Subscribe RSSకొత్తపాళి గారన్నట్లు కాసేపు మనం వున్న దేశం, మన చుట్టూతా జరిగే జీవితాలు,మార్పులను... మన నిత్య జీవితాలలోని ఒడి దుడుకులని.... ఎదుర్కుంటున్న సమస్యలు వెతుక్కుంటున్న పరిష్కారాలు వీటి గురించి రాయాలనిపించింది నాకు కూడా.

సరే పాలిటిక్స్ గురించి మాట్లాడదామంటే అంత మనసనిపించలేదు, ఏమి వుంది రెండు, రెండంటే రెండే పార్టీ లు మనకు మల్లే తిట్టుకోరు చెప్పులు విసురుకోరు బంద్ లు చెయ్యరు. అంత మజా రాదు. జాతి వివక్షత, లంచగొండి తనం, లాబీయింగ్ (అదే పార్టీ ఫండ్ లు గట్రా) వుంటాయి కాని ఏమి వుంది లే తరువాత రాయొచ్చు అని పక్కన పెట్టేను.

ఆర్ధిక విధానం, రాజకీయం గా వ్యక్తి గతం గా అది ఇక్కడ జీవితాలను ప్రభావితం చెసే విధానం హ్మ్మ్.. అదీ రాయొచ్చు, కాని అంత వివరం గా రాసే అనుభవం లేదు పైగా గ్లోబలైజేషన్ అయ్యాక ఆర్ధిక పరిస్తితి అనేది దాదాపు గా తెరిచిన పుస్తకమయ్యింది. ఏది అవలేదు అనుకోండి.

ఎంత గ్లోబలైజేషన్ ఐనా ఇంకా చెప్పుకోవటానికి పంచుకోవటానికి చర్చ పెంచుకోవటానికి తేలిక గా నా వంటి నాన్ రచయత్రులు (పదం బాగుంది కదు) రాయ తగినది ఏమి వుంది.. ఆ అదే అదే వస్తున్నా దాని దగ్గరకే.

రోజు వారి జీవితం గురించి. అదే నేను పైన ప్రస్తావించినది. ఎంత సేపైనా చెప్పుకోవొచ్చుజీవితం అందులోని మార్పు లు చేర్పులు కూర్పులు (రెండూ ఒకటే అనుకుంటా కదా ఏదో ప్రాస బాగుందని వాడేను లెండి) అమెరికా లో నైనా, భారత దేశం లో ఐనా. అదే కదా మన కబుర్ల ఇంధనం.

దీని గురించి ఒక వరుస క్రమం లో రాయలేను కాని తోచిన విషయాలు రాయాలని నిర్ణయించుకున్నా. మా వర్క్ లో ఆడవాళ్ళు, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కలిసి ఒక గ్రూప్ వుంది మాకు. మంచి చెడు, సుఃఖం కష్టం కలబోసుకుంటాము అప్పుడప్పుడు. యాధృచ్చికం గా అంతకు ముందే ఆ గ్రూప్ లో అమెరికా రావటం లో మన జీవితాలలో, మనం విషయాలను చూసే తీరు లో, జీవిత దృక్పధం లో వచ్చిన మార్పులు అనే దాని గురించి అందరి అభి ప్రాయాలు పంచుకోవాలనుకున్నాము. ఆ పైన ఈ దేశం లో కి రావటం వలన మా కుటూంబాలలో మా జీవితాలలో వచ్చిన స్ట్రెస్ (వొత్తిడి), దానిని మేము ఎలా డీల్ చేసేము అనే దాని గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాము. మా గ్రూప్ లో చాలా మంది నా బ్లాగ్ చదువుతూ వుంటారు. వాళ్ళ అభిప్రాయాలను బ్లాగ్ లో పెడతాను అన్నప్పుడు అందరు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ లో రాసినవి నేను తెలుగు లో తర్జుమా చేసి పెడదామని కూడా నిర్ణయించుకున్నాము. ఈ గ్రూప్ లో కొత్త గా పెళ్ళి అయ్యి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడకు వచ్చి 14 ఏళ్ళయిన నా వరకు వున్నారు. కొందరు తేలిక గా క్లుప్తం గా వాళ్ళ మనసును వ్యక్తీకరిస్తే, కొందరు వాళ్ళ జీవితం లో సహచరుడు పంచిన ప్రేమ, బిడ్డలు తో తెచ్చుకున్న జ్ఞానం గురించి చెపితే, మరి కొందరు వాళ్ళు జీవితం లో సాధించిన విజయాలు పంచుకుంటే, ఇంకొందరు కెరీర్, జీవితం మధ్యన సమన్వయం చేసుకున్న విధానాన్ని చెప్పేరు. రేపటి నుంచి ఒక్కొక్కరి అనుభవాలను ఈ పశ్చిమ దేశాల గడపల అలంకరించిన తోరణాల మాలికలను మీ ముందు వుంచుతా.

చెప్పే ముందు మీ అందరికి అమెరికా దాని వైశాల్యాల, వైవిధ్యాల గురించి చెప్పి విసుగు తెప్పించను కాని మేము వుంటున్న వూరు దాని స్తితి గతులు కొంచం సేపు... సరేనా..

మేము దేశం లో ఒక మూల కు బోస్టన్ పక్క గా వుంటాము. రాష్ట్రమంటే మరీ మన ఆంధ్రా లా పెద్దది వూహించుకోకండీ. ఇది ఒక బుల్లి రాష్ట్రం, అందులో కూసినన్ని నగరాలు, ఎక్కువే పట్టణాలు ( నాకు ఈ విషయం ఎప్పుడూ కన్ఫ్యూజనే 14 ఏళ్ళు ఐనా వచ్చి. మాంచెస్టర్ సిటీ అంటారు మళ్ళీ టౌన్ హాల్, టౌన్ లో అంటారు మళ్ళీ ఈ వూరులన్ని బాగా పెద్ద వూరు పక్కన వుంటాయి కాబట్టి ఇవి అన్ని సబ్ అర్బ్స్ అదే పల్లెటూళ్ళు అంటారు, ఇందులో ఏది నిజమో నాకైతే తెలియదు)

మన ఆంధ్రా లో ఒక మాదిరి పట్టణం అనుకోండి. సరే మన బ్లాగ్ లోకం లో బాగా వూరు గురించి (డబ్బా అని నాలాంటి గిట్టని వాళ్ళు అన్నప్పటికి అది అభిమానమనే అనుకోవాలి లే) అభిమానం వున్న బ్యాచ్ ఎవరు? అదుగో మీకు గుర్తు వస్తోంది....... అదే అండీ నరసరావు పేట. అబ్బో సుజాత గీతాచార్య ఇంకా ఆబ్యాచ్ చూపుల చురుకు కంప్యూటర్ లు దాటి తగులుతోందే.. ఆ నరసరావు పేట మాదిరి వూరనుకోండి ఇది కూడా. అన్ని వుంటాయి కాని ఏమి పెద్ద లేనట్లే సిటీ లతో పోల్చుకుంటే.. మన వూర్లు చాలా నయం కాని ఇక్కడ అమెరికా లో ఇలాంటి వూర్లు పెద్ద వూర్లే, వుద్యోగాలు బోలెడన్ని వుంటాయి పెద్ద కంపెనీ లు కొన్ని ఇలాంటి చోట్ల మొదలెడతారు కామట్టి. కాని పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ వుండదు పెద్ద గా. ఏదో పెద్ద రోడ్ ల మీద బస్ లు అవి వెళుతూనే వుంటాయి కాని అర కొరా గా అంతే. కార్ లే ముఖ్యమైన ప్రయాణ సాధనం మిగతా అన్ని వుంటాయి.

నాకు బయటకు వెళ్ళాలని వుంది అనగానే చటుక్కున చెప్పులేసుకుని బయటకు వచ్చి ఏ రిక్షా నో ఆటో నో పట్టుకుని వెళి పోయేటట్లు వుండదు. ముందస్తు గా బయట వాతావరణం చూసుకోవాలి మాకు బాగానె చలి ఎక్కువ. అమెరికా లో నాలుగు కాలాలు అని బడాయి గా ప్రజలు చెప్పుకోవటం కద్దు కాని నిజానికి రెండే. చలి కాలం, చలి లేని కాలం. మొదటిది 9 నెలలుంటుంది, ఆ తొమ్మిది నెలలనే బడాయి గా స్ప్రింగ్, వింటర్, ఫాల్ అని అంటారు కాని మన వరకు అంతా చలి కాలమే. మిగతా మూడు నెలలు చలి లేని కాలం ఎండా కాలమా అంటే వూ ఇంచుమించు గా, రమా రమి గా, అటు ఇటు గా అంతే అని మొహమాట పడుతూ చెపుతాము.

సరే ఈ వాతావరణ వివరాలు వదిలేసి మా జీవితాల గోల కు వస్తే మా వూరు పేట లెక్క అని చెప్పేను కదా. అలాంటి వూరు లో ఒక చిరు వుద్యోగం చేస్తున్నా నేను నాతో పాటు గా చాలా మంది మనోళ్ళు. అవునండి మన వాళ్ళు ఎక్కువే ఇక్కడ. నేను వుండే టౌన్ లో ఐతే, నేను వుండే వీధి లో మొత్తం అందరం మన దేశమోళ్ళే, ఒక పాకిస్తాను అతను ఒక తెల్లోళ్ళూ అంతే. చాలా ప్రశాంతం గా సాయింత్రమైతే అంతు లేని చుక్కలను, తెల్లరితే మంచుపూల వుషోదయాలను ఎక్కడ చూసినా చెట్లు, పచ్చ పచ్చ గా, చల్ల చల్ల గా అందం గా వుంటుంది లెండి మా వూరు. అలాంటి చోట వుండే మా గోల వినటానికి ముందు గా మీ అందరిని మానసికం గా ఆయత్తం చేసినట్లు వున్నా కదు. ఇక ఈ సోది ఆపి రేపు, యెల్లుండి లలో మొదలు పెడతాను మా జీవన గీతాలాపన. అందాకా అందరికి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.

ఎన్నో అనుకుంటాము గతమంతా మనమే అనుభవించాము ఆ ఘనత అంతా మనదే... వర్తమానం లో ధనం బలం వున్నాయి మనం ఏమి చేస్తే అదే నిజం ఎదురు లేదు, మనం ఏది అనుకుంటే అదే నిజం అని ప్రగాఢం గా నమ్ముతాము, పైకి అందరి తో అనకపోయినా.. ఇప్పుడు ఏదో అదర గొడుతున్నాము భవిష్యత్తు కోసం, కాబట్టి తిరుగు లేదు అని కూడా అనుకోవటం కద్దు. కాని ఒక్క క్షణం ప్రకృతి అవునా అని గల గల మంటేనో , నిజమా అని చిన్న గా తలవూయించుతేనో,, అబ్బో అని కొంచంగా విస్తుపోతేనో.. ఏమి వుంది... మానవ జీవితపు అసలు డంబారం బయట పడుతుంది.. ఒక సునామి విసురు లోనో ఒక భూకంపం వూపు లోనో.. ఒక వరదల విదిలింత లోనో మన అల్పత్వం బయట పడి మనమెంత అల్పమో మన గొప్పతనం ఎంత తాత్కాలికమో అర్ధం అవుతుంది..

కాని మనం మానవులం ఏకీ భావం లోనే భిన్నత్వం, భిన్నత్వం లో మానవత్వం కలగలిపిన సామాన్యులం, దుఃఖిస్తునే చేయుత అందించుకుంటాము. చేయందిస్తూనే గిల్లుకుంటాము కలిసి మళ్ళీ మంట పుట్టిందని ఏడుస్తాము. ఏమిటో.. హేటీ లో చూస్తుంటే కడుపులో దేవుతోంది. మానవ జీవితపు డాంబీకం అంతా మాములు గా వున్నప్పుడే... ప్రాణం పోయాక మనం ఎక్కడ భూమి లో కలిసి పోయామో లెక్క లో కూడా తెలియని పరిస్తితి, ఒక వేళ మన శరీరం బయటకు వచ్చినా చెత్త వేసినట్లు డంప్ ట్రక్ లో కి విసిరి వేయ బడుతున్నామని మనకు ఎలాను తెలియదు మన ఆప్తులకు కూడా తెలియని పరిస్తితి.. జీవితం నుంచి విసిరేయబడి ఏమి చేయాలో తోచక చేష్టలుడిగి చూస్తున్న పెద్ద వాళ్ళు, 15 రోజుల పసి గుడ్డు ఏమి చూడాలనో ఏ ఆశ తోనో అంత భూకంపం నుంచి, నెత్తి మీద దెబ్బ తో బయట పడి కాళ్ళు చేతులు కదుపుతు కళ్ళు విప్పార్చి చూస్తోంది.. ఒక పక్క టీవీ వాళ్ళు మాట్లాడుతుంటే వెనుక గా వినిపించే హృదయ విదారక రోదనలు.

బాధ సముద్రమల్లే ముంచేస్తోంది. కళ్ళ చెమరింతల తో, గుండె లో అపరాధ భావం తొలిచేస్తుంటే ఏమిటో కాలు చెయ్యి ఆడనట్లు వుంది వాళ్ళను చూస్తుంటే అలా. అపరాధ భావమెందుకు అంటారా? ఈ పెద్ద దేశం చిన్న దేశాలను కొల్ల గొట్టుకోవటం, బలవంతుడి దే రాజ్యం, ఎవరిది ఎంత వరకు తప్పు ఇటువంటి పెద్ద పెద్ద విషయాలను పక్కన పెట్టి చూసినా, ఇంత సమతుల్యం పోవటం లో, ఈ ప్రకృతి ని ఇంత తొందరగా వెంట వెంట నే నైసర్గిక రూపాలతో ఆ లక్షణాలతో సంభంధం లేకుండా ఎక్కడైనా ఏదైనా వచ్చేస్తూ జన జీవనాన్ని అతలా కుతలం చేసుకునే పరిస్తితులను ఆహ్వానించటం లో నా పాత్ర వుంది కదా అని. మన అందరి పాత్ర వుంది కదా.. ఎందరో ఎక్కడో చేసిన తప్పు కు ఇంకెవరో ఎక్కడో పరిహారం చెల్లిస్తూ వుండటం అన్యాయం కదు.

రెండు రోజుల నుంచి ఒక పాప ను బయటకు తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు. కాలు తీసేస్తే బయటకు వస్తుంది అట కాని ఎక్కించటానికి రక్తం లేదు అందుకని కాలు తీయకుండా బయట కు తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు అట. ఆ పాప అమ్మ పక్కనె కూర్చుని వుంది, ఆమె మానసిక పరిస్తితి తలుచుకుంటే దేవుడి మీద కోపం వస్తోంది ఎవరికైనా తప్పు కదా అలాంటి పరిస్తితి తీసుకురావటం ఎందుకు అలా చేసేవు అదే మంటే మళ్ళీ కర్మ సిద్ధాంతం చెపితే ఒప్పుకోను అని నిలదీయాలనిపిస్తుంది. కాని ఆయన మనలనే తిరిగి ప్రశ్నిస్తాడేమో మీరు కాదా మీ పరిస్తితి కి కారణం అని.
వనరులను వాడుకోవటం అనివార్యమే ఐనా దుర్వినియోగం చెయ్యకుండా ఐతే ఆప వచ్చు కదా. అనేక రూపాలలో ఎంత వృధా.. మన వంతు గా మనం తగ్గించుకోగలవి తగ్గించుకుని మనం వృధా చేసేవి ఆపుదామా.. ఈ దారుణాలన్నిటి కి నైతిక భాద్యత మన అందరి మీదా వుంది కదా. ఒక్క సారి భాద్య త గా భావించి చెయ్యగలిగినవి చేద్దామా.. వూరికే పేపర్ కప్ లు ప్లేట్ లు, అవసరమున్నా లేక పోయినా పెపర్ నేప్కిన్స్ వాడి పార వెయ్యటం దగ్గరనుంచి నీళ్ళు వృధా చేయటం, నేల లోకి వెళ్ళి భూమి కి అపకారం చేసే ప్లేస్టిక్ చెత్త లో వేయకుండా రీసైకిల్ చేయటం నుంచి... అనవసరం గా కార్ లో తిరగటం, ఏసీ లు వాడటం, కృత్రిమ మైన రసాయనాలు వాడటం వరకు ఏదైనా ఏదైనా మనం మన వంతు గా చేయగలిగేవి చాలానే వుంటాయి. ఒక్క సారి ఆలోచించి చూద్దామా చెట్లు కొట్టేసే ముందు, అవసరం లేని నూనె నుంచి కార్ బేటరీ పారేసే వరకు ఎక్కడ వేస్తున్నామో అని.

మనలో మన మాట 2004 నుంచి ఇప్పటి వరకు 700 మిలియన్ల డాలర్ లు అమెరికా ఇచ్చిందట హేటి కి. కిందటి సవత్సరం అన్ని దేశాలు కలిపి 1.4 బిలియన్స్ ఇచ్చారట ఆ దేశానికి, ఐనా ఏం అభివృద్ధి లేదు ఇది ఎవరి పాపం ఎవరి దోషమో మరి. అలా ఆలోచిస్తే మనం ఇచ్చే 100 కూడా ఇవ్వబుద్ధి కాదు.

మనం చేసే ప్రతి పని కి ఒక ఫలితం వుంటుంది అట...... కాని పని మనదే దాని ఫలితం మనదే అంటారు పెద్దవాళ్ళు. కాని ఒక్కోసారి ఇలాంటివి చూస్తే ఎవరో కొందరు చేసే వాటి ఫలితం చాలామంది అనుభవించటం కర్మ సిద్ధాంతమా.. ఏమో అయ్యి వుండవచ్చు..