Subscribe RSSకొత్తపాళి గారన్నట్లు కాసేపు మనం వున్న దేశం, మన చుట్టూతా జరిగే జీవితాలు,మార్పులను... మన నిత్య జీవితాలలోని ఒడి దుడుకులని.... ఎదుర్కుంటున్న సమస్యలు వెతుక్కుంటున్న పరిష్కారాలు వీటి గురించి రాయాలనిపించింది నాకు కూడా.

సరే పాలిటిక్స్ గురించి మాట్లాడదామంటే అంత మనసనిపించలేదు, ఏమి వుంది రెండు, రెండంటే రెండే పార్టీ లు మనకు మల్లే తిట్టుకోరు చెప్పులు విసురుకోరు బంద్ లు చెయ్యరు. అంత మజా రాదు. జాతి వివక్షత, లంచగొండి తనం, లాబీయింగ్ (అదే పార్టీ ఫండ్ లు గట్రా) వుంటాయి కాని ఏమి వుంది లే తరువాత రాయొచ్చు అని పక్కన పెట్టేను.

ఆర్ధిక విధానం, రాజకీయం గా వ్యక్తి గతం గా అది ఇక్కడ జీవితాలను ప్రభావితం చెసే విధానం హ్మ్మ్.. అదీ రాయొచ్చు, కాని అంత వివరం గా రాసే అనుభవం లేదు పైగా గ్లోబలైజేషన్ అయ్యాక ఆర్ధిక పరిస్తితి అనేది దాదాపు గా తెరిచిన పుస్తకమయ్యింది. ఏది అవలేదు అనుకోండి.

ఎంత గ్లోబలైజేషన్ ఐనా ఇంకా చెప్పుకోవటానికి పంచుకోవటానికి చర్చ పెంచుకోవటానికి తేలిక గా నా వంటి నాన్ రచయత్రులు (పదం బాగుంది కదు) రాయ తగినది ఏమి వుంది.. ఆ అదే అదే వస్తున్నా దాని దగ్గరకే.

రోజు వారి జీవితం గురించి. అదే నేను పైన ప్రస్తావించినది. ఎంత సేపైనా చెప్పుకోవొచ్చుజీవితం అందులోని మార్పు లు చేర్పులు కూర్పులు (రెండూ ఒకటే అనుకుంటా కదా ఏదో ప్రాస బాగుందని వాడేను లెండి) అమెరికా లో నైనా, భారత దేశం లో ఐనా. అదే కదా మన కబుర్ల ఇంధనం.

దీని గురించి ఒక వరుస క్రమం లో రాయలేను కాని తోచిన విషయాలు రాయాలని నిర్ణయించుకున్నా. మా వర్క్ లో ఆడవాళ్ళు, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కలిసి ఒక గ్రూప్ వుంది మాకు. మంచి చెడు, సుఃఖం కష్టం కలబోసుకుంటాము అప్పుడప్పుడు. యాధృచ్చికం గా అంతకు ముందే ఆ గ్రూప్ లో అమెరికా రావటం లో మన జీవితాలలో, మనం విషయాలను చూసే తీరు లో, జీవిత దృక్పధం లో వచ్చిన మార్పులు అనే దాని గురించి అందరి అభి ప్రాయాలు పంచుకోవాలనుకున్నాము. ఆ పైన ఈ దేశం లో కి రావటం వలన మా కుటూంబాలలో మా జీవితాలలో వచ్చిన స్ట్రెస్ (వొత్తిడి), దానిని మేము ఎలా డీల్ చేసేము అనే దాని గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాము. మా గ్రూప్ లో చాలా మంది నా బ్లాగ్ చదువుతూ వుంటారు. వాళ్ళ అభిప్రాయాలను బ్లాగ్ లో పెడతాను అన్నప్పుడు అందరు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ లో రాసినవి నేను తెలుగు లో తర్జుమా చేసి పెడదామని కూడా నిర్ణయించుకున్నాము. ఈ గ్రూప్ లో కొత్త గా పెళ్ళి అయ్యి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడకు వచ్చి 14 ఏళ్ళయిన నా వరకు వున్నారు. కొందరు తేలిక గా క్లుప్తం గా వాళ్ళ మనసును వ్యక్తీకరిస్తే, కొందరు వాళ్ళ జీవితం లో సహచరుడు పంచిన ప్రేమ, బిడ్డలు తో తెచ్చుకున్న జ్ఞానం గురించి చెపితే, మరి కొందరు వాళ్ళు జీవితం లో సాధించిన విజయాలు పంచుకుంటే, ఇంకొందరు కెరీర్, జీవితం మధ్యన సమన్వయం చేసుకున్న విధానాన్ని చెప్పేరు. రేపటి నుంచి ఒక్కొక్కరి అనుభవాలను ఈ పశ్చిమ దేశాల గడపల అలంకరించిన తోరణాల మాలికలను మీ ముందు వుంచుతా.

చెప్పే ముందు మీ అందరికి అమెరికా దాని వైశాల్యాల, వైవిధ్యాల గురించి చెప్పి విసుగు తెప్పించను కాని మేము వుంటున్న వూరు దాని స్తితి గతులు కొంచం సేపు... సరేనా..

మేము దేశం లో ఒక మూల కు బోస్టన్ పక్క గా వుంటాము. రాష్ట్రమంటే మరీ మన ఆంధ్రా లా పెద్దది వూహించుకోకండీ. ఇది ఒక బుల్లి రాష్ట్రం, అందులో కూసినన్ని నగరాలు, ఎక్కువే పట్టణాలు ( నాకు ఈ విషయం ఎప్పుడూ కన్ఫ్యూజనే 14 ఏళ్ళు ఐనా వచ్చి. మాంచెస్టర్ సిటీ అంటారు మళ్ళీ టౌన్ హాల్, టౌన్ లో అంటారు మళ్ళీ ఈ వూరులన్ని బాగా పెద్ద వూరు పక్కన వుంటాయి కాబట్టి ఇవి అన్ని సబ్ అర్బ్స్ అదే పల్లెటూళ్ళు అంటారు, ఇందులో ఏది నిజమో నాకైతే తెలియదు)

మన ఆంధ్రా లో ఒక మాదిరి పట్టణం అనుకోండి. సరే మన బ్లాగ్ లోకం లో బాగా వూరు గురించి (డబ్బా అని నాలాంటి గిట్టని వాళ్ళు అన్నప్పటికి అది అభిమానమనే అనుకోవాలి లే) అభిమానం వున్న బ్యాచ్ ఎవరు? అదుగో మీకు గుర్తు వస్తోంది....... అదే అండీ నరసరావు పేట. అబ్బో సుజాత గీతాచార్య ఇంకా ఆబ్యాచ్ చూపుల చురుకు కంప్యూటర్ లు దాటి తగులుతోందే.. ఆ నరసరావు పేట మాదిరి వూరనుకోండి ఇది కూడా. అన్ని వుంటాయి కాని ఏమి పెద్ద లేనట్లే సిటీ లతో పోల్చుకుంటే.. మన వూర్లు చాలా నయం కాని ఇక్కడ అమెరికా లో ఇలాంటి వూర్లు పెద్ద వూర్లే, వుద్యోగాలు బోలెడన్ని వుంటాయి పెద్ద కంపెనీ లు కొన్ని ఇలాంటి చోట్ల మొదలెడతారు కామట్టి. కాని పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ వుండదు పెద్ద గా. ఏదో పెద్ద రోడ్ ల మీద బస్ లు అవి వెళుతూనే వుంటాయి కాని అర కొరా గా అంతే. కార్ లే ముఖ్యమైన ప్రయాణ సాధనం మిగతా అన్ని వుంటాయి.

నాకు బయటకు వెళ్ళాలని వుంది అనగానే చటుక్కున చెప్పులేసుకుని బయటకు వచ్చి ఏ రిక్షా నో ఆటో నో పట్టుకుని వెళి పోయేటట్లు వుండదు. ముందస్తు గా బయట వాతావరణం చూసుకోవాలి మాకు బాగానె చలి ఎక్కువ. అమెరికా లో నాలుగు కాలాలు అని బడాయి గా ప్రజలు చెప్పుకోవటం కద్దు కాని నిజానికి రెండే. చలి కాలం, చలి లేని కాలం. మొదటిది 9 నెలలుంటుంది, ఆ తొమ్మిది నెలలనే బడాయి గా స్ప్రింగ్, వింటర్, ఫాల్ అని అంటారు కాని మన వరకు అంతా చలి కాలమే. మిగతా మూడు నెలలు చలి లేని కాలం ఎండా కాలమా అంటే వూ ఇంచుమించు గా, రమా రమి గా, అటు ఇటు గా అంతే అని మొహమాట పడుతూ చెపుతాము.

సరే ఈ వాతావరణ వివరాలు వదిలేసి మా జీవితాల గోల కు వస్తే మా వూరు పేట లెక్క అని చెప్పేను కదా. అలాంటి వూరు లో ఒక చిరు వుద్యోగం చేస్తున్నా నేను నాతో పాటు గా చాలా మంది మనోళ్ళు. అవునండి మన వాళ్ళు ఎక్కువే ఇక్కడ. నేను వుండే టౌన్ లో ఐతే, నేను వుండే వీధి లో మొత్తం అందరం మన దేశమోళ్ళే, ఒక పాకిస్తాను అతను ఒక తెల్లోళ్ళూ అంతే. చాలా ప్రశాంతం గా సాయింత్రమైతే అంతు లేని చుక్కలను, తెల్లరితే మంచుపూల వుషోదయాలను ఎక్కడ చూసినా చెట్లు, పచ్చ పచ్చ గా, చల్ల చల్ల గా అందం గా వుంటుంది లెండి మా వూరు. అలాంటి చోట వుండే మా గోల వినటానికి ముందు గా మీ అందరిని మానసికం గా ఆయత్తం చేసినట్లు వున్నా కదు. ఇక ఈ సోది ఆపి రేపు, యెల్లుండి లలో మొదలు పెడతాను మా జీవన గీతాలాపన. అందాకా అందరికి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.

27 comments to “వలసొచ్చాక....”

 1. మన పై నాలుగు రాస్ట్రాలకి కలసి ఒకటే నగరం.. అది బొస్టన్.. మిగతావన్నీ పట్టణాలే.. మాంచెస్టర్ లొ ఇంటర్నేష్నల్ ఎయిర్ పొర్ట్ వుందని నగరం అనుకొవాలెమో ..లేకపొతె అదీ చిన్నదే.. భలెవారే ఫాల్ లొ మన నార్థ్ ఈస్ట్ అందాలు కొసం మిగతా సంవత్సరం అంతా ఎదురు చూడొచ్చు... మీకు కూసింత పైన లొవెల్ అని ఇంకొ చిన్న పట్టణం వుంటుంది..న్యూ హంప్షైర్ బొర్డర్ లొ .. అక్కడే మొన్నటివరకూ వున్నా.ఇప్పుడు అక్కడనుండి తంతే వెస్ట్ కొస్ట్లొ పడ్డా ..అయినా నాకు అక్కడే నచ్చింది.. ఇంకా బొస్టన్ సెల్టిక్స్ నే ఇస్టపడతా.. ఇక్కడ డ్రాకట్ లొ సాయిబాబా గుడివుంది ..అక్కడకి ఎప్పుడయినా వచ్చారా ?

 1. అవును లెండి. ఫాల్ కలర్స్ బాగుంటాయి కాని చలి భరించలేనిది కదా లోవెల్ క్రాస్ పాయింట్ బిల్డింగ్ లో చేసేవారా? నేను లోవెల్ కింద ఏండోవర్ లో వుంటా. డ్రేకట్ సాయిబాబా గుడికి రాక పోవటం ఏమిటండి. ఆ సాధు వాస్వాని సెంటర్ లో మా సత్సంగ్ జరిగేది ఒకటనేమిటీ ఆ సాధు వాస్వని లో నే వారాంతాలంతా. బుధవారం అక్కడ విజయ్ గారని యోగా మాస్టారు యోగ చెపుతారు.

 1. బావన గారు మీజీవన గీతాలాపనకొసం ఎదురుచూస్తా.

 1. క్రాస్ పాయింట్ కాదు.. మీరు చెప్పినట్టు లొవెల్ సాఫ్ట్ వేర్ జనాల్లొ చాలామంది అక్కడే పనిచేస్తారు.. నేను సాఫ్ట్వెర్ కాదు.. మా ఆఫీసు లొ north billerica వుండేది.. .. నేను వున్నది north chelmsford లొ. ప్రతీ గురువారం, శనివారం హారతి టైములొ సాయిబాబ గుడికి వచ్చేవాడిని..
  వెస్ట్ కొస్ట్ కన్న అక్కడే బావుందండి.. మాళ్ళా కొన్నాళ్ళకి అక్కిడికే వచ్చెస్తా.. ;-))

 1. భావనా, సెలవులకు మీ వూరు రావాలని ఉంది. ఇలా చిన్న చిన్న టౌన్లు నివసించడానికి హాయిగా ఉంటాయి. ఖర్చు పాయింటాఫ్ వ్యూలో కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి.

  మేము డల్లాస్ నుంచి ఒక్లహోమా లోని టల్సా సిటీకి మూవ్ అయిన తర్వాత అపార్ట్ మెంట్ అద్దె లోనే ఆరొందల డాలర్లు మిగిలేవి. ఒక ఆరేడువందల మంది ఇండియన్స్ ఉండేవాళ్ళు.

  చక్కని అందమైన చిన్న టౌను. యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహోమా చదువుకునే భారతీయ విద్యార్థులు ఎక్కువ.

  మీ వూరిగురించి చదువుతుంటే ఆ వూరు గుర్తొచ్చింది.

  అయితే ఏదైనా వూరు గురించి రాయాలంటే పేట్రియాట్స్ బ్లాగు గుర్తు రావలసిందే అన్నమాట. ఈ మాట పెద్ద అవార్డ్ లాగా, రివార్డ్ లాగానో ఉంది.

 1. "టల్సా అంటే పారిస్ ఆఫ్ ఒక్లాహామా " ఈ డైలాగు ఎప్పుడయినా విన్నారా సుజాత గారు ??

 1. ఏవిటోనమ్మా, ఎక్కడా..మధ్యలో కొంచెం కూడా దూరే అవకాశమే నాకు దొరకట్లేదు. ఏవిటో, నేను పూర్తిగా, ఫారనర్ అయిపోయాను.

 1. గుడ్ స్టార్ట్ భావనా! బాగుంది.మేపిల్ సిరప్ చాకొలేట్లూ, క్రాంబెర్రీ తోటలూ, గుబుర్లు గుబుర్లు గా పూసే అజేలియాలూ,చక్కటి ఫాల్ కలర్సూ, మీరున్న ప్రాంతం బాగుంటుంది.

 1. మీరు చెప్పబోయే జీవితానుభవాల కోసం ఎదురుచూస్తాను :)

 1. రాధిక: మొదటి సారి మిమ్ములను నా బ్లాగ్ లలో చూడటం, స్వాగతమండి, నా కృష్ణ గీతం రప్పించక పోయినా ఈ జీవన గీతాలాపన కోసమైనా వచ్చారు. తప్పకుండా అండి ఇది మన అందరి జీవన గీతాలాపన కాదా :-)

  మంచు పల్లకి గారు: అవునా ఐతె చాలా దగ్గర గా వుండే వారన్న మాట. నాకు ఇష్టమే ఈ వూరు, కాని ఈ నెల, వచ్చే నెల చాలా చలి వైరాగ్యం తో కాస్త విసుక్కోవటం అంతే. :-) కాని వెళితే మళ్ళీ తిరిగి వచ్చేంత అభిమానం అంటే ఆలోచించాలి.

 1. వచ్చెయ్యి సుజాత. ప్లీజ్ ప్లీజ్ మా వూరు బాగుంటుంది ఒక్క వింటర్ మూడు నెలలు తప్ప. అవును చిన్న వూళ్ళలో డబ్బులు బలే సేవ్ అవుతాయి కాని చలి ఒక్కటే నాకు బాధ. ఒక్లహోమా బాగుంటుంది అట కదా మంచుపల్లకి గారు అన్నట్లు పేరు కూడా వుంది కదా. అక్కడే కద అప్పుడు ఎవరో తింగిరోడూ బాంబులు పెట్టింది :-(

 1. జయా: లేదు ఫారినర్ ఏమి అవ్వవు. ఇంత దూరం వున్నా మన ఇళ్ళు వొళ్ళు పప్పు, కూర వాసన రావల్సిందే, మన మనసులు ఇంగువ రసం గుభాళింపు రావలసిందే అది కామన్ కదా ఎలా ఫారినర్ అవుతావోయ్.. వచ్చే పోస్ట్ చూడు వోస్ ఇంతేనా అంటావు.

 1. సునీత నీకేమి అపకారం చేసేను అలా నీ బ్లాగ్ లో చిన్నప్పటి అత్త వాళ్ళ వూరు, ఇప్పుడేమో స్ప్రింగ్ అజీలియాలు గుర్తు చేసి ఏడిపిస్తావు నీకిది తగునా... క్రాన్బెర్రీ తోటలు చాలా చాలా దుఖం వచ్చేస్తోంది ఇంకా రెండు నెలల చలి తలచుకుని. హు హు హు (ఏడూస్తున్నాను)

 1. మధురవాణి: తప్పకుండా మరీ బబుల్ గమ్ నోములు నోయలేదు లే అమ్మాయి.. ;-)

 1. ఏంటో వలసైతే పోలో మని వచ్చేసాం కానీ పొలిమేర దాటి మీ ఊరు చూద్దామంటే మరో ఉగాది దాటే టట్టుంది. మీ కబుర్లు కథలు కథలగా చెప్పండి మేము నోరు మూసుకోని నోట్లో వేలేసుకొని అలా చదువుతూ వుంటాము. బాగుంది భావనా..తరువాత పోస్టు ఎప్పుడు మరి?

 1. టల్సా కి ఆ పేరు నిజం కాదండి బాబు.. ఆ వూరు వాళ్ళని ఏడిపించడానికి అది వాడతారు. ఫ్రెండ్స్ సీరియల్ లొ చాండ్లర్ కి ఆవూరు ట్రాన్స్ఫెర్ అవుతుంది.. అతని వైఫ్ మొనికా న్యూయార్క్ వదలి రానంటే అతను ఈ డైలాగు చెబుతాడు.. అప్పట్నుండి జనాలకి ఆ డైలాగు అలవాటు అయిపొయింది .. ఆ సీరియల్ లొ ఆ వూరుని భలే ఆడుకుంటారు లెండి.. నేను కూడా అప్పుడప్పుడు .. మా తమ్ముడు ఆ ఊర్లొనె ఎం ఎస్ చేసాడు..
  నేను 2005 లొ ఆ వూళ్ళొ ఒక వారం వున్నలేండి.. అందుకు నాకు కొంత తెలుసు.. వాళ్ళకి మంచు అంత వుండదు గానీ టొర్నొడొలు మాత్రం జాస్తి..
  నేను చెబుతున్నా కదా,, అమెరికాలొ మన నార్త్ ఈస్టె బెస్టు..

 1. భా.రా.రే: అదే కదా ఎక్కడి వాళ్ళు వచ్చి ఫాల్ కలర్స్, స్కేటీంగ్ ల కోసం వైట్ మౌంటైన్స్ వైపుకు వస్తారు కాని పక్కనే వుండే వాళ్ళకు లెక్క వుండదు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు కదా. :-| మీ రాష్ట్రానికి గార్డెన్ స్టేట్ అన్న పేరు నాకు నవ్వు గా వుంటుంది.

 1. హ హ మంచుపల్లకి గారు దెబ్బేసేరు కదా సుజాత మీద. అవునా నేను ’ఫ్రెండ్స’ చూస్తాను కాని ఈ మధ్యనే అప్పుడప్పుడు టైమ్ దొరికినప్పుడూ. నాకు బాగా నచ్చుతుంది ఆ సీరియల్. బాగా కొంటె నవ్వులు నవ్వొచ్చు, కాని మా అబ్బాయి చిన్నప్పుడు అలాంటివి బేన్ కదా ఇంట్లో ;-) ఇప్పుడు పెద్దవాడు కాబట్టి మాకు ఫ్రీడమ్. మొత్తానికి మీకు బాగా నచ్చింది ఈ వూరు. పేట్రియాట్ వూరు తో బాగానే పోల్చాను ఐతే.

 1. " కాని నిజానికి రెండే. చలి కాలం, చలి లేని కాలం."
  బాగా చెప్పారు ఈస్ట్ కోస్ట్ లో అంతేలెండి :) మీ ముందు మాట చదివేశాము, ఇక (మీ కథల)పుస్తకం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు మేము .

  @ మంచుపల్లకీ: ఏంటీ మీకు ఈస్ట్ కోస్ట్ ఏ బావుందా. భలేటోరే మీరు. నేను ఒక్క వారం ఉండలేకపోయా కిందటి జనవరి లో. (ఎక్కువ టైం అయితే చచ్చినట్టు అలవాటు పడేవాడినేమో :))

  ఫ్రెండ్స్ లో ఆ ఎపిసోడ్ మొన్నే మళ్ళీ చూశా ముప్పై మూడో సారేమో! నాకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్ ఐతే, తప్పక చూసేది ఫ్రెండ్స్. నాకు ఫీబీ, చాండ్లర్ బాగా ఇష్టం అందులో.

 1. మానస్ సంచర గారు: ఏదో అభిమానం కొద్ది వెక్కిరిస్తాము అండీ కాని బాగుంటుంది మా వూరు, అవును మొదటి సారి చలి కాలం లో ఇక్కడ కు వస్తే సరిగమలు పాడిస్తూ పరుగు తీయించేస్తుంది చలి, చాలా రాంగ్ టైం లో వచ్చారు ఐతే. కిందటి సవత్సరం ఇంకా చలి వుంది. రాంగ్ సవత్సరం లో కూడా వచ్చారు. మా తప్పు కాదు మరి. :-)

 1. "కాని నిజానికి రెండే. చలి కాలం, చలి లేని కాలం" :) సమ్మర్ వస్తుంది వస్తుంది వస్తుంది అని ఎదురుచూసినంత కాలం కూడా వుండదండి.ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది.ఈ మధ్యనే ఇక తప్పదని వింటర్ ని కూడా ఆనందించడం నేర్చుకుంటున్నాం :)
  నేను పై రాధికని కాదండి.వేరే రాధికని .

 1. మానససంచర గారు: సమ్మర్ లొ మీ (ప్రస్తుతం మన) ఊరు లాగే .. చలికాలం బొస్టన్ కూడా కొద్ది కస్టమే ..
  అయినా చలికాలం 4 నెలలు బయట తిరగటానికి కాదండి.. హాయ్ గా ఇంట్లొ వెచ్చగా కూర్చుని ఎంజాయ్ చెయ్యడానికి :-) అందుకే టి వి సీరియల్స్ సీజన్స్ అన్ని అప్పుడు స్టార్టవుతాయి.. :-)) ఒకసారి అక్టోబర్ లొ వెళ్ళండి.. నెక్స్ట్ యియర్ నాతొపాటు మీరు ఈస్ట్ కొస్ట్ వచ్చెస్తానంటారు.. :-))
  నాకయితే వింటర్ ఇలా వచ్చి అలా వెల్లిపొయిందే అనిపిస్తుంది.. :-))

 1. రాధిక: స్వాగతం నా బ్లాగు లోకి. నేనెప్పుడు అనుకుంటా రాధిక నా బ్లాగ్ లో కామెంటదేమా నాకేమో కవితలు రావు ఎలాగబ్బా అని. స్వాగతమండోయ్... సేమ్ హియర్ సేమ్ హియర్. అవును అలా సమ్మర్ ల మీద ఆశ నిరాశలయ్యాక నేను వింటర్ ను ఎంజాయ్ చెయ్యటం నేర్చుకున్నా. తప్పదు కదా.. :-)

 1. మంచుపల్లకి గారు: మీరు హార్డ్ కోర్ ఫేన్ కదా ఈస్ట్ కోస్ట్ కు. ;-)

 1. good start.
  I hope other American Telugu bloggers will follow suit.

 1. @ బావన
  ఒక పని చేయండి. అమెరికన్ బ్లాగర్లనందరినీ మీ పల్లెకు పిలవండి (నన్ను మరచిపోకండి మరి) . ఈ టపా బుక్‌మార్క్ ఎప్పుడో చేసుకొని తీరికగా ఇప్పుడు కామెంటేస్తున్నా!

 1. భావన గారు,
  సుజాత,నేను ready మీ ఊరు రావడానికి.