వూపిరాడని చినుకుముద్దులతో నిద్దరపుచ్చేసింది. ఇంక వాన గాలమ్మ తోటి  చెట్టాపట్టాలతో మొలక భామలకు, పూబాలల కు వూపిరిలూదేందుకు కావలసిన శక్తి ని తన వంతు గా ఇచ్చేస్తూ... ఇక్కడక్కడా అనని గడ్డీ మొలకల మీద పచ్చదనాలను వత్తు గా పేరుస్తూ గల గలల గానాన్ని పిల్ల కాలువలకు అరువిస్తోంది. ఇంత వుషారైన ఉదయాన్ని అందరు మబ్బు ముసురేసింది, మగత గా వుంది అంటారెందుకో కదా? ఈ మత్తు కన్నుల ఊదా వర్ణాల మధ్య మునిగి తేలుతూ ఈ ఉదయం ఇలా నీతో..... 


*****


అన్ని వన్నెలు... వైనాలు చూపాక ఇంకా వస్తూనే ఉన్న ఇంకో ఉదయం..  
ఎప్పటి లానే ఈ ఉదయం కొత్త వెలుగుల సూరీడుని, మరువలేని వెలుగులను తీసుకోచ్చేసింది.
ఎప్పటిలానే మానస మొక పద్మమయ్యి కనుల రేకుల విచ్చింది.
మరి ఎప్పటికి రాని చెలుని జాడలీనాడైనా ఆగాగి వీచే గాలి తెమ్మెర తెచ్చేనా
దూరాన తానున్నా తన నీడ నేనైనా...... నేను నా నీడా కలిసేమా..
ఉదయమా చెప్పమ్మా సూరీడుని కుంగబోకమని
కుంగిన వెలుగున దీర్ఘమైన నా నీడ, మాయమయ్యి చెలికాని తలపు నుంచి నన్ను తప్పిస్తుందేమో....


ఏమో? ఏమిటీ భావన...


అన్ని నాకే కావాలి అనుభవించాలి ప్రపంచం లో...... ఆనందాన్ని సాధించాలి జీవితం లో.. ప్రేమ కావాలి నా అనుకున్న వ్యక్తుల నుంచి.... నేనెంతో ప్రేమ నివ్వాలి నా వాళ్లకు..... ఇంకా ఇంకా..... ఇది కాదు జీవితం ఇంకా ఏదో సాధించాలి, ఇంకా చేతిలోకి తీసుకోవాలి అధ్బుత ఆనందాలు అనుభవాలు.... ప్రేమలు....సంపుర్ణమవ్వాలి ఆ అమృత ధార లో... కావాలి నాకు కావాలి అనే తపన నెమ్మది గా సన్నగిల్లి ఇచ్చేది, తీసుకునేది, కావాలనేది, కావాలన్నా వద్దనుకునేది అన్ని ఆ కృ ష్ణయ్యే అని నెమ్మది గా అర్ధమయ్యి ఆయన ఇచ్చినది ఇచ్చినట్లు తీసుకుని ఆయన కే మొత్తం అప్పచెప్పి హాయి గా చూడటమే. గీతాంజలి లో అన్నట్లు నా ఇంటి తాళాలు ఆయనకే ఇచ్చాను. తీసి నాకే సాదర స్వాగతం పలుకుతాడో మరి నన్నే తన కొరకు ఆసన మొకటి వేయమంటాడో నా కృష్ణయ్య.. 


విశ్వ వ్యాప్తమైన ప్రేమ ఎంత మంచి ఆలోచన కదా. నా వాళ్ళు.... నా భర్త/భార్య, తల్లి తండ్రులు, పిల్లలు.... అక్క చెల్లెళ్ళు స్నేహితులు ఈ బంధాలన్నీ వుంటాయి వాటిని తప్పించు కోవటం మనకు సాధ్యం కాక పోవొచ్చు కాని ఈ బంధాలన్నీ దాటిన విశ్వ వ్యాప్తమైన ప్రేమ... ఎందఱో యోగులు సాధన చేసి సాధించిన అమర ప్రేమ తత్త్వం, రాదా కృష్ణుల ల ప్రేమ తత్త్వం... జగాన నిండిన విశ్వ వ్యాప్తమైన ప్రేమ.... అవధులేని మల్లెల రజనల్లె, అంతు లేని అవధులే లేని సంద్రపు అలల నురగల్లె... విశ్వ వ్యాప్తమైన ప్రేమ. చెప్పటం చాలా తేలిక ఇలా రాసుకుంటూ వెళ్ళి పొతే పేరా పేరా లు రాసేయ్యొచ్చు కాని ఎంత తిరిగినా వృత్తం లోనే ఆవృత్తమైన నా ప్రేమ తిరిగి కేంద్ర బిందువైన నీ మీదకే మరలుతోంది కృష్ణయ్యా నీవే దిక్కు మొక్కు శరణాగతిని అని ఆయన కాలి మీదకే నా ప్రాణ మొక పూరేకై వురుకుతోంది అని ముగించాను వచ్చు.. మన మనసు మన ఇష్టం కదా...


హ్రస్వమవుతున్న నీడకు వీడ్కోలు చెప్తూ దీర్ఘమవుతున్న రోజులకు స్వాగతమంటూ... హరివిల్లు లోకాన అందాల జీవితాన సాగిపోతూ.. 


ఈ రోజు కు ఇలా నా ఉదయపు క్షణాల కొన్ని భావాలను అందరితో పంచుకుంటూ ఈ ఆలోచన ఇచ్చి అన్నిటిని కలిపి ఒక సూత్రాన గుచ్చిన నా నేస్తం ఉష కు ధన్యవాదాలతో... 

 వాడి మాటల వేటూరి.. మధుర గేయాల రామయ్య...

వాడి మాటల వేటూరి.. మనో సుందర రామయ్య... ఆ కవితా మూర్తి గానవాహిని తో కాసేపు.

పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను  పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి గారి కు ఆశ్రునివాళులతో...


శరీరానికే కాని మనసుకెప్పుడూ వృద్ధ్యాప్యం లేదని ఎప్పటీకి మనసు కు చిగురుటాకుల అనుభవం, చిరుమెత్తని ప్రేమ స్పందన, చిన్నారి వాన చినుకు ఏదైనా ప్రేమ ఘాడతను తిరిగి తెప్పించ గలదని.... నవవసంతాన్ని కలం పలికించగలదని తెలియచెప్పిన సారస్వత మూర్తి కు ఇవే నీరాజనాలు...


కన్నుల పొంగేను కావేరి గొంతున పలికెను సావేరి ఈ నిశీధి లో రగిలే నా హృదయం...  రాగం రాదా ఈ వుదయం నాకోసం -- అని పాడుతూ (కల్యాణి),  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=5354 ,  


వేణువు లోని స్వరమై భువనానికి వచ్చి గాలినై పోతాను గగనానికి (మాతృదేవోభవ)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=12459....   


ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకు, చందమామ కు రూపముండదు తెల్ల వారితే... ఈ మజిలి మూడూ నాళ్ళే ఈ జీవ యాత్ర లో.. (సుందరాకాండ)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=11039........ఇలా ఎంతెంతో జీవిత వేదాంతాన్నిరస రాగాలలో మా అందరికి పంచి..... మా గగనాన మబ్బు అల్లే అల్లికలలో... వేణువు న సాగే రాగాలలో... మా అందరి మనస్సులలో అజరామరమై నిలిచిన స్వర రాగ సుందరుడి కివే శత సహస్ర వందనాలు.


వందనాలు వందానాలు వలపుల హరి చందనాలు వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి -- అని ఆర్ధ్రత తో పలికించినా (జేగంటలు)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=7529...


సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో మలయజ మారుతశీకరమో మనసిజ రాగ వశీకరమో -- అని పదభందంతో మధురం గా వలపు పలికించినా (అమావాస్య చంద్రుడు)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=5767...


అలా మండిపడకే జాబిలి చలి ఎండ కాచె రాతిరి -- అని వయ్యారం గా వగలొలికించగలిగినా (జాకీ) http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=2115.....


అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక శీతాకాలం సాయంకాలం అటు అలిగి పోయే వేలా.. చలి కొరికి చంపేవేళ -- అని బహు చిన్ని పదాలతో చమత్కారాన్ని మెరిపించినా (శ్రీవారికి శోభనం) http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=6016.....,


స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు వణుకు అందగత్తెలో -- అని శృంగార రస వర్షాన్ని కురిపించినా (ఆఖరి పోరాటం)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=10752...ఆయనకు ఆయనే సాటి ఇంకెవరు లేరు ఆయనకు పోటి..


వుహూ అస్సలు తృప్తి లేదు కొన్ని పాటలతో సరి పుచ్చుకోవాలంటే.. ఇంకా కొన్ని చప్పున మనసు కు తోచేవి  కూడా కలపాలని వుంది.


ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటీ వో మేఘమా -- అని దాపున లేని చెలి కోసం విరహాన్ని కురిపించినా (మేఘ సందేశం)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=1364..


రవి వర్మకే అందని ఒక అందాన్ని మాటలో మన కళ్ళ ముందు సాష్కాత్కరింప చేసినా (రావణుడే రాముడైతే) http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=1265...


ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగక -- అని జీవిత వేదాంతాన్ని పరిచయం చేసినా (సిరిసిరి మువ్వ)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=4816..


ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని ఆ చితి మంటల చిటపటలే నాలో రగిలే కవితలని -- అని హృదయ గీతాన్ని రగిల్చి (మల్లెపూవు)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=2039...
ఇలా ఎన్నని... ఎన్నెన్నని ఆ కృష్ణ వొడ్డున పుట్టి ఆ అందాలను పదే పదే ఆయన తలుస్తూ.... మనలను మురిపిస్తూ, మనో సైకతాన పాటల కోటలను కట్టి దానిలోని ఒక వేలుపై నిలిచిన కవి కు, మనసుకు ఆప్తుడైన మహా మనిషి కు ఆయన పదాలలోనే.... "అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజన అంజలిదే గొనుమా" అని పాడుకోవటం తప్ప తిరిగి ఏమివ్వగలం.... తిరిగి రాని లోకాలలో తన పద చాతుర్యం తో కవితాత్మక హృదయాలను వెలిగించ వెళ్ళి మహారధునికి...
అందుకే కన్నీళ్ళతో ఈ హృదయాంజలి .

Category: | 12 Comments

ప్రపంచ మహిళా దినోత్సవం.

ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం అట.. అంటే అని కాసేపు బుర్ర గోక్కున్నా నేను.. అంటే ప్రపంచ వ్యాప్తం గా మహిళలను వాళ్ళ రాజకీయ, సామాజిక, ఆర్ధిక స్తితి గతులను గురించి ఆశావాద దిశగా సమీక్షిస్తారు, సమీక్షించి తదనుగుణం గా సంబరాలు చేసుకుంటారు అని గూగులమ్మ చెప్పింది.. సరే ఇక్కడ వున్న(ఖండాతరాలలో)మేమందరం, అంటే మహిళలందరం ఒక ప్రత్యేక తరగతి కి చెందుతాము కాబట్టి మా రాజకీయ, సామాజిక, ఆర్ధిక ప్రగతి.... రెండు పక్కల నాగరికత ను కలుపుకుంటూ, మేమే దిశా నిర్దేశం చేసుకోవాలి.... మేమే ప్రగతి పరిశీలనా చేసుకోవాలి కూడా. ఆ దిశలో ఈ మహిళా దినోత్సవం రోజు మీతో మా ఆటు పోట్లు, ఎగిసిన అలలు, విరిగిన కొన్ని కలలు అన్నీ కలబోసి సరదాగా

ఈ పరిశీలన గత 14 ఏళ్ళ నుంచి ఈ దేశం లో వుండి, మా కంటే ముందు వచ్చిన వాళ్ళను, వాళ్ళ పిల్లలను, మా తరం వాళ్ళను, మా తరువాతి తరం వాళ్ళను నేను చూసినంత వరకు, లేదా నా స్నేహితులు చెప్పిన దానిని బట్టి గ్రహించినవి. ఇవి కేవలం నా ఆలోచనలు మాత్రమే. ఇంతకు తరం అంటే ఎంత వయసు తేడా తో ఒక తరాన్ని ఇంకో తరాన్ని నిర్ణయించావు అని ఎవరైనా అడిగితే చెప్పటం కష్టమే. ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్తితులను గణన లోకి తీసుకుంటే 60 ల నుంచి 70 మధ్య ల వరకు వచ్చిన వాళ్ళ లో పెద్ద మార్పేమి కనపడలేదు. మధ్య 70 ల నుంచి 80 చివరాకరుల వరకూ మళ్ళీ ఒక తరమనుకుంటే, అక్కడ నుంచి దాదాపుగా ప్రతి 5 సవత్సరాలకు ఒక తరం గా నిర్ణయించాలేమో అనుకుంటా ఈ సాంకేతిక విప్లవాల మూలం గా.........

ఇన్ని తరాల ప్రమదల ప్రగతి ని, పరుగునూ, పడి తగిలించుకున్న దెబ్బలను, మానేక ఆ మచ్చలను కలుపుకుంటే...... మేమందరం ఇక్కడ చేసే ఒక అందమైన క్విల్ట్ (మన అతుకుల బొంత) లోని వేరు వేరు రంగుల, కాని సారుప్యాన్ని కలిగి వున్న భాగాలం. కాని ఇలా లెక్కలు, డొక్కలు చూడాలంటే అందునా ప్రమాణ సూచికలు నిర్ణయించని మా వంటి వారి ప్రగతి గురించి కొంచం కష్టమే ..

సంపాదించటమే ఆర్ధిక ప్రగతి కి సూచిక అనుకుంటే......... మొదటి తరానికి, ఇప్పటికి చాలానే ప్రగతి సాధించామనుకోవాలి... వుద్యోగాల తోటి సొంత సంపాదన, సంపాదన లేక పోయినా ప్రతి పైసా కు లెక్క చూడగల సామర్ధ్యం బాగానే వచ్చిందనుకోవాలి ఇక్కడ మాకు. మాములు గానే ఎవరికైనా, అందునా మన దేశం వాళ్ళకు వున్న గొప్ప అదనపు ప్రత్యేకత.. అంతే గొప్ప అనర్హత కూడా మన నాగరికత (నేను సింధూ నాగరికత లేదా ఎప్పటిదో కాదు, ఇప్పడు మన మధ్య న నడుస్తున్న, మన అని పిలవబడుతున్న నాగరికత ను రిఫరెన్స్ గా తీసుకున్నాను) దాని మూలం గా సాధించిన ఆర్ధిక ప్రగతి లో కనపడని చిల్లులెన్నో.. కాని తరానికి, తరానికి మారుతున్న మహిళ చాలా త్వర గానే ఆర్ధిక అంశాన్ని దానితో తనకు వస్తున్న స్వతంత్రాన్ని గమనించి దానిని నిలబెట్టుకుంటున్నట్లే వుంది.. ఇంకా సాధించవలసింది ఎంతో వుంది.. సాధిస్తారనే నమ్మకం వుంది. ముందు తరాలకు మేము పిచ్చి అమ్మ లు గా పొద్దుగూకులు పిల్లల కోసం తపన పడే silly crazy and often refered as poor innocent Moms (stupid moms is an inside expression though) గా ముద్ర వేయించుకున్నా, వాళ్ళు సాధించ బోయే మరింత ఆర్ధిక ప్రగతి వెనుక, కుటుంబ శ్రేయస్సు ను కలుపుతారు, కలిపి ఇంకా మేము వూహించని ప్రగతి మా కళ్ళముందు నిలుపుతారనే అనుకుంటున్నా.

ఇక రాజకీయ ప్రగతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. ఎన్ని సవత్సరాలున్నా ఎందుకో మనకు..... "రాజకీయాలు మనకు కాదులే" అనే ఆలోచన ఎందుకు పోదో మరి అర్ధం కాదు... పూర్తి గా అమాయకం గా కొండకొచో భర్త అడుగుజాడలలో నడుస్తాము చాలా వరకు ఇక్కడి మహిళా ప్రపంచం రాజకీయ పరం గా.. అప్పటికి ఇక్కడ చాలా తేలిక అర్ధం చేసుకోవటం.. రెండే రెండు పార్టీలు.... మన మునిసిపాలిటీ కౌన్సిలర్ ల లెక్కన మన టౌన్ లోను మెంబర్ లు, ఆ పైన మేయర్ లు, ఆ పైన స్టేట్ మెంబర్లు, మేయర్ లు, గవర్నర్ లు, ఆ పైన సెనేట్ లు మెంబర్ లు అస్సలు కష్టం గా వుండదు.. మన టౌన్ లో కూడా నెల కొక సారి మీటింగ్ లు వుంటాయి. మన వూళ్ళో పోలిసోడి మీద కోపం వచ్చినా మనం మీటింగ్ కు వెళ్ళి మన అక్కసు వెళ్ళ గక్కొచ్చు. ఇంకా మన ఇంటి ముందు చెత్త వారానికి ఒక సారా రెండు సార్లు తీసుకు వెళ్ళాలా ,వెళితే మనం మర్చి పోయి పెట్టిన కరంట్ బల్బ్ వాడు తీసుకెళతాడా తీసుకెళ్ళడా అనే విషయం గురించి కూడా వోటు వెయ్యవచ్చు..ఆ పైన మనం కట్టే టేక్స్ లు ఎంతెంత భాగం ఎవరికి వెళుతున్నాయో చూసి, ఏమి తోచనప్పుడు కళ్ళ నీళ్ళెట్టుకోవొచ్చు.మనం కట్టే సోషల్ సెక్యూరిటీ టేక్స్ లు మన H1 ఐపోయాక ఇండియా వెళి పోతే వస్తాయా రావా అని వర్క్ లో లంచ్ టేబుల్ దగ్గర ఎవరైనా బకరా దొరికితే క్లాస్ పెట్టొచ్చు. చాలా వుపయోగాలు వున్నాయి మనం ఈ రంగం లో ప్రగతి సాధిస్తే. అన్నిటి కంటే ముఖ్యమైన భాగం మనం ఈ సమాజం లో ని ఒక భాగమనే నమ్మకం, ఆ పైనా ఆ నమ్మకం కలిగించే ఆత్మ విశ్వాసం... ఆర్ధిక, సామాజిక ప్రగతి సాధించటానికి కూడా వుపయోగ పడుతుంది. కాని ఎందుకో మన వాళ్ళు ఈ దిశ గా అస్సలు దృష్టి పెట్టం, సాధించింది అల్పం ,ప్రగతి దిశలో దూసుకెళ్ళవలసిన దారి అనంతం అని నా అభిప్రాయం.

ఇంక ఆఖరిది మన ఆడవాళ్ళు ఏ దేశం లో వున్నప్పటికి ఎప్పటికి మనస్పూర్థి గా ఎప్పటికి మాట్లాడనిది, సాధించిన ప్రగతి కూడ తప్పేమో అని బెంగ గా, సిగ్గు గా దాచుకునే ది ఈ సామాజిక ప్రగతి. సామాజిక ప్రగతి ప్రమాణాలేమిటి అనే ప్రశ్న........ అందునా ఏ దేశపు సమాజానికి పూర్తి గా అన్వయించు కో బడలేని మేము, ఈ ప్రగతి సాధించటమంటే విశ్వామిత్ర సృష్టి నుంచి అటో ఇటో మళ్ళటమే. నా వరకు సామాజిక ప్రగతి అంటే భావ స్వాతంత్రం, బలమైన వ్యక్తిత్వం, ప్రశ్నించ గల సామర్ధ్యం, నమ్మిన దానిని ఆచరించ గల మానసిక ధారుడ్యం. సామాజిక ప్రగతి అనగానే ఇక్కడ వుండే మన వాళ్ళు ఒక వికృత మైన మొహం పెట్టి "ఆ సాధిస్తారు లెండి ప్రగతి, ఇక్కడ కు వచ్చి మన నాగరికత మర్చి పోయి వెర్రి తలలేసే సామాజిక ప్రగతి (అంటే ఇవే మాటలు కావు ఇంచు మించు గా ఇదే అర్ధం వచ్చేట్లు) " అని అంటారు. బాగా చదివి వుద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని లేదు దాదాపు గా అందరి ది అదే భావం. ఆడవాళ్ళు కూడా అదే మిథ్ లో వుంటాము ప్రగతి గురించి.. ఇలా అన్న వాళ్ళందరిని అడిగి సమీకరించుకున్న సమాధానాలను బట్టీ నాకనిపించేది ఏమిటంటే మనకు నచ్చి( ఒక్కో సారి బలవంతం గా నచ్చబడతాయి ) మనం, ఇంకా మన వాళ్ళు అచరించేవి వరకు ప్రగతి, మిగతావి బరి తెగించటం లేదా నాగరికత ను భ్రష్టు పట్టించటం... ఈ విషయం లో మాత్రం ప్రగతి కి సరైన నిర్వచనం ఏర్పరుచుకోవాలి, ఏర్పరుచుకోలేక పోయినా సామాజిక ప్రగతి ని రంగుటద్దాలలో చూసి మురవటమో, భూతద్దం లో చూసి వణకటమో కాకుండా, ప్రగతి అనేది మనం వుంటున్న సమాజం, మనం పెరిగొచ్చిన సమాజం రెండిటిని సమన్వయపరుచుకోగల ఒక వంతెన లా మనం మలచుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

ఇదండి ఈ మహిళా దినోత్సవం రోజు, దేశాంతరాలలో వున్న ఓ మహిళ మనసులోని వూసులు..

అందరికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కావలసింది సాధించగల ఆత్మ సైర్ధ్యం, సాధించినది నిలబెట్టుకోగల విచక్షణ మనకు లభించాలని ఆశిస్తు......చెలి ... విరహమెంత తియ్యనిదే ....
నీ తలపులనే మరీ మరీ గుర్తు చేస్తోంది....
ఈ విరహ మాధుర్యమే కదా ఇంకా మన ఇద్దరినీ
విడి పోనీకుండా ఇలా తెగిపోని రాగాలతో కలిపి ఉంచుతోంది
ప్రియతమా నీ తలపు ఎంత మధురమే అది కన్నీళ్లను రప్పిస్తేనేమి..

నీ తలపు నాకు రక్తాశ్రువును రప్పిస్తే......!!
ఆ ఆశ్రువు నీ దగ్గరనుంచి వచ్చిన ,
నీవానతించి పంపిన ప్రేమ కానుకగా ఎప్పటికీ నాతోనే. . . నాలోనే దాచుకుంటాను

అది బయటకు వెళ్ళిపోయి నిన్ను మరపుకు తెస్తుంది అంటే........
సఖి...... దానిని బయటకు రానీకుండా నీ జ్ఞాపకాల ఆనవాలుగా
మనసులోపలె నిక్షిప్తం చేసి దాని చుట్టూ నీ పెదవికొసనుంచి తేలివచ్చే
బంగారు కాంతుల చిరునవ్వును కాపలా గా ఉంచుతాను లే..

అయినా అది ఎప్పుడైనా అలవోక గా నీ ఆలోచనాంబుధి లో మునిగి..
అర మూసిన నా కనురెప్పల వాలుగా కిందకు జారిపోతే..
నువ్వు నాకు దూర మైపోతావేమో నని అనుకోకు...

హృదయ ఫలకం మీద నీవు విస విసా
నడిచిన పాదాల గుర్తుల చిహ్నాలు ఇంకా మాయలేదులే......