Subscribe RSS

కిందటి సారి మా వూరు గురించి చెప్పేను కదా అటువంటి వూరు లోకి, పెళ్ళి చేసుకుని, చేసుకున్నోడి చిటికిన వేలు పట్టుకుని వెయ్యి ఆశలతో మెట్టినింటికి నడిచి వచ్చిన ముద్దుగుమ్మల ముచ్చట్లు వినండి.. ఈ రోజు మొదటిది మాత్రమే ఇస్తున్నా అన్నీ కలిపితే మరీ పెద్దదై పోతుందని.

1.

జీవితం లో అమెరికా వచ్చిన తరువాత మార్పుల గురించి రాయాలంటే ముందు రాయవలసింది మార్పు రాక ముందు నేనెలా వున్నాను, నేనేమనుకున్నాను అనేది. కదు......!!!. ఇక్కడకు రాక ముందు నేను కల లో కూడా అనుకోలేదు అమెరికా రావాలని, వస్తానని. దానికి ముఖ్య కారణం అమ్మ వాళ్ళకు, అక్క వాళ్ళకు దూరం గా వుండటం అనే వూహ నాకు రుచించక పోవటమే అనుకోవాలి.

కాని అన్ని అనుకున్నట్లు జరగవు కదా (అదేనేమో ముందు నేను నేర్చుకుంది అమెరికా రావటం అనే ప్రాసెస్ లో). నా నిజ జీవిత హీరో గారు మార్పు ను ఆహ్వానించటం లో పెద్ద బిడ్డ. తన సూచన తో, జీవితం లో మార్పు అప్పుడప్పుడు అవసరం జీవితాన్ని నిత్య నూతనం గా వుంచటానికి అనే మొదటి పాఠం నేర్చుకోవటం తో పాటు బుర్ర లోకి కూడా ఎక్కించుకుని విమానమెక్కేసేను. (మరి ప్రియమైన మొగుడు గారు కదండి, కొన్నాళ్ళకే వెళ్ళొద్దాము అంటే కాదని ఎలా అంటాను కదా).

వచ్చి రావటం తోనే అమ్మ వాళ్ళ ను వదిలి వచ్చాననే బెంగ ను మరిపించేందుకేమో ప్రకృతి మాత రంగు రంగుల దుప్పట్లు పరిచి రంగులు అన్నిపక్కల నుంచి చిలకరిస్తూ పలకరించింది.
(అవునండి ఆకులు రాలు కాలం, ఫాల్ సీజన్ లో వచ్చాను ఇక్కడకు) నిజంగా ప్రకృతి ని ఆస్వాదించటం, ఆనందించటం అంటే ఏమిటో అప్పుడే అర్ధం అయ్యింది. ఏ రంగు వైపు చూడాలో, మా అపార్ట్మెంట్ వెనుక చెట్టునే చూడాలో, కొండల కోనల అంచుకు వెళ్ళి ఆ రంగుల అంబరాన్ని చలి గాలుల తో కలిపి విసురుతున్న అందాలు చూడాలో అర్ధం కాక సతమత మయ్యే దానిని. వాటితో కలిపి ప్రకృతి మనకిచ్చే పుట్ట తేనెలు, జొన్న కంకులు, చేమంతులు, పూబంతులు బోనస్.


ఆ అందాల ఆస్వాదన లో మునకలైన నేను తేరుకోకముందే మంచి మంచు చినుకుల వానలు మొదలయ్యాయి. మొదటి సారి పువ్వులు చెట్టుకు కాకుండా ఆకాశం లో పూచి నాకోసం నేల మీదకు వచ్చి చెట్టులకు అలంకారమయ్యి మెరిసి మురిపిస్తాయని తెలిసి ఆ మంచు పూల వాన నాకిచ్చిన సంతోషాన్ని ఎన్ని మాటలతో వర్ణించగలను. నిద్ర పోతే వుషోదయపు మంచు కాతులను చూడలేనని, పొద్దుటే అలారం పెట్టుకుని లేచి మరి చూసే దాన్ని స్నో పడుతుంది అంటే..

తినగ తినగ వేము తియ్యగుండు అనే సామెత ను నిజం చేస్తూ మంచులోని అందాన్ని ఆస్వాదించటం తో పాటు చలి లోని చేదు ను, సరి గా నడవకపోతే జారుడు బల్ల ల సయ్యాటలు తొందర లోనే నేర్చుకున్నాను.

ఇక నయాగరా ఫాల్స్ ను చూడటం అనేది జీవితం లో ఒక మర్చిపోలేని అనుభూతి.
ఇక్కడ వున్న అందరు తప్పక చూడవలసిన ప్రదేశం. మొదటి సారి ఆ అనంత జలరాశుల ముందు నుంచుని తలపైకెత్తి ఆ హోరు ను వింటూ, తల వంచి ఆ తుంపరల ఆశీర్వాదాలను తీసుకుంటూ, బిర బిరా పాకే ఏటి తో పక్క గా నడుస్తూ ఆ నీటి ని చూడటం, కిందకు వురికిన నీటి మధ్య గా పడవలో వెళ్ళి చుట్టూతా కమ్ముకున్న నీటి తుంపరల మేఘాల మధ్య వుండి ఆ అందాన్ని చూడటం ఒక మధురమైన అనుభవం. నాకు ఆ అనుభవం తో అర్ధమైంది ప్రకృతి ముందు మనమెంత అల్పులమో ప్రతి క్షణం దాని నుంచి మనమెంత నేర్చుకోవాలో, ప్రతి పాఠం నుంచి నేర్చిన సారాన్ని జీవితం లో ఎలా ప్రతిష్టించుకోవాలో..

సరే జీవితానికి అనుసంధానం గా జరిగేవి పక్కన పెట్టి జీవితం లో జరిగిన మార్పులను చెప్పాలంటే... వు... ఒక్క మాట లో చెప్పాలంటే జీవితాన్ని ఆసాంతం గా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. దానిని విడగొట్టి వివరించి చెప్పాలంటే కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త మనుష్యులను, కొత్త అలవాట్లను, కొత్త సంస్కృతి ని చూడటం వాటిని అర్ధం చెసుకోవటం, వాటిని మన అలవాట్ల తో మనదైన రీతి లో మలచుకోవటం, ఇష్టం లేని వాటికి దూరం గా వుండటం లోని తప్పని ఘర్షణ. ఇవి కొత్త ప్రాతం, కొత్త దేశానికి వచ్చినప్పుడు ఎవ్వరికి తప్పని పాట్లు కదా. అందరిని పలకరించాలని వుంటుంది. ఒక్కో సారి తెల్ల వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పటం, మన వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళ తో మాకేంటి అన్నట్ళు తల తిప్పుకుని గమనించనట్లు వెళ్ళి పోవటం. ఇంకొన్ని సార్లు అపరిచితులైన మన వాళ్ళు చిటిక లో చిన్నప్పటి నుంచి తెలిసిన చిర పరిచితులయ్యి మర్చిపోలేని అనుభందాన్ని మాకు కానుకివ్వటం. ఇలా ఎన్నో అనుభూతుల మాలను గుచ్చి జీవన పధాన గుర్తులు గా అక్కడక్కడ తగిలించుకుంటూ వెళ్ళి పోవటం అలవాటయ్యింది.

వీటన్నిటిని చేయటం లో సర్దుకు పోవటానికి నాకు దొరికిన ఒక ఆలంబన ఇక్కడ పరిచయమయ్యిన నా స్నేహితులే అని చెప్పుకోవొచ్చు.
మంచి చెడూ ఆనందం దుఃఖం అన్నిటిని కలిసి పంచుకోవటం లో కాలాన్ని సాగదీయటం కోసం కొత్త కొత్త (మాకు కొత్త, అమెరికా కు కాదండోయ్) ఆటలు ( Scrabble, Pictionary etc.... ) ఆడటం లో అన్నిటి లో జత వుండే స్నేహితులు దొరకటం కూడా అదృష్టమే కదా. ఆ అదృష్టం లో మాకు తోడైన ఇంకో చిన్న బొమ్మ నా స్నేహితురాలు శర్వాణి వాళ్ళ అమ్మాయి శ్రేయ. శ్రేయ తో ఆడుకుంటున్నప్పుడే నాకు జీవితం లో ఇప్పటి వరకు పరిచయం కాని కొత్త ఆనందం దొరికనట్లనిపిస్తుంది

ఎప్పుడూ కాదు కాని అప్పుడప్పుడూ కొత్త వంటలు చేయటం లోను వాటిని నా చుట్టుపక్కల వారికి ఇచ్చి మెచ్చుకోళ్ళు పొందటం లో ( ఏమి చేస్తారు లెండి, ఇచ్చి ఎదురుగా నుంచుని చూస్తూ వుంటే బాగుందనక..... అది కాక నేను మాత్రం తరువాత వాళ్ళ వంటలు మెచ్చుకోవద్దు) కాలం అలా వేళ్ళ సందుల నుంచి జారి పోతూ వుంటుంది.

వీటన్నిటి తో పాటు ఇప్పటి వరకు ఎప్పుడూ వుద్యోగ యత్నం చెయ్యక పోయినా బయటకు వెళ్ళి ఆ వుద్యోగం కూడా చేసి పారేస్తే పోలా అని అనిపిస్తూ వుంటుంది, చూద్దాము నాకోసం అమెరికా ఇంకేమి రత్నాలను దాచివుంచిందో బహుమతి గా ఇవ్వటానికి.

34 comments to “వలసొచ్చాక.. పార్ట్ 1”

  1. Nicely written!

  1. హడావుడి లో ఉన్నాను. కూడలి చూడకూడదు అనుకున్నా కానీ ఉండలేకపోయా.. ఇదొక వ్యసనం ఐపోయింది. తరువాత మళ్ళీ చదివి కామెంటుతా. ప్రస్తుతానికి ఫోటోలు బావున్నాయి.

  1. ____________________________________
    ప్రకృతి ముందు మనమెంత అల్పులమో ప్రతి క్షణం దాని నుంచి మనమెంత నేర్చుకోవాలో, ప్రతి పాఠం నుంచి నేర్చిన సారాన్ని జీవితం లో ఎలా ప్రతిష్టించుకోవాలో
    ____________________________________

    Well Said.

  1. చాలా అందంగా చెప్పారు భావన గారూ, మీదైన శైలిలో..
    మొదట్లో కొన్ని రోజులు ప్రకృతారాధనలో..అలాగే మనలాగా వలసొచ్చిన స్నేహితులతో..రోజులు దోర్లిపోయాయన్నమాట.!
    కొంతవరకూ, నా అనుభవం కూడా ఇలాంటిదే. కాకపోతే పెళ్లి చేసుకుని రాలేదు నేను అదే తేడా ;)

  1. మేమూ చూస్తాంమరి మీరు త్వరగా చెప్పేస్తే ఆ బహుమతి ఏంటో ..... అదెంత అపురూపమైందో :)

  1. రాగానే ఎదురుపడ్డ అమెరికా అందాలు మీలో భావనా తరంగాలకు మేల్కొలుపు పాడాయన్నమాట

  1. చాల బాగా రాసారండీ .ఎదురుచూస్తూ .....

  1. చాలా బాగున్నాయి భావనా, మీ మొట్టమొదటి లేలేత అనుభవాలు. క్రమక్రమంగా వొచ్చిన మార్పులు తొందరగా తెలుసుకోవాలని ఉంది. అమెరికా లోని స్నోఫాల్ గురించి ఎందరో చెప్పుతూ ఉంటారు. ఆ కబుర్లు వింటూఉంటే ఎన్నో అందమైన కథలు గుర్తుకొస్తూ ఉంటాయి. తొందరగా అన్నివిషయాలు చెప్పేసేయండి మరి. మీ ఫొటోలే పెట్టచ్చుగా!

  1. Malakpet Rody: Thank you. :-)

    వాసు: ధన్యవాదాలు ఫొటోలు నచ్చినందుకు తీరిక గా చదివి పోస్ట్ కూడా ఎలా వుందో చెప్పండి.

    వీరుభొట్ల వెంకట్ గణేష్ గారు: అవునండి ఎంతో నిజం కదా. ధన్యవాదాలు

  1. మధురవాణి,పరిమళం, లలిత, చిన్ని జయ : ఇవి నా అనుభవాలు కాదబ్బా... ఇంతకు ముందు పోస్ట్ చూడండి. ఇక్కడ మా ఏరియా లో స్నేహితుల గ్రూప్ లో ని అందరి అనుభవాలు ఎక్కిస్తున్నా నా బ్లాగ్ లో... అందరు ఇంగ్లీష్ లో రాసి ఇచ్చారు, అంటే గ్రూప్ లో తెలుగు లో పెద్ద గా రాసే అలవాటు లేనోళ్ళూ, అసలు తలుగు రానోళ్ళు, తెలుగు వాళ్ళు కానోళ్ళు వున్నారు కదా అందుకని. నేను ఒక్కొక్కరి పోస్ట్ తీసుకుని తెలుగీకరించి పెడుతున్నా అంతే. ఈ గ్రూప్ లో మొన్నీమధ్య పెళ్ళై వచ్చిన వాళ్ళ నుంచి వచ్చి 15 ఏళ్ళయి నా వరకు వున్నాము. ముందు మాట లో రాసేను చూడండి.. కన్ఫ్యూజ్ చేస్తే సారి. మీ అభినందనలన్ని వాణి కు అంద చేస్తాను. తను చదువుతూనే వుందిలే బ్లాగ్.

  1. జయ: నా అనుభవాలు రాసేప్పుడూ నా ఫొటో లే పెడతా.. :-)
    మధురవాణి: అవును దాదాపు గా అందరిని రాగానే సమ్మోహన పరిచేది ఇక్కడ ప్రకృతి కదా..

    పరిమళం: బహుమతంటేనే అపురూపం కదా, జీవితపు మొదటి లో వున్న అమ్మాయి అనుభవాలు విన్నారు కదా, చివరి దాక చదవండి ఒక్కొక్కరిని ఎలాంటి బహుమతులు వరించాయో చెపుతారు. :-)

  1. లలిత : ఇక్కడి ప్రకృతి అందాలకు అందరం పరవశించి పోయే మాట నిజమే కాని అన్నవరం గుడి కి వెళుతూ దారి లో తీగ సంపెంగ మాల కొనుక్కుని ఆ కొబ్బరి ఆకుల కొనల పాటలను వింటూ జీడీ మామిడి కాయల సొన తొ గాభరాలు పడుతూ.. తీపి ముంజెల రుచిని అనుభవిస్తూ, మా వూరి గుడి పక్కన కొలను లోని కార్తీక్ మాసపు చలి చల్లదనాన్ని అనుభవిస్తే రాని తరంగాలు ఇంక ఎక్కడ వస్తాయి చెప్పండి.

  1. చిన్నీ: మా టీం వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో అనుభవం వాళ్ళ దైన శైలి లో బాగా చెప్పేరు అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నా. థ్యాంక్స్..
    జయ: అవును స్నో ఫాల్ బాగంటుంది చూడటానికి.. నిజానికి ఈ ప్లేస్ చాలా అందమైనది కొంచం చలి కి వోర్చుకుంటే. ప్రతి సవత్సరం ఇదే సృష్టి కి ఆరంభమా అన్నట్లు పుడమి తల్లి ని చీల్చుకు వచ్చే తొలి మొగ్గలు, ఇదే నే పునరాగమన వసంత సూచిక అంటూ తొలి చిగురు వేసి ఎర్రెర్రని పచ్చ పచ్చని చిగురుల కులుకులు ఇంతలోనే విరగ బూసేసి నేల తల్లికి సోకులద్దే ఎన్నెన్నో పూలు.. బోలెడంత ఖాళి స్తలం, సాయింత్రం జత పాడే ఇంటి ముందు గువ్వ పిట్టలు, పల్లెటూరులా చాలా బాగుంటాయి వూరులన్నీ. మేము తీసిన ఫొటో లు కూడా పెడతా ఈ సారి.

  1. మీ వూరి విశేషాల కోసం నీ బ్లాగు చూడాలో, నీ కవితాత్మకమైన రాతల కోసం చూడాలో తెలీట్లేదు భావనా!

    ఫాల్ కలర్స్ చూడ్డం ఒక వింత వింత వింత అనుభూతి అక్కడ!

    మన వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళ తో మాకేంటి అన్నట్ళు తల తిప్పుకుని గమనించనట్లు వెళ్ళి పోవటం...ఇది మనలో చాలామందికి అనుభవమే అన్నమాట! నాకైతే ఇప్పటికీ రెగ్యులర్ గా మెయిల్స్ రాసే తెల్లోళ్ళు ఉన్నారబ్బా స్నేహితులుగా! జిమ్ అనీ మా వారి అప్పటి కలీగ్ ఆఫీసు పని మీద ఆసియాలో ఏ దేశం వచ్చినా హైద్రాబాదు వస్తాడు మమ్మల్ని కలవడానికి! ఎంత సంతోషంగా ఉంటుందో!

    pictionery నా ఫేవరెట్ గేమ్! ఇప్పుడు కూడా ఆడతాను మా బిల్డింగ్ పిల్లలందర్నీ పోగేసి.

    నీ టపాలో నాకు నచ్చనిది...ఈ "ఇంకా ఉంది" అనేది. తొందరగా రాయి!

  1. Excelllent gaa raasaru andiiiii......Mee article chadivaaka naaku kuuda america raavalani undi ;)....

  1. అహా అహా ..ఎం రాసారు.. ఇలాంటి అనుభవాలు చాలామందికి వుండొచ్చుగానీ..అవి ఇంత అందంగా అక్షరరూపం లొ పెట్టడం మాత్రం చాల కస్టం.. అందులొ మీరు ఎక్స్పెర్ట్ లా వున్నట్టున్నారు. నేను ఇదే కాపి పేస్ట్ కొట్టి..కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి నా ఎక్స్పీరియన్స్ అని రాసెసి మా ఫ్రెండ్స్ దగ్గర మంచి మార్కులు కొట్టెయొచ్చు :-))))

  1. సుజాత: నచ్చినందుకు :-). అవును మరీ మనోళ్ళు ఎక్కువై పాత తరం వాళ్ళు భయపడతారు కొందరు పలకరించాలి అంటేనే, కొత్త తరం వాళ్ళకు కొందరకు మనుష్యులంటేనే లెక్క లేదు. అవునా pictionery మేము పార్టీలలో బాగా ఆడే గేమ్ అది. రామ రావణ యుద్ధాలు కూడ ఐపోతాయి టీమ్ ల మధ్య ఇదీ డంబ్ షరాస్ ఆడే టప్పుడు.

  1. శ్రీకాంత్ ఇంక ఆలస్యం దేనికి వచ్చెయ్యండి మరి.. ధన్యవాదాలు నచ్చినందుకు

    మంచుపల్లకి గారు: ఇందాకే అనుకున్నా ఈ ఈస్ట్ కోస్ట్ వీరాభిమాని ఇంకా రాలేదేమా అని. సిగ్గులేకుండా ;-) అదే సిగ్గు, మొహమాటం పడకుండా కాపీ కొట్టెయ్యండి. ఇంకా ఆపైన స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలంటే చెప్పండీ రాసి ఇస్తాను :-) ఎంతైనా ఒక వూరోళ్ళం కదా.

  1. భావనా, అసలు ఫోటోలు, టపా రెండూ పోటీ పడుతున్నాయిగా! సూపర్..

    ఇక్కడికి వచ్చిన కొత్తల్లో పిట్స్ బర్గ్ వెళ్ళినప్పుడు చుట్టూ ఆ ఫాల్ కలర్స్ చూసి, 'అబ్బా ఎంత బావుందో, ఇక్కడికి మూవ్ అయిపోదామండీ' అంటే మా ఆయన కొత్తపెళ్ళామని కనికరం కూడా లేకుండా 'కావాలంటే ప్రతి సీజన్ కీ నిన్నిక్కడికి పంపిస్తాను కానీ నన్ను మాత్రం ఉక్కడ ఉండమని అడగొద్దు" అన్నారు! ప్చ్.. 365 రోజులూ పచ్చగా ఉండే ప్రదేశంలో ఉన్నందుకు సంతోషించాలో ఇలా సీజన్లు మిస్ అవుతున్నందుకు బాధ పడాలో తెలీదు.. కానీ అప్పుడెప్పుడో ఇచ్చిన మాటని ఈ మధ్య నిలబెట్టుకుంటున్నారు.. ప్రతి ఫాల్ కి, వింటర్ కి షార్ట్ వెకేషనైనా సరే వెళ్ళి అందాలను మనసులో నింపుకుని వస్తున్నా :-)

    అసలు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో భలే ఉండేది.. అలవాటు లేని జీన్స్ పాంట్లూ... ఆఫీసులో మాట్లాడితే ఫ్రీగా ఇచ్చేసే హగ్గులూ.. ఒక స్యాండ్ విచ్ ఆర్డర్ చేస్తే అది ఎలా కావాలో సవాలక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పడాలు.. ఇప్పుడు వచ్చినవాళ్ళకంటే మనం వచ్చినప్పుడు ఈ జీవన విధానం మన ఇండియాలో దానికన్నా పూర్తిగా కొత్తగా ఉండటం వల్ల ఇక ATM నించి ప్రతీదీ అబ్బురమే!! ఇక నేను మొదటిసారి గ్యాస్ స్టేషన్లో ఆటోమేటిక్ కార్ వాష్ చేయించుకున్న రోజు మర్చిపోలేను :-)

    Thanks so much for bringing all those memories back!

  1. భావనా, నేనుకూడా ఆ మంచు జల్లులు చూసి పరవశించి పోయాను.
    సన్నజాజిరేకులు జలజలా రాల్తున్నట్టు, కైలాసం లో పరమశివుని నాట్యానికి చెదరిన మంచు నేల రాలి మల్లెల ముద్దలయినట్టు, ఇలాంటి ఊహలెన్నో. కాని తర్వాత మా అమ్మాయి కార్ వెళ్ళడం కోసం కష్టపడి ఆ మంచుని తవ్వి పోయడం చూసాక ఏమిటోగా అనిపించింది. ఊహకీ, వాస్తవానికీ మధ్య ఎంత సున్నితమైన పొర ఉందో అనిపించింది.
    నయాగరా జలపాతాలను బాగా వర్ణించారు. లలితగారన్నట్టు చూసే దృష్టే ఉండాలి కాని ప్రకృతి లోని అందాలు ఎన్నని వర్ణించగలము?

  1. నిషి: అవును పిట్స్ బర్గ్ దగ్గర చాలా బావుంటాయి. ఫాల్ కు మా వూరు రండి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైట్ మౌటైన్స్ కు తీసుకుని వెళతా (అదేదో మాదే అన్నట్లు చెప్పేనా ;-))
    మాకు వింటర్ లో ఫ్లోరిడా ఐతే మీకు ఇటు పక్కనా???? బాగుంది. :-) అవును నాకు ఈ వూరు వైపు వదిలి వెళ్ళటం ఇష్టం వుండదు సీజన్స్ మిస్స్ అవుతాము కదా అని.
    నేనైతే వచ్చిన కొత్తలో "what's up" అంటె పైకి చూసేను తెలుసా ;-) అవును మొదటి సారి కార్ వాష్, నాకైతే వుట్టిపుణ్యానికి అలా అర్ధం పర్ధం లేకుండా కన్ను కొడితే బలే చిరాకు వేసేది.. wink wink అంట మళ్ళీ మీ తలకాయ అనుకునే దాన్ని. మా అయన రోజు ఏడిపించే వాడు అమ్మవారి లా ఆ బొట్టు తొ బయటకు వెళ్ళు ఎవడో ఒకడు గన్ పుచ్చుకుని వెంబట పడతాడు అని. ఆ దెబ్బకు ఆ సైజ్ బొట్టే కాదు అసలు బొట్టే ఎత్తేసాను బయటకు వెళ్ళేప్పుడూ, అబ్బో ఎన్నో ఇలా తలచుకుంటే... :-)
    ధన్యవాదాలు.

  1. శ్రీ లలిత గారు: అవును మంచు తవ్వి పోస్తుంటే మొత్తం ఎక్కిన సౌందర్యపు మత్తు దిగుతుంది, కాని అది ఒక సరదానే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళను బయటకు తీసుకెళ్ళి బార్నీ కధలు చెపుతూ నీ ముక్కు చెవులు స్పర్శ పోయినప్పుడూ తెలుసుకో నువ్వు ఇంట్లో కొచ్చే టైమ్ అయ్యిందని అంటు పాటలతో చలి లో ఆటలు నేర్పుతూ మంచి అనుభవం అది. మొదటి సారి స్నో లో అడ్డం గా పడి ఆ మూల నుంచి ఈ మూలకు బయట దొర్లు తుంటే కూడా బలే మజా వస్తుంది. మేము కష్టం బదులు కరిగే కేలరీ లు చూసుకుని సంతోషపడతాము స్నో తవ్వి పోస్తూ. (మరి ఎలాగో ఒకలా యాపీ అవ్వాలి కదా తప్పదు కదా ) నచ్చినందుకు ధన్యవాదాలు.

  1. అవును మరి మన ఊళ్ళో ఉన్న కొండలూ, చెట్లూ, చేమలూ, సెలయేర్లూ అన్నీ మనవే కదా! :))
    ఈసారి చూడాలి మీవైపుకి రావడానికి.. అటుకేసి ఎప్పుడూ మరి :-)

    బొట్టంటే గుర్తొచ్చింది.. ఇంకా విజయవాడ వాసన వదలని రోజుల్లోనే తన కొలీగ్ బర్త్ డే పార్టీకి ఏదో రెస్టారెంట్ లొ వెళ్దామంటే మనం చక్కగా జీన్స్, షర్ట్ వేసుకుని.. 'ఇప్పుడే బొంబాయి నించి వచ్చాయని ' మా బీసెంట్ రోడ్ రవి ఫ్యాన్సీ వాడు నాకు అంటగట్టిన తళుకుతళుకు బొట్టుబిళ్ళ పెట్టుకుని చక్కగా తయారైతే ఈయనగారు కిందపడీ మరీ నవ్వడం! ప్చ్, అలా బొట్టు పెట్టుకోకపోవడం మొదట్లో బాధగా అనిపించినా ఇప్పుడు అతిమామూలైపోయింది!

  1. నిషీ,
    నీ కామెంట్స్ తెగ నవ్విస్తున్నాయి. బోలెడు జ్ఞాపకాలు రేపుతున్నాయి. బొట్టు పెట్టుకోకుండా బయటికెళ్లడం అనే పాయింట్ నాకు చాల్రోజులు జీర్ణం కాలేదు తెలుసా! సీతా రవీన్ అనే తమిళమ్మాయి జీన్స్ కి మంగళ సూత్రం మాచ్ కాదని తీసేసి గోడకి తగిలిస్తుంటే తెల్లబోయి చూసిన రోజులు గుర్తొస్తున్నాయి. సబ్ వే లో ఒక వెజ్జీ డిలైట్ కి వందరకాల ప్రశ్నలు వేస్తే "పోహె, నాకొద్దసలు" అని అలిగి వచ్చేసిన రోజులు గుర్తొస్తున్నాయి.

    బొట్టు బిళ్ళలు మీ వూర్లో కూడా బొంబాయి నుంచి వచ్చాయనే చెప్తారన్నమాట. మా శివుడి బొమ్మ సెంటర్లో శ్రీ గోల్డ్ కవరింగ్ షాపులో వాడు ఇలాగే చెప్తే నిజమే అనుకున్నా. పాకెట్ వెనక చూస్తే బీసెంట్ రోడ్, విజయవాడ అనుంది.

  1. నిషి, సుజాత: హి హి హి.. రవి ఫ్యాన్సీ వాడి తళుకు బొట్టు పెట్టుకున్నా మంగళ సూత్రం గోడకేసినా ఇవేమి చెయ్యక పోయినా కొత్తలో మనం బాగా గందర గోళం గా ఇక్కడి సమాజానికి భిన్నం గా వుంటాము కదా. మా పెద్దమ్మ మా అక్క డెలివరీ కు న్యూయార్క్ వచ్చి, పిల్లను తీసుకుని మా ఇంటికి వచ్చి మా పల్లెటూరి వాతావరణం చూసి ఒకటే ముచ్చట పడి వెనుక దొడ్లో పెద్ద బకెట్ తో నీళ్ళు పెట్టించి, వెనుక మొక్కల పక్కన బండ రాయి మీద కూర్చుని పిల్లకు నలుగు పెట్టి స్నానం చేయించింది... రామచంద్రా మా పక్కోళ్ళకు చెప్పలేక చచ్చాను అనుకో..:-) ఐనా ఇక్కడోళ్ళేమన్న తక్కువా ఏమి మనలానే.. నేను మా పక్కావిడ దడి దగ్గర నుంచుని ఎన్ని కబుర్లు చెప్పేసుకునే వాళ్ళం, ఆమె ఒక రోజు అడిగింది ఇండియా అమ్మాయిలు బాగుంటారు, అబ్బాయి లు ఎందుకు ఒకే చొక్కా అలా రెండు మూడు రోజులు వేసుకుని కంపు కొట్టుకుంటా తిరుగుతారు అని. (డిజిటల్ లో చేసేది ఆమె). నాకు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ;-) మా వర్క్ లో వాళ్ళు నా కాళ్ళ మట్టెలు పిల్లేళ్ళు, కాళ్ళ పట్టీలు చూసి తెగ ముచ్చట పడి నా దగ్గరవి అన్ని నొక్కేసి... ఆ పైన మా అక్క కు డౌట్ కూడా వచ్చింది ఏమే మట్టెలు,పిల్లేళ్ళ, కాళ్ళ పట్టీల బిజినెస్ చేస్తున్నావా అక్కడ, ఎన్ని పంపించినా ఇంకా ఇంకా అంటావు అని. మనం ముగ్గురం ఇంకా మన లాంటి బ్యాచ్ ఎవరైనా వుంటే కలిసి మన అమెరికా ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి ఒక సిరీస్ మొదలెట్టొచ్చేమో..

  1. చూడడానికి పెద్దగా ఉంది కానీ చదవటానికి చిన్నగా ఉంది. ఇలా ఒక సారి స్క్రోల్ చేసే లోపు ఐపోయింది వ్యాసం. ఇలాగయితే ఎలా చెప్పండి, అందులో అమెరికా వచ్చిన కొత్తలో అనుభవాలు అంటే ఇంటర్వల్ లేని అషుతోష్ గోవారికర్ సినిమా (ఇక్కడ ఇంటర్వల్ ఉండదు కదా ) అంత పొడవు ఉండాలి.

    బావుంది.

  1. కొద్దిగా బిజీగా ఉండి ఒక వారంగా ఇటు రాలేదు. అమ్మో!అమ్మో! ఎన్ని కబుర్లు చెప్పేసుకుంటున్నారు. బాగున్నాయి ఇన్ని అనుభవాలు.

  1. ఈ టపా, comments చదివిన తరువాత నేను రెండు పనుల్లో ఏదో ఒకటి చెయ్యాలి.
    1. ఈ బ్లాగ్ కు రావటం మానెయ్యాలి.
    అక్కడి ప్రకృతి అందాలు అలా వర్ణించి రాస్తే ఎలాగండి...కొంచెమైనా ఆలోచించుకోకుండా...
    చదువుతూ వుంటే... అక్కడికి ఎప్పెడు వచ్చెయ్యాలా అని అనిపిస్తుంది...
    ముందే అమెరికా పై విరహం తో గత మూడు సంవత్సరాలుగా బాధపడుతున్నవాణ్ణి... :(

    2. మీ అమెరికా ఏమ్బస్సి కళ్ళు గప్పి మీ ఊరు వచ్చెయ్యటం.

    tell me which one should i choose...

  1. "చేసుకున్నోడి చిటికిన వేలు పట్టుకుని.." ఈ concept బాగుంది... డ్రింగ్..డ్రింగ్... "Dreamuu...ఎంత Naturalగా వుందో.."
    "హీరో గారు మార్పు ను ఆహ్వానించటం లో పెద్ద బిడ్డ"... ఈయన మా పెద్దన్నయ్యగారు అన్నమాట.(నా మాదిరే ఆలోచించేడు.) అడిగానని చెప్పండి.

  1. బావనగారు ,మీఅనుభవాలను చాలా బాగా రాశారు .ఫొటోస్ కూడాచాలా బాగున్నాయి .ముఖ్యంగా మీరు రాసిన విదానం నాకు బాగా నచ్చింది

  1. మీ అమెరికా కబుర్లు , ఫొటోలు బాగున్నాయి . అక్కడ స్నో చూడటము మిస్ అయ్యానే అని , ఎప్పుడూ అనుకొంటాను .

  1. భావన గారు .. మీ రచనా విధానం చాలా బాగుందండీ.. నాకు కూడా వొచ్హిన కొత్తలో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి ...
    "ఆ అనంత జలరాశుల ముందు నుంచుని తలపైకెత్తి ఆ హోరు ను వింటూ, తల వంచి ఆ తుంపరల ఆశీర్వాదాలను తీసుకుంటూ, బిర బిరా పాకే ఏటి తో పక్క గా నడుస్తూ ఆ నీటి ని చూడటం, కిందకు వురికిన నీటి మధ్య గా పడవలో వెళ్ళి చుట్టూతా కమ్ముకున్న నీటి తుంపరల మేఘాల మధ్య వుండి ఆ అందాన్ని చూడటం ఒక మధురమైన అనుభవం." ఇది చాలా బాగా చెప్పారు...

  1. చూద్దాము నాకోసం అమెరికా ఇంకేమి రత్నాలను దాచివుంచిందో బహుమతి గా ఇవ్వటానికి.

    ముందుగా పొష్టుకి చాలా థాంక్స్ అండీ.

    ఆవిడకి అమెరికా దాచిన రత్నాల బహుమతులు లభించాలనీ.....అవి మీరు మీ బ్లాగులో ఇలాగే అద్భుతంగా అలంకరించాలనీ.....మేము అవి చదివి ఇలానే ఆనందించాలనీ, ఆనందిస్తామనీ ఆశిస్తున్నానండీ.................

  1. when is this series continuing??