Subscribe RSS

ప్రపంచ మహిళా దినోత్సవం.





ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం అట.. అంటే అని కాసేపు బుర్ర గోక్కున్నా నేను.. అంటే ప్రపంచ వ్యాప్తం గా మహిళలను వాళ్ళ రాజకీయ, సామాజిక, ఆర్ధిక స్తితి గతులను గురించి ఆశావాద దిశగా సమీక్షిస్తారు, సమీక్షించి తదనుగుణం గా సంబరాలు చేసుకుంటారు అని గూగులమ్మ చెప్పింది.. సరే ఇక్కడ వున్న(ఖండాతరాలలో)మేమందరం, అంటే మహిళలందరం ఒక ప్రత్యేక తరగతి కి చెందుతాము కాబట్టి మా రాజకీయ, సామాజిక, ఆర్ధిక ప్రగతి.... రెండు పక్కల నాగరికత ను కలుపుకుంటూ, మేమే దిశా నిర్దేశం చేసుకోవాలి.... మేమే ప్రగతి పరిశీలనా చేసుకోవాలి కూడా. ఆ దిశలో ఈ మహిళా దినోత్సవం రోజు మీతో మా ఆటు పోట్లు, ఎగిసిన అలలు, విరిగిన కొన్ని కలలు అన్నీ కలబోసి సరదాగా

ఈ పరిశీలన గత 14 ఏళ్ళ నుంచి ఈ దేశం లో వుండి, మా కంటే ముందు వచ్చిన వాళ్ళను, వాళ్ళ పిల్లలను, మా తరం వాళ్ళను, మా తరువాతి తరం వాళ్ళను నేను చూసినంత వరకు, లేదా నా స్నేహితులు చెప్పిన దానిని బట్టి గ్రహించినవి. ఇవి కేవలం నా ఆలోచనలు మాత్రమే. ఇంతకు తరం అంటే ఎంత వయసు తేడా తో ఒక తరాన్ని ఇంకో తరాన్ని నిర్ణయించావు అని ఎవరైనా అడిగితే చెప్పటం కష్టమే. ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్తితులను గణన లోకి తీసుకుంటే 60 ల నుంచి 70 మధ్య ల వరకు వచ్చిన వాళ్ళ లో పెద్ద మార్పేమి కనపడలేదు. మధ్య 70 ల నుంచి 80 చివరాకరుల వరకూ మళ్ళీ ఒక తరమనుకుంటే, అక్కడ నుంచి దాదాపుగా ప్రతి 5 సవత్సరాలకు ఒక తరం గా నిర్ణయించాలేమో అనుకుంటా ఈ సాంకేతిక విప్లవాల మూలం గా.........

ఇన్ని తరాల ప్రమదల ప్రగతి ని, పరుగునూ, పడి తగిలించుకున్న దెబ్బలను, మానేక ఆ మచ్చలను కలుపుకుంటే...... మేమందరం ఇక్కడ చేసే ఒక అందమైన క్విల్ట్ (మన అతుకుల బొంత) లోని వేరు వేరు రంగుల, కాని సారుప్యాన్ని కలిగి వున్న భాగాలం. కాని ఇలా లెక్కలు, డొక్కలు చూడాలంటే అందునా ప్రమాణ సూచికలు నిర్ణయించని మా వంటి వారి ప్రగతి గురించి కొంచం కష్టమే ..

సంపాదించటమే ఆర్ధిక ప్రగతి కి సూచిక అనుకుంటే......... మొదటి తరానికి, ఇప్పటికి చాలానే ప్రగతి సాధించామనుకోవాలి... వుద్యోగాల తోటి సొంత సంపాదన, సంపాదన లేక పోయినా ప్రతి పైసా కు లెక్క చూడగల సామర్ధ్యం బాగానే వచ్చిందనుకోవాలి ఇక్కడ మాకు. మాములు గానే ఎవరికైనా, అందునా మన దేశం వాళ్ళకు వున్న గొప్ప అదనపు ప్రత్యేకత.. అంతే గొప్ప అనర్హత కూడా మన నాగరికత (నేను సింధూ నాగరికత లేదా ఎప్పటిదో కాదు, ఇప్పడు మన మధ్య న నడుస్తున్న, మన అని పిలవబడుతున్న నాగరికత ను రిఫరెన్స్ గా తీసుకున్నాను) దాని మూలం గా సాధించిన ఆర్ధిక ప్రగతి లో కనపడని చిల్లులెన్నో.. కాని తరానికి, తరానికి మారుతున్న మహిళ చాలా త్వర గానే ఆర్ధిక అంశాన్ని దానితో తనకు వస్తున్న స్వతంత్రాన్ని గమనించి దానిని నిలబెట్టుకుంటున్నట్లే వుంది.. ఇంకా సాధించవలసింది ఎంతో వుంది.. సాధిస్తారనే నమ్మకం వుంది. ముందు తరాలకు మేము పిచ్చి అమ్మ లు గా పొద్దుగూకులు పిల్లల కోసం తపన పడే silly crazy and often refered as poor innocent Moms (stupid moms is an inside expression though) గా ముద్ర వేయించుకున్నా, వాళ్ళు సాధించ బోయే మరింత ఆర్ధిక ప్రగతి వెనుక, కుటుంబ శ్రేయస్సు ను కలుపుతారు, కలిపి ఇంకా మేము వూహించని ప్రగతి మా కళ్ళముందు నిలుపుతారనే అనుకుంటున్నా.

ఇక రాజకీయ ప్రగతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. ఎన్ని సవత్సరాలున్నా ఎందుకో మనకు..... "రాజకీయాలు మనకు కాదులే" అనే ఆలోచన ఎందుకు పోదో మరి అర్ధం కాదు... పూర్తి గా అమాయకం గా కొండకొచో భర్త అడుగుజాడలలో నడుస్తాము చాలా వరకు ఇక్కడి మహిళా ప్రపంచం రాజకీయ పరం గా.. అప్పటికి ఇక్కడ చాలా తేలిక అర్ధం చేసుకోవటం.. రెండే రెండు పార్టీలు.... మన మునిసిపాలిటీ కౌన్సిలర్ ల లెక్కన మన టౌన్ లోను మెంబర్ లు, ఆ పైన మేయర్ లు, ఆ పైన స్టేట్ మెంబర్లు, మేయర్ లు, గవర్నర్ లు, ఆ పైన సెనేట్ లు మెంబర్ లు అస్సలు కష్టం గా వుండదు.. మన టౌన్ లో కూడా నెల కొక సారి మీటింగ్ లు వుంటాయి. మన వూళ్ళో పోలిసోడి మీద కోపం వచ్చినా మనం మీటింగ్ కు వెళ్ళి మన అక్కసు వెళ్ళ గక్కొచ్చు. ఇంకా మన ఇంటి ముందు చెత్త వారానికి ఒక సారా రెండు సార్లు తీసుకు వెళ్ళాలా ,వెళితే మనం మర్చి పోయి పెట్టిన కరంట్ బల్బ్ వాడు తీసుకెళతాడా తీసుకెళ్ళడా అనే విషయం గురించి కూడా వోటు వెయ్యవచ్చు..ఆ పైన మనం కట్టే టేక్స్ లు ఎంతెంత భాగం ఎవరికి వెళుతున్నాయో చూసి, ఏమి తోచనప్పుడు కళ్ళ నీళ్ళెట్టుకోవొచ్చు.మనం కట్టే సోషల్ సెక్యూరిటీ టేక్స్ లు మన H1 ఐపోయాక ఇండియా వెళి పోతే వస్తాయా రావా అని వర్క్ లో లంచ్ టేబుల్ దగ్గర ఎవరైనా బకరా దొరికితే క్లాస్ పెట్టొచ్చు. చాలా వుపయోగాలు వున్నాయి మనం ఈ రంగం లో ప్రగతి సాధిస్తే. అన్నిటి కంటే ముఖ్యమైన భాగం మనం ఈ సమాజం లో ని ఒక భాగమనే నమ్మకం, ఆ పైనా ఆ నమ్మకం కలిగించే ఆత్మ విశ్వాసం... ఆర్ధిక, సామాజిక ప్రగతి సాధించటానికి కూడా వుపయోగ పడుతుంది. కాని ఎందుకో మన వాళ్ళు ఈ దిశ గా అస్సలు దృష్టి పెట్టం, సాధించింది అల్పం ,ప్రగతి దిశలో దూసుకెళ్ళవలసిన దారి అనంతం అని నా అభిప్రాయం.

ఇంక ఆఖరిది మన ఆడవాళ్ళు ఏ దేశం లో వున్నప్పటికి ఎప్పటికి మనస్పూర్థి గా ఎప్పటికి మాట్లాడనిది, సాధించిన ప్రగతి కూడ తప్పేమో అని బెంగ గా, సిగ్గు గా దాచుకునే ది ఈ సామాజిక ప్రగతి. సామాజిక ప్రగతి ప్రమాణాలేమిటి అనే ప్రశ్న........ అందునా ఏ దేశపు సమాజానికి పూర్తి గా అన్వయించు కో బడలేని మేము, ఈ ప్రగతి సాధించటమంటే విశ్వామిత్ర సృష్టి నుంచి అటో ఇటో మళ్ళటమే. నా వరకు సామాజిక ప్రగతి అంటే భావ స్వాతంత్రం, బలమైన వ్యక్తిత్వం, ప్రశ్నించ గల సామర్ధ్యం, నమ్మిన దానిని ఆచరించ గల మానసిక ధారుడ్యం. సామాజిక ప్రగతి అనగానే ఇక్కడ వుండే మన వాళ్ళు ఒక వికృత మైన మొహం పెట్టి "ఆ సాధిస్తారు లెండి ప్రగతి, ఇక్కడ కు వచ్చి మన నాగరికత మర్చి పోయి వెర్రి తలలేసే సామాజిక ప్రగతి (అంటే ఇవే మాటలు కావు ఇంచు మించు గా ఇదే అర్ధం వచ్చేట్లు) " అని అంటారు. బాగా చదివి వుద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని లేదు దాదాపు గా అందరి ది అదే భావం. ఆడవాళ్ళు కూడా అదే మిథ్ లో వుంటాము ప్రగతి గురించి.. ఇలా అన్న వాళ్ళందరిని అడిగి సమీకరించుకున్న సమాధానాలను బట్టీ నాకనిపించేది ఏమిటంటే మనకు నచ్చి( ఒక్కో సారి బలవంతం గా నచ్చబడతాయి ) మనం, ఇంకా మన వాళ్ళు అచరించేవి వరకు ప్రగతి, మిగతావి బరి తెగించటం లేదా నాగరికత ను భ్రష్టు పట్టించటం... ఈ విషయం లో మాత్రం ప్రగతి కి సరైన నిర్వచనం ఏర్పరుచుకోవాలి, ఏర్పరుచుకోలేక పోయినా సామాజిక ప్రగతి ని రంగుటద్దాలలో చూసి మురవటమో, భూతద్దం లో చూసి వణకటమో కాకుండా, ప్రగతి అనేది మనం వుంటున్న సమాజం, మనం పెరిగొచ్చిన సమాజం రెండిటిని సమన్వయపరుచుకోగల ఒక వంతెన లా మనం మలచుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

ఇదండి ఈ మహిళా దినోత్సవం రోజు, దేశాంతరాలలో వున్న ఓ మహిళ మనసులోని వూసులు..

అందరికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కావలసింది సాధించగల ఆత్మ సైర్ధ్యం, సాధించినది నిలబెట్టుకోగల విచక్షణ మనకు లభించాలని ఆశిస్తు......