Subscribe RSS

స్వాంతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు

చిన్ని జోక్ లాంటి ఒక నిజం మా ఆడవాళ్ళ స్వాతంత్రం మీద మేమే .....మనకు స్వాతంత్రం వచ్చింది అంటగా ?????


మనకా ...!!!!!!!!
నిజమా అమ్మ.... మనకు కూడా వచ్చిందా!!!!!

లేదు రా అమ్మ, మనకు కాదు.... ఇదే మాట 62 ఏళ్ల నుంచి చెపుతున్నారు....నమ్మక..


వెన్నెలంటే నా కిష్టం. సముద్రపు హోరంటే నా కిష్టం. .. వెన్నెలలో తడిసి అలలపై మెరిసే నురగంటే నా కిష్టం. వీటన్నిటిని మొగలి పూల దొప్పలో కలిపి ఇచ్చే మా వూరంటే నాకింకా ఇష్టం...... మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలం గా అల్లుకున్న పొదరిల్లు మాది అన్నట్లు మాది అటు పల్లెటూరికి ఎక్కువ ఇటు పట్టణానికి తక్కువ గా వుండే ఒక మోస్తరు వూరు....

మావూరు అనగానే గుప్పెడు సన్నజాజులు గుండెలపై కుమ్మరించినట్లు ఎన్నో అనుభూతులు ఒక్క సారి మనసును చుట్టుముట్టేస్తాయి నాకు. .. కొన్ని గాఢం గా సాంబ్రాణి పొగలా చుట్టు ముట్టేస్తూ వుక్కిరి బిక్కిరి చేసి మధురమైన స్మృతులను తలపుకు తెస్తే, కొన్ని అప్పుడే విచ్చిన చంద్రకాంత పూలు గాలితో కలిపి తెచ్చే పరిమళాలు మనసుకు అందిస్తాయి. ఇక మరి కొన్ని ఎండిన నేలపై కురిసే తొలి చినుకుల విరిని లేపుతూ మరీ ఆనందాన్ని ఇస్తాయి.

భాష ఏదైనా భావమొక్కటే గుండెకు. అనుభూతుల సాంద్రత వేరైనా సారం మాత్రం ఒక్కటే నాకు మా వూరును తలుచుకుంటే...

మా వూరికి మాత్రమే పరిమితమైన విశ్లేషణలు చాలానే వున్నాయి. నా చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి పొట్టకూటి కోసం ఈ దేశానికి వలస వచ్చే వరకు నా జీవితం మొత్తం మా వూరిలోనే గడిచింది. పుట్టటం దగ్గర నుంచి, చదువు, పెళ్ళి, వుద్యోగం అన్నీ కూడాను.. మా వూరు సరస్వతి నిలయం. ఒక్క మెడిసన్ తప్ప మా వూరిలో లేని చదువు అంటూ ఏమి లేదు.. అబ్బో అదేమి గొప్ప అంటారు మీరందరు, ఇప్పుడు గొప్ప కాదేమో కాని మరి 1980 ల లోనే అన్ని కాలేజీల్లోని కోర్స్ లు మా వూరిలో వున్నాయంటే మరి అది మాకు గర్వ కారణమే కదా..

మా వూరి లో మిరప కాయ బజ్జీ తిన్న వారెవ్వరైనా ఒప్పుకోవలసిందే ఇంత మంచి బజ్జీ ఎక్కడా తినలేదు అని.... అంతే కాదు మా వూరు జగద్విఖ్యాతమైన లడ్డు కు కూడా పేరెన్నిక కన్నది, తిరుపతి కాదండోయ్...తిరుపతి లడ్డు తరువాత అంత గా ప్రఖ్యాతి చెందిన బందరు లడ్డు మరి మాదే కదా...
లడ్డు ఏమిటి లెండి, హల్వా, అది అనే కాదు అసలు మా వూరి పేరు మీదే అంటారు కదా బందర్ మిఠాయి అని.

మా వూరికి ఒక్క పేరే కాదండోయ్..... మచిలీపట్టణం అని కూడా అంటారు.. ఎప్పుడో పోర్చుగీసు వాళ్ల కాలం లో జాలరులకు ఒక పేద్ద చేప దొరికితే , ఆ చేప కన్ను తో ఫోర్ట్ తలుపే కట్టించారట అందుకే మచిలీ (చేప) పట్టణం అని పేరు వచ్చిందట. మత్య ప్రియులకు మా వూర్లో చాలా రకాల చేపలు,పీతలు గట్రా దొరుకుతాయి.

మా వూరికు పక్కనే సముద్రం, క్రిష్ణమ్మ సంగమపు అందాలు చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కాదు.... నదులన్నీ వచ్చి సముద్రం లో కలవటం ఎంత సహజమో చదువుల కోసం, కోర్టు పనుల కోసం, మంచి వైద్యం కోసం, మా వూరుకు రావటం అంత సహజం గా వుండేది ఒకప్పుడు.

ఇప్పుడంటే రెసిడెన్షియల్ కాలేజ్ కల్చర్ పెరిగి పోయింది కాని మా వూరి హిందు కాలేజ్, నేషనల్ కాలేజ్ ఎంత మంది గొప్ప విద్యా వేత్తలకు, కళాకారు లకు పుట్టినిల్లు గా వుండేవి అనుకుంటున్నారు. ఆ లిస్ట్ మొదలు పెడితే అబ్బో ఇప్పట్లో అయ్యేది కాదులెండి. అంత ఎందుకండి... మా వూరి గురించి మంచి దర్శకులుగా పేరు వున్న జంధ్యాల గారు ఒక సినిమానే తీసేరు అంటే ఇంక మాటలెందుకు లెండి... ఏమిటా సినిమా అనుకుంటున్నారా? ష్... గుప్... చిప్.... చూడండి మీకు అందరికీ మా వూరి గొప్ప తనం తెలియక పోతే నేను మీ అందరికి ఫ్రీ గా ఒక డీ.వీ.డి పంపుతాను మరి...

ఈ దేశం వచ్చేక కూడా మా వూరి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ ఒక్క సారి మా పాండు రంగడి ని, మా పున్నాగ పూల ను, మా మాలతీ లతలను, అంత కంటే ఎక్కువ మా సముద్రపు గాలిని తలిచి మురవక పోతే మా కంటే కూడా మా పక్కన వాళ్ళు ఆశ్చర్య పోతారు... కావాలంటే మా బోస్టన్ లో ఎవరిని ఐనా అడగండి. నిజం... మా వూరి మీద ఒట్టు...!!!!!!!

సుజన రంజని కోసం ఎప్పుడో రాసిన ఈ టపా ను ఎక్కడో పారేసుకున్నా, అడగ గానే వెతికి ఇచ్చిన కాంతి కిరణ్ గారికి ధన్య వాదాలతో..
స్నేహం..... ఈ ప్రపంచం లో రక్త సంబంధం తో వచ్చే సంబంధాలు కొన్ని ఐతే, మన మనసుతో సంపాదించుకునే సంబంధాలు కొన్ని. సంబంధమెలా వచ్చినా బంధమెప్పుడు అపురూపమే, అపురూపమైన బంధాలకే అపూర్వమైన అనుభందం ఈ స్నేహంతో... స్నేహమంటే ఎంతో మంది కవులు ఎన్నో పాటలు రాసేరు, కవితలల్లేరు, రచయతలు కధలు రాసేరు సినిమా లు తీసేరు.. స్నేహమంటే ఎంత మంది ఎన్ని విధాలు గా చెప్పినా ఇంకా చెప్పటానికి వీలయ్యేది...... చెప్పుకోవటానికి మిగిలుండేది...


చిన్నప్పుడు కలిసి బడిలోకి పరుగెత్తిన ఆకతాయి కాలపు స్నేహాలు, వురకలు వేసే వయసు లో జీవితాల నుంచి దూసుకెళ్ళే స్నేహాలు, ప్రపంచం లో ప్రతి విషయాన్ని మనదైన..... మన కంటి తో నిర్వచనాలు నిర్ణయించె వయసు లో జీవితమే తనదనిపించే స్నేహాలు, ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనే వుత్సహం లో గమ్యం వైపు పరుగు మొదలెట్టినప్పుడు తోడు పరుగెత్తిన స్నేహాలు, 


తనదైన జీవితం లో తనతో పాటు గా తోడు నిలిచి మది నిండే స్నేహాలు... ఎన్నని చెప్పినా ఎంతని చెప్పి నా ఇంకా అసంపుర్తి గా చెప్పటానికి మిగిలి... సంపూర్తి గా వున్నానంటు జీవితాంతం తోడుగా ఆకతాయి తనం నుంచి ఆఖరి మజిలి వరకు కలిసి వచ్చే స్నేహాలు....

స్నేహమా నీకిదే నా శత సహస్ర కోటి వదనాలు...జీవితమంటే స్నేహమే అనే దిశ లో నాతో కలిపి అడుగేసి, స్నేహమంటే నిర్వంచించిన నా ప్రాణ హితులకు, స్నేహమంటే అవసరాలకు వాడుకోవటమే అనే నిర్వచనాన్ని పాటించి గుండెలో అనంత దుఖ సాగరాలను నిలిపిన స్నేహితులకు , జీవితపు ప్రతి మజిలి లో వచ్చి చేరి జీవిత కష్ట, క్లిష్ట సమయాలలో తమ స్నేహ హస్తం తో గట్టెకించిన ప్రియ నేస్తాలకు, చెమరించిన కన్నులలో చేమ ను..... నవ్వైతే పెదవితో, బాధ ఐతే గుండె తో పంచుకున్న మిత్రులకు, పరిచయమైన అతికొద్ది కాలంలోనే ఒక స్నేహ కుటుంబమైన బ్లాగ్లోకపు నేస్తాలందరికి ప్రపంచ స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు.

చెలిమి అనే అపురూప పరిమళం సదా మన జీవితాలలో నిండి వుండాలని, ప్రతి రోజు స్నేహోత్సవమై అనుక్షణమొకసంబరమై స్నేహ బంధాలు ిలబడాలని సదా కోరుకుంటున్నాను
.