Subscribe RSSవేసవి పొగల కాలం దాటి, హేమంతాల సడీ వచ్చి...... చలి సందడిలో సద్దుమణిగి, మళ్ళీ వసంతాల ఉరుకులలో కాలం గిర్రుమని తిరిగి వచ్చినా నేను మాత్రం రాయటం అనేది పూర్తి గా మర్చి పోయాను. టైం లేదు అనే ఒక అందమైన అభద్దం తో నన్ను నేనే నమ్మించేసుకుని అందరిని కూడా నమ్మించేసి తిరుగుతున్నా. ఈ రోజు నా కోసం కాకపోయినా నా స్నేహితురాలికి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటం కోసం నెమ్మది గా వేళ్ళు విరుచుకుని "బద్ధకము, సందె నిద్దుర వద్దు సుమీ.... మొద్దందురు తోడి వారలు దద్దిరంబు వచ్చును దానిన్" అని సగం గుర్తు ఉన్న పద్యమొకటి పాడేసుకుని ఒక కాఫీ తెచ్చేసుకుని కూర్చున్నా.
జన్మ దినమంటే ఇష్టం లేని దెవరికి చెప్పండి.... అందునా స్నేహితురాలి జన్మ దినమంటే ఇష్టం లేని వాళ్ళు అసలే ఉండరు నా ఉద్దేశం ప్రకారం. చిన్నప్పుడైతే చాక్లెట్ లు, ఇంటికి పిలిచి కేక్ పెడతారు. ఆ రోజు హోమ్‍వర్క్ లు చేయనక్కర్లేదు, ఎంచక్క గా చీకటి పడే వరకు వాళ్ళ ఇంట్లోనే ఆడుకోవొచ్చు. మా నాగమణి, శేషుమణి వాళ్ళ పుట్టిన రోజైతే అక్కడే ఒక మూల కూర్చుని తెలుగు లో అనువదించిన రష్యా కధల పుస్తకాలు ఆ నునుపు దనం, ఆ మెరుపు.... వేళ్ళ తో అనుభవిస్తూ తాన్యా ఎక్కడెక్కడికి వెళ్ళి , ఏమి చేసిందో ఆ చల్లని మంచు కొండలలో తెలుసు కోవొచ్చు.
ఇంక రమ పుట్టిన రోజైతే వాళ్ళ అమ్మ కేక్ లా వండిన దిబ్బరొట్టి తినెయ్యొచ్చు. రాత్రి వాళ్ళ నాయనమ్మ ముద్దలు చేసి అందరికి కలిపి పెట్టే ఉసిరికాయ అన్నం ముద్దలు తింటూ, చీకటి పడే వరకు అన్నం తినమని మారాము చేసి, చీకట్లో అన్నం తిన్నందుకు వచ్చే జన్మ లో రాక్షసులై పుట్టిన వాళ్ళ కష్టాలు, వాళ్ళకు ఒక్క మనిషి కూడా తినటానికి దొరక క బాధ పడ్డ కధ లు వినొచ్చు..


అలా స్నేహితుల పుట్టిన రోజులకు మనకెన్ని విందులో వినోదాలో.. ఆనందపు నవ్వులో.. కేరింతల హేలలో.


ఇక పెద్ద అయ్యే కొద్ది వినోదాల విందుల కాల పరిమితి అనంతమయ్యి.. ఇంట్లో వాళ్ళకి ఎందుకొచ్చిన ఈ స్నేహితుల పుట్టిన రోజులు రా బాబు, దీనిని పట్టలేము ఆ రోజు అనే దీవెనల జల్లు లు తీసుకుంటూ పెరిగేస్తాము కదా.

చిన్న వయసులలో స్నేహితుల పుట్టిన రోజులను చూసిన సినిమాలతోనూ, చేసుకున్న పార్టీలతోను, కొనుకున్న చీరలతోను కలిపి, పుట్టిన రోజు ఆనందాన్ని అంచనా వేసుకోవటం అలవాటు అయ్యినా, పెద్ద అయ్యే కొద్ది జీవితపు రంది లో పడి స్నేహితుల సంఖ్య తగ్గుతుంది (చిన్నప్పుడు అందరూ ప్రాణ స్నేహితులే కదా మరి) ,  ఆ స్నేహితుల పుట్టిన రోజులను గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పటమే వాళ్ళకు మనకూ కూడా తలకు మించిన జ్నాపకం ఐపోతుంది. :-(


కాని వీటన్నిటి మధ్యన కూడా స్నేహమంటే నిజమైన అర్ధాన్ని, ఆ స్నేహ భందం లోని చిక్కదనాన్ని చక్క దనాన్ని ఒక్క వన్నె తగ్గకుండా, ఒక పిసరంతైన మధురిమ తగ్గించకుండా... కలిసిన చేతుల మధ్యగా అనంతమైన ఆప్యాయతను, లెక్కలేనంత... లెక్క కట్టలేనంత ప్రేమ ను కలబోసి ఇచ్చే నా నెచ్చలి జన్మ దిన శుభాకాంక్షలు చెప్ప గలగటం నా కొక అపూర్వమైన వరం..


నేస్తమా .... గుండె చప్పుడు లోని లయలో నీ మాట, అనంతమైన సముద్రపు కెరటాల నీ ప్రేమ, ఎగిరే పిట్ట రెక్కల సవ్వడుల నీ నవ్వు, రేపటి పొద్దున విరిసే పువ్వుల అంచున విరిసే తళుకున నీ ఆశ కలబోసి ఉంటావేమో, వీటన్నిటిని చూసినప్పుడల్లా నువ్వెప్పుడూ నాకు గుర్తు కొస్తూనే ఉంటావు. నే చెప్పక పోయినా, నా గుండె కష్టం లో మునిగితే.... నీ కంట నీరు తిరిగిందెదుకో అని ఆదుర్దా గా నాతో మాట్లటడటం కోసం ఫోన్ చేస్తావు... దినసరి జీవితం తో తలమునకలై నా ఆచూకి నాకే తెలియటం లేదని బిక్క మొహం పెడితే రేపటి జీవనాల పువ్వుల బాటను మాటల మంత్రజాలం తో నా ముందుఉంచి నడక సునాయసమే అని నచ్చ చెప్పి నవ్విస్తావు.

జీవితపు ప్రతి అడుగునా నిజమైన స్నేహానికి భాష్యం చెపుతూ... చేసే ఆకతాయి పనులను అమ్మ లా మన్నిస్తూ, చెప్పే వెర్రి మొర్రి మాటలను అక్క లా ఆలకిస్తూ, పరుగెత్తి మోకాలు పగలకొట్టుకుంటుంటే నిజమైన నేస్తం లా హెచ్చరిస్తూ, వినక పోయినా ఓర్పు గా చేయూతనిస్తూ , ఆరిందాల సలహాలిస్తుంటే చెల్లి లా వాటన్నిటీకి తల వూచుతూ... జీవితపు ఆటు పోట్ల గమనాలను నెచ్చలివై నాతో పంచుకునే నా నేస్తమా... నీ జన్మ దినాన ఈ నేస్తం నీకు కొత్త గా ఇవ్వగలిగినదేమి ఉంది... ఎప్పటిలానే శుభాకాంక్షలను చెప్పటం తప్ప...

ఏడు రాగాల వర్ణాలను కలిపి ఆనందపు హరివిల్లును చేసి గులాబితో పాటూ ఈ పాటనూ మా మరువాల కొమ్మ కు  కానుకిస్తూ...


జన్మ దిన శుభాకాంక్షలు ఉష. 
నీ ఉంటే వేరే కనులెందుకు.. నీకంటే వేరే బతుకెందుకూ...

ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు నాతో కలిసి నువ్వు పంచుకుంటావని నీ పుట్టిన రోజున నేనే నిన్ను కానుక అడుగుతున్నా.. ఇస్తావు కదు.

8 comments to “జన్మదిన శుభాకాంక్షలు నేస్తం...”

 1. హ్యాపీ బర్త్ డే ఉష

 1. ఉషగారికి మీద్వారా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

 1. ఉష గారికి జన్మదిన శుభాకాంక్షలు .

 1. బంధాన్ని పెంచి అనుబంధాన్ని పంచేది
  అనురాగాల పల్లకిలో ఊరేగేది, ఆత్మీయతతో అలరించేది...
  మరువ రానిది, మరుపు రానిది, తియ్యనిది, తిరుగులేనిది, నిత్యమైనది, సత్యమైనది...
  కపటం లేనిది, కలహం రానిది
  అందాన్ని చూడనిది, అపార్ధం లేనిది,
  అనుమానం రానిది, అనూహ్యం కానిది
  అందరికీ నచ్చినది, సృష్టిలోకెల్లా గొప్పంది, అతి తియ్యనిది.....స్నేహం.

  జీవితంలో అనుకున్నది సాధిస్తూ విజయపథం వైపు సాగిపోతున్న ఉషా గారు మీకు సంతోషమయ జన్మదిన శుభాకాంక్షలు.

  భావన గారు మీ స్నేహానికి హృదయపూర్వక అభినందనలు...

 1. నడిచిపోతున్న గతం
  వదిలివెళ్ళిన నమ్మకం,
  రాలిపడిన కుసుమం
  గుర్తుకు తెచ్చే మకరందం
  ... భావన, ఆనందం పట్టలేక మంచు వానలో తడిసిన కనులో, ఆనందాతిశయంతో నానిన చూపో - నా కన్నుకి వేళ్ళకీ ఇంకా సఖ్యత రాలేదు. ఎన్నాళ్ళకి నీ కలం కదపగలిగాను! చిత్రంగా నెలకోమారు నీ బ్లాగులో మానియాదతో కలదిరిగే నాకు ఇవాళ మరొకరు తెలిపే వరకూ ఈ మాట
  తెలియలేదేమే?

  సం. క్రితం పాతేసిన 2సం. నాటి గాయపు చిహ్నం గతావలోకనలో గుర్తుకు తెచ్చుకోలేక తప్పలేదు. విలవిల్లాడుతూ ఒరిగిన మనసుని ఒడిసిపట్టిన నీ స్నేహం నేనూ మరవను. నా వనం తో సమంగా స్తబ్దమైన నీ గానమూ మరవను. నలుగురిలో నన్ను ఇంతగా పొగిడావని నేనున్నా మాట చెప్పక తప్పలేదు. నాతో పొగిలి, నన్ను పొదుపుకున్న మరొక మనసు సం. క్రితం పుంతలు తొక్కింది. మిగిలిన నీ మనసు ఇన్నాళ్ళకి కరిగింది. ఈ కానుక చాలు. కదిలిన ఈ అక్షరగీతి కలకాలం సుస్వరవాణిగా అమరగానమై అలరారాలి. ఈ స్నేహపుబంధం సుమగంధాలు వెదజల్లాలి. థాంక్యూరా బిడ్డీ!

 1. జ్యోతి, మాలా గారు, జయా - మాటలు చెప్పలేని హాయిని కలిగించినందుకు చాలా థాంక్స్. జయా! భలే చెప్తారు ఉండుండి భావాలని భద్రంగా! భావనాంతరంగం మీ మాటల్లో మరింత చిక్కగా కనిపిస్తోంది.

  ఆత్మబంధువు విజయమోహన్ గారు - ఆశించని ఆశీస్సులతో ఆనందం చల్లినందుకు ధన్యవాదాలు.

 1. మీరు ఒలికించిన భావాలకి పోటీగా మంచి పాట ని జత చేసి.. ఈ పోస్ట్ చదివిన మంచి భావాన్ని మరింత పెంచారు.
  మీ నేస్తం "ఉష " గారికి మీ ద్వారా శుభాకాంక్షలు. మీకు అభినందనలు.

 1. అసూయా తో రాస్తున్న ...ఉషా గారు ఇలాంటి ఒక స్నేహితురాలు /స్నేహితుడు నాకు లేరు ....
  జన్మదినా శుభాకాంక్షలు......
  భావన గారు .....హృదయపూర్వక అభినందనలు ........