Subscribe RSS



చెలి ... విరహమెంత తియ్యనిదే ....
నీ తలపులనే మరీ మరీ గుర్తు చేస్తోంది....
ఈ విరహ మాధుర్యమే కదా ఇంకా మన ఇద్దరినీ
విడి పోనీకుండా ఇలా తెగిపోని రాగాలతో కలిపి ఉంచుతోంది
ప్రియతమా నీ తలపు ఎంత మధురమే అది కన్నీళ్లను రప్పిస్తేనేమి..

నీ తలపు నాకు రక్తాశ్రువును రప్పిస్తే......!!
ఆ ఆశ్రువు నీ దగ్గరనుంచి వచ్చిన ,
నీవానతించి పంపిన ప్రేమ కానుకగా ఎప్పటికీ నాతోనే. . . నాలోనే దాచుకుంటాను

అది బయటకు వెళ్ళిపోయి నిన్ను మరపుకు తెస్తుంది అంటే........
సఖి...... దానిని బయటకు రానీకుండా నీ జ్ఞాపకాల ఆనవాలుగా
మనసులోపలె నిక్షిప్తం చేసి దాని చుట్టూ నీ పెదవికొసనుంచి తేలివచ్చే
బంగారు కాంతుల చిరునవ్వును కాపలా గా ఉంచుతాను లే..

అయినా అది ఎప్పుడైనా అలవోక గా నీ ఆలోచనాంబుధి లో మునిగి..
అర మూసిన నా కనురెప్పల వాలుగా కిందకు జారిపోతే..
నువ్వు నాకు దూర మైపోతావేమో నని అనుకోకు...

హృదయ ఫలకం మీద నీవు విస విసా
నడిచిన పాదాల గుర్తుల చిహ్నాలు ఇంకా మాయలేదులే......

కిందటి సారి మా వూరు గురించి చెప్పేను కదా అటువంటి వూరు లోకి, పెళ్ళి చేసుకుని, చేసుకున్నోడి చిటికిన వేలు పట్టుకుని వెయ్యి ఆశలతో మెట్టినింటికి నడిచి వచ్చిన ముద్దుగుమ్మల ముచ్చట్లు వినండి.. ఈ రోజు మొదటిది మాత్రమే ఇస్తున్నా అన్నీ కలిపితే మరీ పెద్దదై పోతుందని.

1.

జీవితం లో అమెరికా వచ్చిన తరువాత మార్పుల గురించి రాయాలంటే ముందు రాయవలసింది మార్పు రాక ముందు నేనెలా వున్నాను, నేనేమనుకున్నాను అనేది. కదు......!!!. ఇక్కడకు రాక ముందు నేను కల లో కూడా అనుకోలేదు అమెరికా రావాలని, వస్తానని. దానికి ముఖ్య కారణం అమ్మ వాళ్ళకు, అక్క వాళ్ళకు దూరం గా వుండటం అనే వూహ నాకు రుచించక పోవటమే అనుకోవాలి.

కాని అన్ని అనుకున్నట్లు జరగవు కదా (అదేనేమో ముందు నేను నేర్చుకుంది అమెరికా రావటం అనే ప్రాసెస్ లో). నా నిజ జీవిత హీరో గారు మార్పు ను ఆహ్వానించటం లో పెద్ద బిడ్డ. తన సూచన తో, జీవితం లో మార్పు అప్పుడప్పుడు అవసరం జీవితాన్ని నిత్య నూతనం గా వుంచటానికి అనే మొదటి పాఠం నేర్చుకోవటం తో పాటు బుర్ర లోకి కూడా ఎక్కించుకుని విమానమెక్కేసేను. (మరి ప్రియమైన మొగుడు గారు కదండి, కొన్నాళ్ళకే వెళ్ళొద్దాము అంటే కాదని ఎలా అంటాను కదా).

వచ్చి రావటం తోనే అమ్మ వాళ్ళ ను వదిలి వచ్చాననే బెంగ ను మరిపించేందుకేమో ప్రకృతి మాత రంగు రంగుల దుప్పట్లు పరిచి రంగులు అన్నిపక్కల నుంచి చిలకరిస్తూ పలకరించింది.
(అవునండి ఆకులు రాలు కాలం, ఫాల్ సీజన్ లో వచ్చాను ఇక్కడకు) నిజంగా ప్రకృతి ని ఆస్వాదించటం, ఆనందించటం అంటే ఏమిటో అప్పుడే అర్ధం అయ్యింది. ఏ రంగు వైపు చూడాలో, మా అపార్ట్మెంట్ వెనుక చెట్టునే చూడాలో, కొండల కోనల అంచుకు వెళ్ళి ఆ రంగుల అంబరాన్ని చలి గాలుల తో కలిపి విసురుతున్న అందాలు చూడాలో అర్ధం కాక సతమత మయ్యే దానిని. వాటితో కలిపి ప్రకృతి మనకిచ్చే పుట్ట తేనెలు, జొన్న కంకులు, చేమంతులు, పూబంతులు బోనస్.


ఆ అందాల ఆస్వాదన లో మునకలైన నేను తేరుకోకముందే మంచి మంచు చినుకుల వానలు మొదలయ్యాయి. మొదటి సారి పువ్వులు చెట్టుకు కాకుండా ఆకాశం లో పూచి నాకోసం నేల మీదకు వచ్చి చెట్టులకు అలంకారమయ్యి మెరిసి మురిపిస్తాయని తెలిసి ఆ మంచు పూల వాన నాకిచ్చిన సంతోషాన్ని ఎన్ని మాటలతో వర్ణించగలను. నిద్ర పోతే వుషోదయపు మంచు కాతులను చూడలేనని, పొద్దుటే అలారం పెట్టుకుని లేచి మరి చూసే దాన్ని స్నో పడుతుంది అంటే..

తినగ తినగ వేము తియ్యగుండు అనే సామెత ను నిజం చేస్తూ మంచులోని అందాన్ని ఆస్వాదించటం తో పాటు చలి లోని చేదు ను, సరి గా నడవకపోతే జారుడు బల్ల ల సయ్యాటలు తొందర లోనే నేర్చుకున్నాను.

ఇక నయాగరా ఫాల్స్ ను చూడటం అనేది జీవితం లో ఒక మర్చిపోలేని అనుభూతి.
ఇక్కడ వున్న అందరు తప్పక చూడవలసిన ప్రదేశం. మొదటి సారి ఆ అనంత జలరాశుల ముందు నుంచుని తలపైకెత్తి ఆ హోరు ను వింటూ, తల వంచి ఆ తుంపరల ఆశీర్వాదాలను తీసుకుంటూ, బిర బిరా పాకే ఏటి తో పక్క గా నడుస్తూ ఆ నీటి ని చూడటం, కిందకు వురికిన నీటి మధ్య గా పడవలో వెళ్ళి చుట్టూతా కమ్ముకున్న నీటి తుంపరల మేఘాల మధ్య వుండి ఆ అందాన్ని చూడటం ఒక మధురమైన అనుభవం. నాకు ఆ అనుభవం తో అర్ధమైంది ప్రకృతి ముందు మనమెంత అల్పులమో ప్రతి క్షణం దాని నుంచి మనమెంత నేర్చుకోవాలో, ప్రతి పాఠం నుంచి నేర్చిన సారాన్ని జీవితం లో ఎలా ప్రతిష్టించుకోవాలో..

సరే జీవితానికి అనుసంధానం గా జరిగేవి పక్కన పెట్టి జీవితం లో జరిగిన మార్పులను చెప్పాలంటే... వు... ఒక్క మాట లో చెప్పాలంటే జీవితాన్ని ఆసాంతం గా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. దానిని విడగొట్టి వివరించి చెప్పాలంటే కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త మనుష్యులను, కొత్త అలవాట్లను, కొత్త సంస్కృతి ని చూడటం వాటిని అర్ధం చెసుకోవటం, వాటిని మన అలవాట్ల తో మనదైన రీతి లో మలచుకోవటం, ఇష్టం లేని వాటికి దూరం గా వుండటం లోని తప్పని ఘర్షణ. ఇవి కొత్త ప్రాతం, కొత్త దేశానికి వచ్చినప్పుడు ఎవ్వరికి తప్పని పాట్లు కదా. అందరిని పలకరించాలని వుంటుంది. ఒక్కో సారి తెల్ల వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పటం, మన వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళ తో మాకేంటి అన్నట్ళు తల తిప్పుకుని గమనించనట్లు వెళ్ళి పోవటం. ఇంకొన్ని సార్లు అపరిచితులైన మన వాళ్ళు చిటిక లో చిన్నప్పటి నుంచి తెలిసిన చిర పరిచితులయ్యి మర్చిపోలేని అనుభందాన్ని మాకు కానుకివ్వటం. ఇలా ఎన్నో అనుభూతుల మాలను గుచ్చి జీవన పధాన గుర్తులు గా అక్కడక్కడ తగిలించుకుంటూ వెళ్ళి పోవటం అలవాటయ్యింది.

వీటన్నిటిని చేయటం లో సర్దుకు పోవటానికి నాకు దొరికిన ఒక ఆలంబన ఇక్కడ పరిచయమయ్యిన నా స్నేహితులే అని చెప్పుకోవొచ్చు.
మంచి చెడూ ఆనందం దుఃఖం అన్నిటిని కలిసి పంచుకోవటం లో కాలాన్ని సాగదీయటం కోసం కొత్త కొత్త (మాకు కొత్త, అమెరికా కు కాదండోయ్) ఆటలు ( Scrabble, Pictionary etc.... ) ఆడటం లో అన్నిటి లో జత వుండే స్నేహితులు దొరకటం కూడా అదృష్టమే కదా. ఆ అదృష్టం లో మాకు తోడైన ఇంకో చిన్న బొమ్మ నా స్నేహితురాలు శర్వాణి వాళ్ళ అమ్మాయి శ్రేయ. శ్రేయ తో ఆడుకుంటున్నప్పుడే నాకు జీవితం లో ఇప్పటి వరకు పరిచయం కాని కొత్త ఆనందం దొరికనట్లనిపిస్తుంది

ఎప్పుడూ కాదు కాని అప్పుడప్పుడూ కొత్త వంటలు చేయటం లోను వాటిని నా చుట్టుపక్కల వారికి ఇచ్చి మెచ్చుకోళ్ళు పొందటం లో ( ఏమి చేస్తారు లెండి, ఇచ్చి ఎదురుగా నుంచుని చూస్తూ వుంటే బాగుందనక..... అది కాక నేను మాత్రం తరువాత వాళ్ళ వంటలు మెచ్చుకోవద్దు) కాలం అలా వేళ్ళ సందుల నుంచి జారి పోతూ వుంటుంది.

వీటన్నిటి తో పాటు ఇప్పటి వరకు ఎప్పుడూ వుద్యోగ యత్నం చెయ్యక పోయినా బయటకు వెళ్ళి ఆ వుద్యోగం కూడా చేసి పారేస్తే పోలా అని అనిపిస్తూ వుంటుంది, చూద్దాము నాకోసం అమెరికా ఇంకేమి రత్నాలను దాచివుంచిందో బహుమతి గా ఇవ్వటానికి.