ఎన్నో అనుకుంటాము గతమంతా మనమే అనుభవించాము ఆ ఘనత అంతా మనదే... వర్తమానం లో ధనం బలం వున్నాయి మనం ఏమి చేస్తే అదే నిజం ఎదురు లేదు, మనం ఏది అనుకుంటే అదే నిజం అని ప్రగాఢం గా నమ్ముతాము, పైకి అందరి తో అనకపోయినా.. ఇప్పుడు ఏదో అదర గొడుతున్నాము భవిష్యత్తు కోసం, కాబట్టి తిరుగు లేదు అని కూడా అనుకోవటం కద్దు. కాని ఒక్క క్షణం ప్రకృతి అవునా అని గల గల మంటేనో , నిజమా అని చిన్న గా తలవూయించుతేనో,, అబ్బో అని కొంచంగా విస్తుపోతేనో.. ఏమి వుంది... మానవ జీవితపు అసలు డంబారం బయట పడుతుంది.. ఒక సునామి విసురు లోనో ఒక భూకంపం వూపు లోనో.. ఒక వరదల విదిలింత లోనో మన అల్పత్వం బయట పడి మనమెంత అల్పమో మన గొప్పతనం ఎంత తాత్కాలికమో అర్ధం అవుతుంది..
కాని మనం మానవులం ఏకీ భావం లోనే భిన్నత్వం, భిన్నత్వం లో మానవత్వం కలగలిపిన సామాన్యులం, దుఃఖిస్తునే చేయుత అందించుకుంటాము. చేయందిస్తూనే గిల్లుకుంటాము కలిసి మళ్ళీ మంట పుట్టిందని ఏడుస్తాము. ఏమిటో.. హేటీ లో చూస్తుంటే కడుపులో దేవుతోంది. మానవ జీవితపు డాంబీకం అంతా మాములు గా వున్నప్పుడే... ప్రాణం పోయాక మనం ఎక్కడ భూమి లో కలిసి పోయామో లెక్క లో కూడా తెలియని పరిస్తితి, ఒక వేళ మన శరీరం బయటకు వచ్చినా చెత్త వేసినట్లు డంప్ ట్రక్ లో కి విసిరి వేయ బడుతున్నామని మనకు ఎలాను తెలియదు మన ఆప్తులకు కూడా తెలియని పరిస్తితి.. జీవితం నుంచి విసిరేయబడి ఏమి చేయాలో తోచక చేష్టలుడిగి చూస్తున్న పెద్ద వాళ్ళు, 15 రోజుల పసి గుడ్డు ఏమి చూడాలనో ఏ ఆశ తోనో అంత భూకంపం నుంచి, నెత్తి మీద దెబ్బ తో బయట పడి కాళ్ళు చేతులు కదుపుతు కళ్ళు విప్పార్చి చూస్తోంది.. ఒక పక్క టీవీ వాళ్ళు మాట్లాడుతుంటే వెనుక గా వినిపించే హృదయ విదారక రోదనలు.
బాధ సముద్రమల్లే ముంచేస్తోంది. కళ్ళ చెమరింతల తో, గుండె లో అపరాధ భావం తొలిచేస్తుంటే ఏమిటో కాలు చెయ్యి ఆడనట్లు వుంది వాళ్ళను చూస్తుంటే అలా. అపరాధ భావమెందుకు అంటారా? ఈ పెద్ద దేశం చిన్న దేశాలను కొల్ల గొట్టుకోవటం, బలవంతుడి దే రాజ్యం, ఎవరిది ఎంత వరకు తప్పు ఇటువంటి పెద్ద పెద్ద విషయాలను పక్కన పెట్టి చూసినా, ఇంత సమతుల్యం పోవటం లో, ఈ ప్రకృతి ని ఇంత తొందరగా వెంట వెంట నే నైసర్గిక రూపాలతో ఆ లక్షణాలతో సంభంధం లేకుండా ఎక్కడైనా ఏదైనా వచ్చేస్తూ జన జీవనాన్ని అతలా కుతలం చేసుకునే పరిస్తితులను ఆహ్వానించటం లో నా పాత్ర వుంది కదా అని. మన అందరి పాత్ర వుంది కదా.. ఎందరో ఎక్కడో చేసిన తప్పు కు ఇంకెవరో ఎక్కడో పరిహారం చెల్లిస్తూ వుండటం అన్యాయం కదు.
రెండు రోజుల నుంచి ఒక పాప ను బయటకు తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు. కాలు తీసేస్తే బయటకు వస్తుంది అట కాని ఎక్కించటానికి రక్తం లేదు అందుకని కాలు తీయకుండా బయట కు తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు అట. ఆ పాప అమ్మ పక్కనె కూర్చుని వుంది, ఆమె మానసిక పరిస్తితి తలుచుకుంటే దేవుడి మీద కోపం వస్తోంది ఎవరికైనా తప్పు కదా అలాంటి పరిస్తితి తీసుకురావటం ఎందుకు అలా చేసేవు అదే మంటే మళ్ళీ కర్మ సిద్ధాంతం చెపితే ఒప్పుకోను అని నిలదీయాలనిపిస్తుంది. కాని ఆయన మనలనే తిరిగి ప్రశ్నిస్తాడేమో మీరు కాదా మీ పరిస్తితి కి కారణం అని.
వనరులను వాడుకోవటం అనివార్యమే ఐనా దుర్వినియోగం చెయ్యకుండా ఐతే ఆప వచ్చు కదా. అనేక రూపాలలో ఎంత వృధా.. మన వంతు గా మనం తగ్గించుకోగలవి తగ్గించుకుని మనం వృధా చేసేవి ఆపుదామా.. ఈ దారుణాలన్నిటి కి నైతిక భాద్యత మన అందరి మీదా వుంది కదా. ఒక్క సారి భాద్య త గా భావించి చెయ్యగలిగినవి చేద్దామా.. వూరికే పేపర్ కప్ లు ప్లేట్ లు, అవసరమున్నా లేక పోయినా పెపర్ నేప్కిన్స్ వాడి పార వెయ్యటం దగ్గరనుంచి నీళ్ళు వృధా చేయటం, నేల లోకి వెళ్ళి భూమి కి అపకారం చేసే ప్లేస్టిక్ చెత్త లో వేయకుండా రీసైకిల్ చేయటం నుంచి... అనవసరం గా కార్ లో తిరగటం, ఏసీ లు వాడటం, కృత్రిమ మైన రసాయనాలు వాడటం వరకు ఏదైనా ఏదైనా మనం మన వంతు గా చేయగలిగేవి చాలానే వుంటాయి. ఒక్క సారి ఆలోచించి చూద్దామా చెట్లు కొట్టేసే ముందు, అవసరం లేని నూనె నుంచి కార్ బేటరీ పారేసే వరకు ఎక్కడ వేస్తున్నామో అని.
మనలో మన మాట 2004 నుంచి ఇప్పటి వరకు 700 మిలియన్ల డాలర్ లు అమెరికా ఇచ్చిందట హేటి కి. కిందటి సవత్సరం అన్ని దేశాలు కలిపి 1.4 బిలియన్స్ ఇచ్చారట ఆ దేశానికి, ఐనా ఏం అభివృద్ధి లేదు ఇది ఎవరి పాపం ఎవరి దోషమో మరి. అలా ఆలోచిస్తే మనం ఇచ్చే 100 కూడా ఇవ్వబుద్ధి కాదు.
మనం చేసే ప్రతి పని కి ఒక ఫలితం వుంటుంది అట...... కాని పని మనదే దాని ఫలితం మనదే అంటారు పెద్దవాళ్ళు. కాని ఒక్కోసారి ఇలాంటివి చూస్తే ఎవరో కొందరు చేసే వాటి ఫలితం చాలామంది అనుభవించటం కర్మ సిద్ధాంతమా.. ఏమో అయ్యి వుండవచ్చు..
12 comments to “ఎవరి తప్పు?”
-
దీనినే శ్మశాన వైరాగ్యం అంటారు ! మీరు చెప్పిన పాపను , తల్లిని తలుచుకుంటుంటే గుండె తరుక్కు పోతోంది .
మనము చేసే దానము సద్వినియోగ పడాలంటే , ఎక్కడికో ఎవరికో ఇస్తే అంతవరకు ఉపయోగ పడుతోందో తెలీదు . అందుకే నేను నాకు కనిపించే , మనచుటూ వున్న , మన పనివాళ్ళకు , అవసరమైన వారికి ఇస్తాను . మన చుట్టే ఎంతో మంది అవసరమైన వారున్నారు .
-
ఎవరో ఒక్కరు చేయడమేమిటి? ప్రతీ ఒక్కరం చేస్తున్నాము అనేక తప్పులు. గ్యాస్,పెట్రోల్ లాంటివి భూమిలోనుండి తీయకుండా ఉంటే ఇలాంటి భూకంపాలు ఇంత తీవ్రంగా రావు. మరి వాటిని వాడకుండా ఉండ గలమా? ఎంత వరకూ నిరోధించ గలం? అవిలేకుండా జీవనమే లేదే?
మీరన్నట్టు కాస్త నియంత్రించడమే మనం చేయగలిగింది. ప్రతీ ఒక్కరు చేయవలసింది.
-
భావన గారూ !
ప్రకృతి ముందు మనం అల్పులమే ! శాస్త్రపరంగా ఎంత పురోగమించినా మన మీద మనకు నియంత్రణను మాత్రం సాధించలేకపోతున్నాం. విచక్షణ లేని సహజ వనరుల వినియోగం, ప్రకృతి వికటాట్టహాసాలు.... ఇవన్నీ కూడా మన జీవనంలో భాగాలే అని సరిపిట్టుకోవడం తప్ప, ఏం చెయ్యగలం ?
-
ఇదివరకెన్నడూ లేనంతగా భూకంపాలు, సునామీలు పెరగటానికి కారణం మానవుడే కదా! ఎవరిగొయ్యి వాళ్ళమే తవ్వుకుంటున్నాము. పెరుగుటవిరుగుటకొరకే అన్నారుకదా! అభివృద్ధి అనేది ఎందులో ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది తెలుసుకోక పోతే వొచ్చే ప్రమాదాలన్ని ఇలానే ఉంటాయి. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులే ఒస్తాయి. ఇదికూడా, బోరు బావులు ముయ్యకుండా పసిపిల్లల ప్రాణాలు బలి ఇవ్వటం లాటిదే!
-
వాతావరణ సమతుల్యం పోతుంటే ఎంత తల్లి ప్రకృతైనా కన్నెర్ర చేయక మానదుగా భావనా? మనిషికి సౌకర్యాలు పెరిగాయి ఇటువంటి అసౌకర్యాలు తప్పవు. ఒకరి తప్పుకి ఒకరు బలవటం కొత్త కాదు. నివారణ, నియంత్రణ అందరి వంతూను.
-
@మాల గారు: అవునండీ శ్మశాన వైరాగ్యమేనేమో. 200000 వేల మంది చని పోయారంటే గుడె కరిగి నీరవు తోంది. ఎవరి కైతే ఏమి కదా అవరమైన వారికి సాయం చేస్తున్నరు, చాలు కదా.
@విజయ్ శర్మ గారు: నిజమేనండి అందరం చేస్తున్నాము. కొన్ని తప్పనివి. సృష్టి లో మొదలైన ప్రతిది ముగియాలి ముగిసిన ప్రతిది మొదలవ్వాలి అంటారు కదండి కాబట్టి తప్పదు కాని ఆ వినాశనాన్ని మనమ్ చాలా తొన్దర పెట్టీ మన ముందు తరాల వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నామే అని బాధ. ధన్య వాదాలు
-
@ రావు గారు: నిజమే జీవనం లోని భాగమే మనకు కాని మన తొందర పాటూ చర్య లతో మన ముందు తరాలకు జీవనమే లేకుండా చేస్తున్నామని బాధ అంతే. ధన్య వాదాలు.
@జయ: నిజం ఒక్కో చోట ఒక్కోక్క లాంటి నిర్లక్ష్యం ఎన్ని వందల వేల ప్రాణాలు పోవటానికి మనం కూడా కారణం అంటే అమ్మో ఒళ్ళు జలదరిస్తోంది.
-
@ఉష: ఏమి నివారణ, నియంత్రణో. చెపుతుంటే పిచ్చి వాళ్ళ లా లేక పోతే పిసినారి లా చూస్తారు తప్ప అర్ధం చెసుకోవటం లేదు కదా. అవును ఒకరి తప్పు కు ఇంకోరు బలి అవ్వటమ్ ఎప్పటి నున్చో అమలు లో వున్న ఆటవిక నీతే కదా.. :-(
-
దివిసీమ లో తుఫాన్ వచ్చినప్పుడు , మంచి చీర 50 రూపాయలది ఇస్తావా అని , మా అత్తగారు కోపం చేస్తున్నా వినకుండా , మంచివి , గట్టివి చాలా బట్టలు , 500 రూపాయలు ఇచ్చాను. తరువాత ఒకరోజు , నేను , మా అత్తగారు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ పనిమనిషి , నా చీర కట్టుకొని వుంది . ఈ చీర నీకెక్కడి అని అడుగుతే , పురానాపూల్ బ్రిడ్జ్ దగ్గర 10 రూపాయలకు కొనుక్కున్నాను అని చెప్పింది . అప్పుడు మా అత్తగారు నావైపు చూసిన చూపు ఇప్పటికీ మరచి పోలేదు .
నా పార్లర్ కు వచ్చే ఒకావిడ ,ఒక అమ్మాయిల అనాధ ఆశ్రమము లో వార్డెన్ గా వుండేది . నా పార్లర్ తరుపున డొనేషన్ ఇద్దామని , అక్కడి వెళితే , పంచదారవుంది కొనుక్కుంటావా ? మంచి బ్లాంకెట్లు , స్వెట్టర్లు విదేశాలనుండి వచ్చినవి వున్నాయి కావాలా అని అడిగింది . అక్కడ పిల్లలు , చింపిరి తలలతో , ఆకలి మొహాలతో వుంటే , నాకేమో జీడి పప్పు పకోడీలు చేయించి పెట్టింది . 1000 రూపాయలు ఇద్దామనుకున్నదానిని 100 ఇచ్చి నప్పుడు ఆవిడ మొహం చూడాలి .బహుషా జీడిపప్పు పకోడీ వేస్ట్ ఐయిందనుకొని వుంటుంది .
ఏ.పి లో ఎక్కడ తుఫానులు వచ్చినా , మావారు బ్రేక్ డౌన్ వర్క్ చేయటానికి వెళుతారు . అక్కడి లోకల్ వాళ్ళతో పని చేయిస్తే , వాళ్ళకూ సాయము చేసినట్లుంటుంది అనుకొని రోజుకు 200 రూపాయలు ఇస్తామన్నా ఎవరూ రారట. ఎందుకంటే గౌర్నమెంటోళ్ళు పున్నానికి పైసలిస్తరు , పుటోలు దిగుతారు అంటారట. మళ్ళీ అందరూ గట్టిగానే వుంటారట. అసలు ఇబ్బంది జరిగిన వారిని ఎవరూ పట్టించుకోరట. అప్పుడు ఆయన పని ఐనాక కావలసిన వారికి చేతనైన సాయము చేసి వస్తారు .
సిలిగురి లో , అప్పుడు అక్కడవున్న బంగ్లాదేశ్ రెఫ్యూజీ లలొ అక అమ్మాయిని స్కూల్ లో చేరిపించి , స్కాలర్ షిప్ ఏర్పాటు చేసి వస్తే , మాకు తరువాత తెలిసింది , ఆ అమ్మాయిని పనికని ఎవరికో ,ఆ స్కూల్ టీచర్ ఇచ్చేసాడని . మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజము . అప్పుడు ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ లేదు .కాబట్టి మాకు వెంటనే తెలీ లేదు .
ఇలాంటివి చాలా అనుభవాలు అయ్యాక , ఎవరికో ఎందుకు , మన ఎదురుగా వున్న , మనకు తెలిసిన , అవసరమున్న వాళ్ళకు సాయం చేద్దామని అనుకొని అలాగే చేస్తున్నాను.
ఇక సెలవలలో మా పిల్లలతో కాగితం కవర్ లు చేయించి దగ్గర లో వున్న షాప్ లలో ఇప్పిస్తాను . పాత యూనీఫాంల తో బాగ్లు కుట్టి , షాప్పింగ్ కి అవే వాడుతాను . వీలైంత వరకు ప్లాస్టిక్ కవర్లు తీసుకోను . ఇవన్నీ మా పెద్ద మనవరాలి ఆర్డర్ .
అండమాన్ లో సునామీ వచ్చినప్పుడు , అక్కడి , చిన్న ద్వీపాలలో వున్న అటవికులు అందరూ ముందుగానే సురక్షిత స్తలాలకు వెళ్ళారట .అక్కడ , అటవికులకు కాని , జంతువులకు కాని ఎలాంటి నష్టము జరగలేదట. అక్కడ వున్న మా మిలిటరీ ఫ్రెండ్స్ చెప్పారు . నష్టపోయింది నాగరీకులే !!! అటవికులు , అనాగరికులు , చదువు రానివారు , వారు ముందుగానే తెలుసుకున్న విషయము పెద్ద ,పెద్ద సైంటిష్టులు ఎందుకు కనిపెట్ట లేక పోయారు ?
ఆ దారుణ దృష్యాలు పేపర్ లో చదివినప్పుడు , టి . వి లలో చూసినప్పుడు గుండె తరుక్కు పోతుంది . ఏమీ చేయలేక పోతున్నామే అని బాధ కలుగుతుంది . కాని మనమేం చేయగలం ??????
ఇలా చెబుతూ పోతే పది పోస్ట్ లైనా అవుతాయి . ఇప్పటికే చాలా పెద్దగా ఐయింది . ఇంతకు ముందు నేను ఇచ్చిన కామెంటుకు మీరు నొచ్చుకున్నట్లు అనిపించి , ఇదంతా రాసాను . ఇంతే సంగతులు చిత్తగించవలెను . తప్పులున్న మనించవలెను .
-
అరె చిన్న పొరపాటు జరిగింది . ఉత్తరాలు రాసి చాలా రోజులైంది కదా అదీ విషయం .
ఇంతకు ముందు రాసినదానిలో మొదటగా ,
చి . ల . సౌ భావనను , మాల ఆశీర్వదించి రాయునది ఏమనగా ,
ఇక్కడ అంతా క్షేమం . మీరంతా క్షేమం అని తలుస్తాను .
. . . . . . . . .
. . . . . . . . . . .
చెప్పవలసిన సంగతులు చాలా వున్నాయి ,కాని ఇప్పటికి ఇంతే సంగతులు . చిత్తగించవలెను . తప్పులున్న మన్నించవలెను .
ఇట్లు ,
మాల చేవ్రాలు .
అని , మొదలు చివర చదువుకోగలరు .( ఇందాక కొంచం భారిగా వుందికదూ . అందుకు ఈ కొసమెరుపన్నమాట )
-
అట్లా ఏమి చిన్నపుచ్చుకోలేదు మాల గారు మీరన్నది నిజే కదా. ఎవరికి చేస్తే ఏం సాయం అవసరమైన వాళ్ళకు సాయం చెయ్యటం చాలు. నేను నిజంగానే అన్నా చిన్నపుచ్చుకోలేదండీ. కాని మీరు రాసినవి చదువుతుంటే మాత్రం నిజమే కదా అనిపించింది. ఆయ్ నాకనే సరికి వుత్తరం రాసినట్లు రాసేరే.. ఇంకా కొన్నాళ్ళకు బ్లాగ్లోకం లో వుత్తరాల భావనమ్మ ఐపోతానేమో. హ హ హ మీరు ఆశీర్వదించారు అదే పదివేలు మళ్ళీ ఆఖరున మన్నింపులేమిటండి అర్ధం లేకుండాను. నేను దానిని ఖండిస్తున్నాను. :-)
అడిదం అప్పారావు శాస్త్రి గురించి వాడి నీతి మాలిన బ్రతుకు గురించి క్రింది లింక్ లో చూడండి.
http://telugusimha.blogspot.com/