Subscribe RSS

నాకు ఆప్త మిత్రులైన మధుబాబు గారితో అనేక సందర్భాలలో మాట్లాడిన సంభాషణలు అన్ని కలిపి ఒక పోస్ట్ లా చెయ్యాలనేది నాకెప్పుడు కోరిక.. అది చేసే లోపు ఆయన సుజనరంజని వారికి ఇచ్చిన ఒక ఆణి ముత్యం మీతో ఇలా.. మీ అందరి అభిప్రాయాలు తెలుసు కో గోరుతూ..


ఋతంభర: 1 (ది ఇంటర్నెట్ ఆఫ్ మాష్టర్స్) ~ అతీతంలోకి ఆలోచనలు
- ప్రఖ్యా మధు బాబు


ఋతంభర ఒక విశ్వ జ్ఞాన కోశం. ఋతంభర అన్ని దివ్య సంకేతాలకి, అనుభూతులకి మూలం. ఋతంభర ఆధ్యాత్మిక దూరవిద్యా విజ్ఞానం. అది అన్ని చోట్లా విశ్వమంత వ్యాపించిన చైతన్యం. ఎక్కడైనా ఉండి, ఎక్కడినించైనా మాట్లాడ గల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ ఋతంభర. దేవతలు, మహర్షులు, సాధకులు, మానవులు, జంతువులూ, ఇంకా జీవరాశుల, నిర్జీవ రాశుల చైతన్యమంతా ఇమిడిఉండి వాటిని నిర్దేశించే ఓ దివ్య శక్తి జాలం ఋతంభర. ఇది కేంద్రీకరించబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైతే అతను తన గురువుతోనూ, దేవతా శక్తితోనూ 'కనెక్ట్ ' అవుతాడు. ఆ సాధకుడి భృగు మధ్యం, అంటే మూడో నేత్రం ఉండే (కనుబొమ్మల మధ్య) చోటనిండి సృష్టి సంకేతాలు వస్తూ, పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి. అతను లేక ఆమె భూత, భవిష్యత్, వర్తమానాలకతీతంగా విషయాలను దర్శించ గలరు, వినగలరు, ఏదైనా తెలుసుకో గలరు. ఆజ్ఞా చక్రం తెరుచుకుని, అంతర్ముఖమైన జ్ఞాన చక్షువులు విచ్చుకుని, తానున్న చిన్న 'నేను ' అనే వృత్తం నించి బయటికి, తన దైనందిన సాధారణ జీవన పరిధినించి బయటకి వచ్చి, విశ్వవ్యాపక అసాదృశ శక్తి అనుభూతి చెందుతూ, అప్పుడప్పుడు ఆ మహా దివ్య కాంతులను అనుభవాన్ని పొందుతూ మళ్ళీ మామూలు పరిధిలోకి వస్తూ ఉంటాడు. అతి మామూలు మాటల్లో ఇది ఒక పైలట్ దిన చర్య లా ఉంటుందు. కొంత సేపు ఆకాశ విహారం, ఎగరనప్పుడు కొంత ఇహలోకపు విహారం.

ఇలాంటి ఋతంభర శక్తి ఏ ప్రత్యేక వ్యక్తులకో కేటాయించింది కాదు. ఇది సృష్టిలో ప్రతి జీవికి సొంతం. వారి వారి స్థాయిని బట్టి వారు వాడుకో వచ్చును, ఆ శక్తిని పెంచుకోవచ్చును. యోగులు కళ్ళు మూసుకుని ఎదైనా చూడాలనుకున్నప్పుడు ఆ దర్శనాన్ని అందిచే ప్రజ్ఞ ఋతంభర. ఎక్కడో ఉన్న పుత్రిక ఏడిస్తే నిద్రపోతున్న తల్లిని లేపి ఏదో జరుగుతోందని తెలిపే శక్తి ఋతంభర. అన్నిటిని మరిచి తాదాత్మ్యతతో ఇష్ట దేవత జపం చేస్తున్నప్పుడు ఆ దేవత వచ్చిందని తెలిపే సూచనలందించే నిశ్శబ్ద శక్తి ఋతంభర.

మానవ శరీరంలో నరనరమూ, చర్మమూ, అణువణువూ ఏకమై ఒక మనిషిగా ఉండి ఎక్కడో కాలి గోటికి దెబ్బ తగిలితే తల దాకా మెదడుకి నొప్పి తెలిసేలా ఎలా 'ఏకత్వం ' ఉందో అలాగే సృష్టి అంతటా వ్యాపిస్తూ ఉండే 'తెలివి ' ఋతంభర. నిజానికి ఋతంభరకి ఏ పేరూ లేదు. పేరు పెట్టడం వల్ల దాని గురించి మాట్లాడు కోవడం సులువవుతుంది. పేరు పెట్టడం అయినంత మాత్రాన ఒక విషయం అర్ధమయి పోదు. అర్ధం చేసుకోవడం మొదలవుతుంది. కొత్తగా పుట్టిన బిడ్డకి పేరు పెడితే జీవితం మొదలువుతుంది ఆ పేరు మీద. ఇంకా కధ ఎంతో ఉంటుంది - ఇదీ అలాగే. పేరు తెలియగానే అర్ధం - అర్ధం కూడా అవదు. మంత్రం తీసుకోగానే సిద్ధి వచ్చేయదు, సాధన మొదలవుతుంది. సృష్టి బడిలో, అమ్మ వడిలో మళ్ళీ కూచుని యోగి తన తపస్సుని మొదలు పెడతాడు. ఋతంభరని అనేకులు అనేక సార్లు దర్శించారు. ఒక్కో కోణంలోంచి ఒకలా పిలిచారు. అన్నీ కలిపినా ఆ ఋతంభర పూర్తి కాదు. 'దేజా వూ ' అంటే ఏమిటి ? 'దివ్య దృష్టి ' అంటే ఏమిటి ? 'ప్రకృతి ' మాట్లాడడం అంటే ఏమిటి ఇలా ఎన్నో ఇన్నాళ్ళూ ఈ వ్యాసాల్లో కొద్ది మాటలు స్పృశించాం. అన్నీ కలిపినా, ఆ దివ్య శక్తిని ఎలా చెప్పలేవో అలాగే ఋతంభరనీ!
కొద్ది ఏళ్ళ క్రితమే, అరిగో సాయి బాబా. షిర్డిలో ధుని దగ్గర కూచుని ఉన్నారు. గోడ మీద ఒక బల్లి అరిచింది. అక్కడున్న ఒక భక్తుడు బాబాని అడిగాడు, ఆ బల్లి ఏమంటోంది అని. బాబా నవ్వి చెప్పారు, ఆ బల్లి ఆనందంగా ఉంది ఇవ్వాళ దాని సోదరి ఔరంగాబాదు నుండి వస్తోంది అని. కొద్దిసేపట్లోనే ఔరంగాబాద్ నుంచి ఒక భక్తుడు రావడం జరిగింది. అతను తన గుర్రానికి గడ్డి వేస్తూ ఆ సంచీని దులపడం అందులోంచి ఒక బల్లి పడడం అందరూ చూసారు. ఆ కొత్తగా వచ్చిన బల్లి గబ గబా పాక్కుంటూ గోడ మీదకి వెళ్ళి అక్కడున్న బల్లితో ఎగుర్లు పెడుతూ ఆడడం అందరూ చూసారు. అందరికి అర్ధం కానిదేమంటే అసలు ఈ బల్లి మాటలు బాబా కెలా అర్ధమయ్యాయి? ఔరంగాబాద్ నించి బల్లి వస్తుందని ఆయనకెలా తెలుసు? ఈ షిర్డిలో బల్లికి ఆ బల్లి చెల్లి ఎలా అవుతుంది? ఇలాంటివి మనకి 'లాజికల్ ' గా అర్ధం కాని ప్రశ్నలు. యోగులకి అన్ని భాషలు ఋతంభర అర్ధమయ్యేలా చేస్తుంది అనడం కన్నా, ఋతంభరే ఒక భాష అనడం సబబు.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ' అన్నారు భగవత్గీతలో. శ్రద్ధగా తెలుసుకో వాలనుకున్నవాళ్ళకి ఆ జ్ఞానం లభించి తీరుతుంది. ఋతంభర ద్వారా ఆ విషయానికి సంబంధించిన జ్ఞానులో, పుస్తకాలో, లేక మనోగతంగానో, లేక స్వప్నం లోనో ఈ జ్ఞానం కలిగి తీరుతుంది. కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంది. కళ్ళు మూసుకుపోతే కనిపించదు జ్ఞానం. అంధకారం రెండు రకాలుట. అజ్ఞానం వల్ల, అతకని జ్ఞానం వల్ల. ఒకటి చీకటి వల్ల కనిపించనిది, ఇంకోటి 'అహం ' అనే అతితీవ్ర కాంతి వల్ల ఏర్పడుతుంది. రెంటిలోనూ మనకి దారికనిపించనపుడు, గురువనే శక్తి (వ్యక్తి కాదు, ఎందుకంటే 'గుకారస్చ గుణాతీతో రుకారస్చ అంధకార నిరోధకః అని గురు శబ్దానికి నిర్వచనం కనుక) అపుడు మార్గం చూపిస్తుంది. ఆ శక్తిని ప్రేరేపించి పనిలో పెట్టే శక్తి ఋతంభర.

కొందరు ఋతంభరని 'ఆకాషిక్ రికార్డ్స్ ' గా భావిస్తారు. కొందరు దీన్ని 'వేదం ' అన్నారు. కొన్ని సార్లు మనం మన 'గోల ' తగ్గించి తపో తలంలో వింటే వినిపించే సంగీతం ఋతంభర. మన చలనాలని తగ్గించి సృష్టి చలనాలని అర్ధం చేసుకోవడం మొదలు పెడితే కలిగే అవగాన, కనిపించే చిన్ని, సూక్ష్మ తంత్రులు - సంఘటనలకి వెనకాల, ఆలోచనలకి అవతల అపుడపుడు స్పష్టంగా కనిపించే తంత్రుల్లా ఋతంభర. ఈపని చెయ్యొద్దు, అది చెయ్యి అని మంచి మార్గంలో నడిపిస్తూ మనలోంచే మాట్లాడే దక్షిణామూర్తిలా ఋతంభర.

కొందరు ఇప్పటికి నమ్ముతారు - దేవుడు ఈ విశ్వం కప్పు మీద ఆకాశంలో ఎక్కడో ఉంటాడని. అయినా కావచ్చు కాని మనం అనుకుంటున్న దానికన్నా మనదగ్గరకి ఎక్కువసార్లే వస్తాడుట. ఋతంభరలో మంత్రాల్లాంటి, బీజాక్షరాల్లాంటి చిన్న చిన్న ప్రార్ధనలుంటాయిట. ఒక చిన్న ప్రార్ధన, బుజ్జి వినతి అత్యంత వినయపూరితమైన భక్తితో పంపినపుడు అది ఋతంభరలోంచి దేవతా తలానికి చేరుతుందిట.ఆకాశంలో ఆ మహా కాంతిమయమైన తేజో రాశిని చూశారా? దాన్ని ప్రజలు 'సూర్యుడు ' అంటున్నారు. దాన్ని చిన్నప్పటినించి సూర్యుడు అని మనకి నేర్పబట్టి, చూడబట్టి పొద్దున్నే రోజూ, మనం కూడా సంతోషించాం - ఓ తెలిసింది ఇది సూర్యుడు అని. మనకి జ్ఞానం వచ్చినట్టు అనిపించింది. కొంతకాలానికి తెలిసింది అది ఒక నక్షత్రం, మనం భూమి అనే గ్రహం మీద ఉన్నామని. జ్ఞానం పెరిగినట్టుంది, ఇంతకు ముందు కన్నా మనకి ఎక్కువ తెలుసు కనుక. కానీ, పోను పోను మనకి సూర్యుడు నక్షత్రం అనేసుకుంటూ ఆనందించకుండా అది ఒక భౌతిక మూలకాల ముద్దగా భావిస్తుంటే మనకి 'సూర్యుడు ' అనే అనుభూతి పోతుంది. దాంతో సూర్య తత్వాన్ని చేరలేం. జీవితపు నిజమైన అనుభూతి 'రసమే ' అని వేదాల్లో కూడా చెప్పారు. రాధాకృష్ణ తత్వంలో రసానుభూతి కున్న ప్రాముఖ్యత ఇంక దేనికీ లేదు. సృష్టి అనే అద్భుతాన్ని కూడా అనుభూతి చెందడం ఒక అదృష్టం, అది పంచ గలగడం వరం.

సంధ్యా వందనం చేస్తున్న ఋషి కేవలం 'రవి ' అనే భౌతిక తేజస్సుకి నమస్కరించడం లేదు. భూలోక, భువర్లోక, సువర్లోకాలలో తేజంతో వుండే - బుద్ధిని ప్రచోదనం చేసే ఆ అంతః సూర్యుడికి నమస్కరిస్తున్నాం. ప్రకృతిలో ప్రతి సంఘటనా చిత్రమే. ఇంద్ర ధనస్సు నించి అరోరా బొరియాలిస్ దాకా అంతా అపురూప సౌందర్యమే! జీవ చైతన్యం కోసం ఎన్ని బిలియన్లు ఖర్చుపెడుతున్నాం?! ఎక్కడో ఉన్న గురుగ్రహం తాలూకు ఉపగ్రహమైన యూరోపా మీద ఉన్న మంచు ఉపరితలం కింద ఉన్న జలంలో జీవరాసులు కణాలుగా పాకుతున్నాయేమో అని వెతుకుతున్నాం. అద్భుతమే కానీ మన పక్కనున్న వాళ్ళ మనోవ్యధనీ అర్ధం చేసుకునే ప్రయత్నంలో ముందడుగు వేద్దాం. అపుడుకాని అర్ధకాదు సర్వవ్యాపక బ్రహ్మ శక్తి ఏంటో! కనీసం ఈ చిన్న జీవితం తాలుకు చిరు లక్ష్యం ఏమిటో!

ప్రతి కణంలో అణువులో ఉందిట అద్భుత రహస్యం. సైన్సు నాకెంత ఉపయోగ పడుతోంది దేవుడినర్ధం చేసుకునేందుకు ! దేవుడి నిర్మాణ జ్ఞానాన్ని కొనియాడేందుకు కూడా భాషని, నోటిని ఇచ్చిన ఆ దేవుడిని కొనియాడక తప్పదు దేవుడనేవాడుంటే, నా మాటే వింటే.

ఇన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత మనకి దేవుడు సృష్టించిన క్వాంటం ఫిజిక్స్ లో క్వాంటం అంత ముక్క కూడా అర్ధం కాలేదు. దేవుడా ఇంకా ఎంతుందో ఈ సృష్టి, ఏదో మాకు తెలిసిన కొద్ది జ్ఞానంతో మత గ్రంధాలూ అవీ రాసేసుకుని, మంత్రాలూ అవి చదివేసుకుని ఆనందించేస్తున్నాం. ఇవి పని చేస్తున్నాయో లేదో తెలుసుకునేంత శక్తినివ్వు. కనీసం ఒక రెండు మూడు వందల సంవత్సరాలైన (ఉద్యోగాలు అవి అక్కర్లేని) జ్ఞానార్జన కోసం సమయం ఇవ్వు. ఇంత చిన్న జీవికి ఎంత విశ్వాన్నిచ్చావు? కొన్ని కాంతి సంవత్సరాల (కాంతి సెకన్ల) దూరమైనా ప్రయాణం చేయలేని నేను నిన్నెలా తెలుసుకోను ? ఎక్కడ కలుసుకోను? గుళ్ళో (మాత్రమే) లేవని నాకు తెలుసు, నాలోపల లోలోపల అంతర్మస్తిష్కమనే ఈ సబ్ కాన్షస్ మైండ్లో ఎక్కడో ఉన్నావని నాకైతే తెలియట్లేదు. నీ అపురూప మేధా సామర్ధ్యం అన్నిటా కనిపిస్తోంది. కనిపించేదుకు మూలమైన నా కంటిలో రెటినా లోపల అద్దంలో మారుతున్న ఫొకల్ లెంగ్త్ నించి, ఇంత మహా గోళాలని ఆకాశంలో ఏ ఆధారం లేకుండా కేవలం గురుత్వాకర్షణ శక్తితో వేలాడదీసిన నీకు నేను పెద్దగా చెప్పేందుకేమీ లేదు. నీ సృష్టిలో చిత్రాలు చూసిన మా ఆశ్చర్యం పూర్తయేందుకు, ఇంకా తెలుసుకుందుకు మానవుల అయుష్షు వెయ్యి సంవత్సరాలు చెయ్యమని కోరుకుంటున్నాను.
అన్నిటిలోనూ ఇంకో చిత్రం మేము గర్భస్థ శిశువులు నాభినించి తల్లితో అనుసంధానమై ఉన్నట్టు సృష్టి జగన్మాతతో లీనమై, నిద్ర ఒక ధ్యానమై, స్వప్న, భౌతిక లోకాల మధ్య సంచరిస్తూ మమ్మల్ని మేమన్వేషించుకుంటూ నిన్నన్వేషించటం. రెండూ కష్టమే! బుద్ధిజంలో స్వయంభూనాధ్ దేవాలయాల పైన ఋతంభరగా, 'సర్వ వ్యాపక దృష్టి ' చిహ్నంగా నీ కళ్ళని చిత్రిస్తున్నారు. మమ్మల్ని నిరంతరం చూస్తున్నావనీ భావిస్తున్నారు.

నీకర్ధమవుతోందా, మా చిత్రమైన స్థితి? పిలుపులేకుండా పెళ్ళికెళ్ళినట్టు - నాకెవ్వరు తెలియదిక్కడ. వచ్చాం కనుక అంతా తెలుసుకునే ప్రయత్నిస్తూ, నిజంగానే కొందరు స్నేహితులని చేసుకుని, ఆహ్వానితుల్లా వసిస్తూ, పెళ్ళి అవగానే వెళ్ళి పోతాం. మాకెవ్వరూ తెలియదు, మేమెవ్వరికి తెలియం కొంత కాలానికి. జాగ్రత్తగా చూడు దేవుడా నీ సృష్టిని నీతో సహా అంతా అఙాతమే! అయినా అద్భుతమే! మాకు తెలియదు ఎందుకు, ఎలా కొన్ని మిలియన్ మాలిక్యూల్స్ మమ్మల్ని తయారు చేశాయో..ఆ సమ్యుక్త జీవ మహా కణం చలన విధానమనే ఈ జీవి-తం ఇలా ఎందుకుందో! అవ్యక్తం, అతీతం ప్రతి దానికీ జవాబులు. అతీతమే జీవితం ఈక్వేషన్. అవ్యక్తాన్ని సాధించాలంటే శక్తి కావాలి. శక్తి పొందడానికి జ్ఙానం కావాలి. అందుకూ ఒక మంత్రం కావాలి. అసలు చిన్న మాట - ఎంత నేర్చుకుంటున్నా ఇంకా ఎంతో ఉండేలా ఎలా సృష్టించావు నీ సృష్టిని?

మాష్టారిని అడిగాను అసలు ఋతంభర అంటే ఏమిటి అని. ప్రతి పదానికి మనకి అర్ధమయ్యే అర్ధం వెనకాల అర్ధం వెనకాల ఒక మూల తత్వం ఉంటుంది. (దీని గురించి నిజంగా జరిగిన ఓ కధ చెప్పాలి) అది చిత్రంగా ఉంటుంది. ఆ తలంలో జవాబు చెప్పారు ఆయన. ఋతంభర అనేది ఇంగ్లీషులో 'రిధం ' అంటాం కదా దానికి సంబంధించినది అని. రిథం అనేది కంపనాన్ని (వైబ్రేషన్) సూచిస్తుంది. అది తరంగాలని సృష్టిస్తుంది. అవి ప్రయాణించి మన చెవిని చేరితే అవి మన వినికిడి పరిధిలో పడితే, మన చెవులు విని, మెదడు అర్ధం చేసుకుని చెపుతోంది ఇదీ సంగతి అని. ఇవి విద్యుదయ్స్కాంత తరంగాలైతే కాంతి అంటున్నాం. చూస్తున్నాం. అంటే మన చూసినా విన్నా అన్నీ తరంగాలే. అన్నీ రిథం జనితాలే! మనసుతో ఆలోచించి, మెదడుతో దానికి రూపాన్ని, భాషని ఇచ్చి ఇంకోళ్ళ మెదడుకి శబ్ద తరంగాలుగా పంపుతున్నాం. ఈ పనంతా మెదడు నించి మెదడుకి 'లాజికల్ ' గా జరుగుతుంటే అది ఆలోచనల మార్పిడి. చిత్రమేమంటే ఋతంభర మనసు మాట్లాడే ప్రక్రియ. మనసుతో వినాలి. మనసు ఇంద్రియంగా ఆలోచనలని 'ప్రోసెస్ ' చెయ్యాలి. బుద్ధి వేరు, మనసు వేరు (అందుకే హస్త సాముద్రిక శాస్త్రంలో లైన్ ఆఫ్ మైండ్ వేరు, లైన్ ఆఫ్ హార్ట్ వేరు - ఋతంభర వినాలంటే హార్ట్ పూర్ణత్వం చెంది ఉండాలి, మీకు తెలుసు నేను చెప్పేది భౌతికమైన హృదయం కాదు అని). మనసుకి చేరే ఈ ప్రకంపనాలు, మన మూల తత్వమైన సృష్టి కర్తతో అనుసంధానంలో ఉంటాయి. ఇవి హృదయ స్థానమైన అనాహత చక్రానికి చెందినవి గా చెప్పవచ్చు (అందుకే తల్లి శిశువుతో తన హృత్ స్పందన వినిపించే ఎడంవైపు ఉంచి పడుకుబెడుతుందా?). మనసు పూర్ణత్వాన్ని చెందే కొద్ది సాధకుడి ఋతంభర ఉన్నత స్థితిని చేరి శబ్దం అక్షరాలుగా మారే విశుద్దిని దాటి మహా జ్ఞాన త్రిపురము, 'మహా కాళేశ్వర ' స్థానము, అతీంద్రియ శక్తికి ఉన్నత సోపానము ఐన ఆజ్ఞా చక్రాన్ని చేరి అక్కడినించి సంకేతాలు పంపడం, తెలుసుకోవడం చేయగలుగుతాడు. కనుబొమ్మల మధ్య ఉన్న అజ్ఞా చక్రంలో నామము, విబూది, కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా ఆ శక్తిని ప్రేరేపిస్తున్నామన్న మాట.
అహాన్ని జయిస్తే కాని ఇలాంటి అనుభూతులూ రావు. ఓ సారి రాధా దేవి కృష్ణుడి వేణువుని అడిగిందిట - "వేణువా కృష్ణుడికి నువ్వంటే ఎందుకంత ఇష్టం? " అని. "ఏముందమ్మా నేను అంతా ఖాళీ - ఆయన ఏమి ఊదితే అదే ..." అందిట. అసలు కృష్ణ తత్వంలోనే అనేక రహస్యాలు ఇమిడివున్నాయిట. కృష్ణుడి వేణువు ఋతంభర అతీత నాదానికి ప్రతీక అంటారు. ఆయన శిరస్సున నెమలికన్ను పూర్తిగా తెరుచుకున్న మూడో కన్నుకి సూచన అంటారు యోగులు. పరమానంద నాదబ్రహ్మని అనుభూతి చెందే వేణువు మనం కావాలంటే నిర్మలమైన మనస్సు కావాలిట, ఏ మంత్రం ఫలించాలన్నా, ఋతంభర వినిపించాలన్నా. అవును మనసు సిం హాసనంలో మనం కూర్చుని ఉంటే ఆ కృష్ణుడెక్కడ కూచుంటాడు, ఆ పరమాత్మ దివ్యత్వం ఎక్కడ స్థిరమౌతుంది? అదే రమణ మహర్షీ చెప్పారు. నువ్వెవరు నువ్వు తెలిసుకో నున్ను నువ్వే అడిగి అని. అందులోనే తెలియచ్చు నువ్వు నువ్వనుకుంటున్న చిన్న కాదని, ఈ లోకమంతా నీదని. ఆ జీవనకల్పనా కాంతి సంద్రంలో అలల్లా వచ్చే ఈ చిన్ని సంఘటనలకు నువ్వు చలించాల్సిన పని లేదని, ఇంతకన్నా పెద్ద పని ప్రతివారికి ఉందని, అదేంటో నిన్ను నువ్వే తెల్సుకో అని.

శ్రీ గురుభ్యో నమః

ఈ రోజు వన భోజనాలన్నారు కదా జ్యోతి గారు నాకు అసలే వంటలు పెద్ద గా ఇష్టం వుండదు.. తినటం కాదు వండటం ఇష్టం వుండదు..... మా ఇంట్లో మా నాన్న గారు చాలా భోజన ప్రియులు, పెళ్ళి ఐన కొత్తలో మా అమ్మ పప్పు చారు పెడితే నచ్చక పోతే తిన్న చోటు నుంచే ఎంగిలి గిన్నెలు పెట్టే చప్టా వైపు ఒకే ఒక్క తోపు తోసే వారంట మారు మాట లేకుండా.అలా ఆ దూర్వస మహా ముని గారి ని సంతుష్ట పరుచు ప్రక్రియ లో మా అమ్మ వంటల సిద్ద హస్తురాలైపోయింది.. కాని నా కెప్పుడూ అంత వంట చేసే పని రాలేదు, మా అక్క వంట చేసేది పై పని నాతో చేయించేది మా అమ్మ కు ఎప్పుడైనా వొంట్లో బాగోక పోతే... మొత్తానికి పెళ్ళి అవ్వక ముందు మహా ఐతే మొత్తానికి ఒక 10 సార్లు వంట చేసి వుంటా.. అదే మా ఇంట్లో ఇప్పటికి చెప్పి నవ్వుకుంటారు అందరు. అలా బలవంతం గా వంట ఇంటిలోకి తొయ్య బడిన ఒకానొక రోజు ఎదురు గా క్యాబేజీ వుంది వండాలి, ఓస్ ఇది తేలికే కదా అని... ఎంచక్క గా కుక్కర్ తీసి ఒక గిన్నెలో అన్నం ఇంకో గిన్నెలో పప్పు, ఇంకో గిన్నెలో, క్యాబేజ్ పెట్టి కుక్కర్ పెట్టేను, కుక్కర్ వచ్చింది, పక్కన చారు కోసం పెట్టిన గిన్నె లో ఎంచక్క గ ముక్కలన్ని వుడుకు కూడా పట్టేయి అసలు ఓ పేద్ద వంట గత్తె లెక్కన ఫీల్ ఐపోతా కుక్కర్ తీసి గిన్నెలు అన్ని ఒక్కొక్కటి విడి గా పెట్టేను ఇంక చూదు పెద్ద అనుమానం ఇప్పుడు ఈ క్యాబేజ్ ను ఎలా కొయ్యాలి ముట్టుకోవాలంటేనే కుదరటం లేదు అని.. అర్ధం అయ్యే వుంటూంది మీ అందరికి నా నిర్వాకం, క్యాబేజ్ ను తరగ కుండా ఆ వుండ పళాన అలా కుక్కర్ లో పెట్టేను అది వుడికి బయటకు వచ్చింది.. దాన్ని ఎలా కట్ చెయ్యాలో తెలియదు, లేపి మా అమ్మ ను అడిగితే కొంచమన్న పాపం అని లేకుండా అందరికి చెప్పేసింది నాకు క్యాబేజ్ కట్ చేసి వుడక పెడతారని కూడా తెలియదు అని. ఇంక పెళ్ళి అయ్యాక నా వంట ల గోల గురించి ఒక పోస్ట్ రాయాలే కాని రెండు మూడు మాటల లో చెపితే అయ్యేది కాదు..


సరే విషయానికొస్తే ఇంత స్టోరీ చెప్పేక ఇంక నా దగ్గర నుంచి ఎవ్వరు పెద్ద వంటలేమి ఆశించరు కాబట్టి టొమాటో పచ్చడి తో ముగిస్తాను.
నాలు గు దోర టొమేటో లు తీసుకుని ఎంచక్క గా ఒక్కోదానిని నాలుగు ముక్కలు కోసి, ఆ ఏమిటి అంటారు కడ గాలా వద్దా అంటా రా మీ ఇష్టం...గిన్నె లో ఒక చెంచా నూనె వేసుకుని దానిలో నాలుగు పచ్చి మిరపకాయలు మూడు ఎండు మిరపకాయలు (అదేమి లెక్క అని అడ గకండి నాకు తెలియదు నాకు ఆ క్షణానికి ఎన్ని తోస్తే అన్ని వేస్తా)వేయించి పక్కన పెట్టుకుని రెండు స్పూన్ లు మినప పప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా ఆ గిన్నె లో నూనె వుంటె సరి లేక పోతే ఇంకో స్పూన్ నూనె వేసుకుని టొమేటో ముక్కలు వేసి మూత పెట్టాలి, టొమేటో లు కొంచ మగ్గేక ఆ ముక్కలు ఈ వేయించిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరప కాయలు, కొంచం చింత పండు (కొంచం అంటె కొంచెం), వేయించిన మినప పప్పు, ఒక రెండు వెల్లుల్లి గబ్బాలు, ఒక స్పూన్ జీల కర్ర, కొంచం వుప్పు వేసి మిక్సీ లో యాపీ గా నాలుగు తిప్పులు తిప్పండి. మీకు ఇంకా ఈ టొమాటో పచ్చడి గురించి ఆసక్తి వుంటె తాలింపు వేసుకోండి కూసంత నూనె, జరంత ఆవాలు జీలకర్ర, జరంత ఇంగువ వేసి..

తినే వాళ్ళ అదృష్టం బాగుంటె టొమేటో పచ్చడి ఇలా వస్తుంది లేక పోతే ఇక అది మీ వూహ కు వదిలేస్తున్నా
సర్వే జనా సుఖినో భవంతు నా వంట తిన్నాక..


మా అన్నయ్య నా వంట మీద పాడే పాట మీ అందరి కోసం..


వంటంటే తలుసా నీకు తెలియదే వంట చేయకు ......... (టాయ్ టాయ్ టాయ్ విషాదమైన మ్యూజిక్)

వంట చేసానని.... బాగుందని...... పిచ్చి గా కేకలు వెయకు వంట ను శిక్ష గా మార్చకు..

వంటంటే తెలుసా నీకు..

ఏది తినవే చూద్దము తినలేవు కదు

అంతేనె తినమంటె తినలేరు కక్క కుండా వుండ లేరు

అంతేనే నీ వంట ఆంతే ...

అసలు పాట: రావణుడే రాముడైతే... (నాగేశ్వర రావు స్తైల్ లో)

ప్రేమంటె తెలుసా నీకు తెలియందే ప్రేమించకు

మన్సిచ్చానని బదులే లేదని

పిచ్చి గా నిందలు వేయకు ప్రేమ ను చిచ్చు గా మార్చకు..

ఏది నవ్వరా చూదాము నవ్వలేవు కదు

నువ్వు రమ్మంటే రాదు రా నవ్వు

ఇవ్వమంటె ఇవ్వలేరు ఇచ్చామంటే తీసుకోరు అంతే రా జీవితం అంతే..

హ హ హ తిక్క కుదిరింది మా అన్న కు, మా వదిన కూడా నా టైపే వంట లో.. అది కొస మెరుపు..