Subscribe RSS

కొత్త పాళి  గా  మనకందరికి  చిర  పరిచితమైన  మన  నాసీ  (నారాయణ స్వామి)   గారికి  బ్లాగ్ముఖం  గా  పుట్టిన  రోజు     శుభాకాంక్షలు
ఇక్కడ ఎందుకో సరిగా రావటం లేదు :-(  నా    కృష్ణ గీతం    లో చూడండి

చూసి నాసీ కు శుభాబినందనలు అంద చేయండి ప్లీజ్..అమెరికా లో వారాంతాలు నాకు అప్పుడప్పుడు బహు విషాదాలు. అనుభవజ్ఞులు ఈ సరికి పట్టేసే వుంటారు.. అవును మీరు వూహించిందే నిజం. ఇల్లు శుభ్రం చేయవలసిన రోజన్నమాట. నేను అప్పటికి కష్టం లేకుండా చిన్న ఇల్లు కొనుక్కున్నా ఐనా తప్పదు కదా ఈ క్లీనింగ్ యాతన. ఆ క్లీనింగ్ వాళ్ళు వస్తే కోపం తో వాళ్ళ మీద అరిచి ఇద్దరు ముగ్గురు నన్ను సూ కూడా చేస్తామని బెదిరించేరు, ఎందుకంటే వాళ్ళు వాడే పేపర్ టవల్స్ కి వాడే కెమికల్స్ కి.. నాకు వచ్చే ఆవేశానికి, తుమ్ములకు అబ్బో ఎందుకులెండి.
సరే అటు వంటి విషాద దినం మొన్న ఆదివారం నాకు. అందులో బాగం గా మా అబ్బాయి ని పొద్దుటే ఫిజిక్స్ క్లాస్ కు పంపించి వాడు సాయింత్రం దాకా రాని శుభసంధర్బాన్ని నేను తీరిక గా ఈ పాచి పని తో సెలబ్రేట్ చేసుకోవటం మొదలు పెట్టుకున్నా. యధావిధి గా నా పాటలు పెట్టుకున్నా. ఈ మధ్య న " చిమటా వారి సంగిత విభావరి మన మది ని దోచే ఆనంద విహారి" అని రోజు కొక సారైనా అనుకోవటం అలవాటు ఐపోయింది, అందులో 80 వ శకం పాటలు పెడితే ఒక్క సారి ఇంట్లో జనరంజని రోజులు మధ్యాన్నం 4.15 పాటల టైం, ఇంకా మా ఇంటిలోని నా భాద్యతారహిత కాని ఆనందభరిత జీవితం మళ్ళీ నా చేతికొచ్చేసినట్లు వుంటుంది. సరే దాని గురించి ఇంకో పోస్ట్ రాస్తాను... 

అలా పాటలు వింటున్నా.. హాయి గా "నిరంతరము వసంతములే సంగీతముల సరాగము లె (ప్రేమించు పెళ్ళాడు)" అంటూ బాలూ పాడెస్తున్నారు, ఇంకా ఆగక హాయి గా తన గాంధర్వ గానం తో " ఓం నమహ నయన శృతులకు (గీతాంజలి)" అంటూ, "కీరవాణి... చిలుకలా... పలకవే (అన్వేషణ)" అంటూ మెరిపించి మరిపించి సరే నెమ్మది గా "ఏడంతస్తుల మేడ ఇది వడ్దించిన విస్తరిది (ఏడంతస్తుల మేడ)", "అరటి పండు వలిచి పెడితే తినలేని చిన్నది ఆదమరిచి వూరుకుంటే (ఏడంతస్తుల మేడ)" అంటూ "వుంగరం పడి పోయింది పోతే పోని పోతే పోని (సుజాత)" అంటూ ఏవో అర్ధం పర్ధం లేని పాటలు పాడుతున్నారు. మళ్ళీ నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటానని ఇంతలోనే "పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది (జడగంటలు)" ," తొలి చూపు తోరణమాయె కల్యాణ కారణమాయే (మల్లె పందిరి)" అని మనసును ఎంచక్క గా ఆయన గొంతులో అలలు అలలు గా సాగే వెన్నెల కెరటాలలో, మెరుపు నురగల్లో కలిపేసి తీస్కెళ్ళి పోతూ పోతూ వున్నారు. 

అలా సాఫి గా జరిగి పోతే నేను ఈ పోస్ట్ ఎందుకు రాస్తానండి ఏదో ఇల్లు శుభ్రం చేసుకుని మా వాడికి చికెన్ వేపుడు చేసుకునే దానిని కదా, ఇలా చిరపరిచితాలు, మరిచిపోయిన పరిచయాలు అన్నిటిని విని ఆనంద పడుతుండగా హటాత్తు గా "అచ్చా అచ్చా వచ్చా వచ్చా నీకు ప్రేమంటే తెలుసా బచ్చా" అంటూ చిరంజీవి పాట వచ్చింది, అది కూడా మర్చి పోయి అందేసుకున్నా ఖూనీ రాగం తొ, వెంటనే వులిక్కిపడి మా నాన్న అక్కడున్నారేమో అని అటూ ఇటూ చూసేను 'అమ్మయ్య లేరు' అనుకుని ఇంతలోనే అరే నేను ఇప్పుడు వున్న కాలం వేరు వేకప్ బేబీ అనుకుని చెంప తట్టుకుని మళ్ళీ క్లీన్ చేసు కుంటున్నా, ఇక నా మీద చిమాటా శ్రీని గారు కక్ష్య కట్టినట్లు వరుస చూసుకోండి "అందగాడా అందవేరా అందమంతా అందుకోరా అలిగి సొలిగి కరిగిపోకు సందెకాడ (జాకీ)" అంటు జానకమ్మ," అక్కుం అక్కుం అక్కుం ఓం నా సామిరంగ అక్కుం అక్కుం అక్కుం ఓం (కిరాతకుడు)","ఇదో రకం దాహం అదో రకం తాపం (గజదొంగ)" ఇంకా అదేమిటి అబ్బా ఆ "అగ్గిపుల్ల బగ్గు మంటది.. ఆడ పిల్ల సిగ్గులంటది" ఇంకా ఇంకా (ఎందుకులెండి రాయాలన్నా మొకమాటం గా వుంది).. అంటు బాలు వరుసగా షాక్ ల మీద షాక్ లు. అసలు నేను మరిచి పోయాను ఈ పాటలన్ని వున్నాయని కూడా. 

ఒక్క సారి అలా గత జీవితమంతా రింగురింగులు గా తిరిగింది, నేను పైన చెప్పిన పాటలన్ని వచ్చినప్పుడు నాకు పాటలు వాటికి అర్ధాలు ఖచ్చితం గా తెలియదు, కాని రెటమతం మాత్రం బాగా తెలుసు. ఏ పాట,ఏమిటి సంభందం లేదు, రేడియో లో వస్తే పాడాల్సిందే దానితో పాటు.నా గొంతు అంతో ఇంతో బాగానే వుండేది, మంచి పాటలైతే మా నాన్న (సుబ్బారావు ఏలూరి) మాట్లాడకుండా కూచుని చక్క గా వినేవారు, ఒక రోజు అక్కుం అక్కుం పాట పాడుతున్నా అనుకుంటా ఇంక చూడు...అక్షింతలు మొదలు, ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యిందో, "నీకు అసలు మంచి పాట పిచ్చి పాట తేడా తెలియదా ఏది పడితే అది పాడతావేమే కొంచమన్నా జ్ఞానం లేదు,పెరిగేవు మళ్ళీ... అసలు ఆలోచించావా ఏమి పాడుతున్నాము దానికి అర్ధం ఏమైనా వుందా వెర్రి మొర్రి పాటలు, కాసేపు చదువుకో అని ఇంక చూడు క్లాస్ లే క్లాస్ లు నేనేమో "ఎమి వుంది అందులో ఎందుకు పాడ కూడదు" అని ఒకటే రెట మతపు ఆర్గ్యుమెంట్ లు, పాపం మా నాన్న ఏంచెపుతారు ఆ పాటలకు అర్ధం, మా అమ్మేమో కూర్చుని మా ఇద్దరిని చోద్యం చూస్తుంది (అలా చూసినందుకు ఆమె కు కూడా అక్షింతలు పడ్దాయి లెండి అప్పుడు).

సరే ఆ రింగులు రింగులు ఆపితే ఇప్పుడు మా అబ్బాయి (సుబ్బారావు యలమంచిలి) కు 15 సవత్సరాలు. సుమారు 25 ఏళ్ళ కితం ఏమి జరిగింది కొంచం ఫార్వార్డ్ చేస్తే అదే సీన్. మొన్నీ మధ్య నా కొడుకు, నేను నా ఫ్రెండ్ "పుట్టిన రోజు కు పిల్లలతో బయటకు వెళదాము" అని అంటె బయలుదేరి, యధా విధి గా నీ పాటలా, నా పాటలా అని కొట్టుకుని యధావిధి గా వాడే గెలిచి ఆ కిస్108 అంట అదేదో స్టేషన్ వింటున్నాడు. ఇంక ఏదో పాట " నేనేమొ టీ షర్ట్ ఆమేమో టైట్ స్కర్ట్, నేనేమో స్నీకర్స్ ఆమేమో హై హీల్స్ వేసుకుంటుంది అందుకని నువ్వు ఆ అమ్మాయినే ప్రేమిస్తావు లే" అంటూ ఎవరో చిన్న పిల్ల పాడుతుంది అవాక్కయ్యి అదేమిటి రా ఆ పాట అన్నా...వెంటనే వాడు (నా రెటమతపు కొడుకు) క్లాస్ పెట్టేడు, వచ్చేప్పుడు నా ఫ్రెండ్ కూతురు దానికి 8 ఏళ్ళు అది నా కార్ లో వస్తూ ఈ పాటే మళ్ళీ వస్తుంటే మొత్తం పాట రేడియో తో పాటు పాడింది.

ఒక్క సారి ఆ సీన్ అలా కళ్ళ ముందు గిర గిరా తిరిగి ఆ శుభ్రం చేసే కర్ర ను అలా గడ్డం కింద పెట్టుకుని ఆలోచిస్తూ వుండి పోయాను. అవును అప్పుడు ఎందుకు పాపం మా నాన్న తో అంత ఆర్గ్యుమెంట్ చేసేను. ఏమి ఆర్గ్యూ చేసేనో కూడా గుర్తు లేదు అడగాలి ఈసారి మా అమ్మ కు ఫోన్ చేసినప్పుడు. "నువ్వేమి చేసేవో అదే నీకు తిరిగి వస్తుంది" హతోస్మి... ఇప్పుడు తెలుస్తోంది నాకు నొప్పి.ఎంత ఎబ్బెట్టు గా వుందో ఆ పాట వింటే అందులోను చిన్న పిల్లల నోటి నుంచి. 

జనరేషన్ గ్యాప్ ప్రతి తరానికి తప్పని ఒక సమస్య,అది మరీ భూతం లా ఏమి భయపెట్టటం లేదు కానీ "what goes around comes around" అనే పదానికి నిజమైన అర్ధం తెలుసుకుంటున్నా,ఇంకా మా నాన్నను మాత్రం ఇప్పుడు బాగా అర్ధం చేసుకుంటున్నా, అమ్మ ను కూడా....ప్చ్... టూ లేట్..

ఉష సాగిస్తున్న జల పుష్పాభిషేకానికి నేను అందించే చిన్ని పువ్వు...

మీకు తెలుసా, ఎప్పుడూ 7 చేపలను బయటకు తెచ్చి ఎండబెట్టటానికి ప్రయత్నించి అవి ఎండలేదని ఏడ్చి మొత్తుకుని కధలల్లేము కాని ఒక్క సారి సజీవం గా అలల వూయలలూగుతు అనంత జల సంపదలను అలవోక గా తోకలతో ఎగరేసి పట్టుకుంటున్న మీనమ్మ ను, మత్యావతారుడిని మరి కధ ఏమిటో అని అడిగితే ఏమని చెపుతాయో... వినాలని వుందా... మరి రండి ఐతే ఆలస్యమెందుకు...

చేపమ్మ చేపమ్మ కధ చెప్పవు నీ ముద్దుల మొప్పల విదిలింపుల నుంచి చిందే చినుకుల తునకలను వంపులు తిరిగే జల ప్రవాహం తో కలిపి మమైకమయ్యేట్లు, మా చిన్నారి పొన్నారి ని ఈ రోజు నిద్ర పుచ్చటానికి నా గళం నుంచి నీ వాక్కు గా...

అయ్యో బుజ్జమ్మా ఏ కధ చెప్పనమ్మా.. వినాలనున్న చెవి కి ఇంపైన కధ చెప్పనా ............అందులో ప్రణయాలు, పలకరింపులు, చుక్కల మధ్యన సాగే విరహాలు.. చూపుల పలకరింతల కౌగిలింతలు, కాలమాపేసిన విరహపు పలవరింతలు.. వద్దా...... చిన్నరి బుర్ర కు అర్ధం కాదా.. సరే ఐతే...

సముద్రపు అడుగున పుట్టే అగ్నీకీలలు దావానలమై ఆ వెలుగులో మారిన జీవితాలు, ఆ వెలుగులో వేటాడిన తిమింగలాల కధ చెప్పనా.. అయ్యో మొఖమలా పెట్టేవే సరే అదీ వద్దులే...

గాలికి, వెలుతురికి, ఆహారానికి, ఆహార్యానికి అన్నిటికి నీళ్ళలోనే వుండి వాటినే నమ్ముకున్న మమ్ములను మా చిటికంత ప్రాణాలను యముడల్లే దునిమిన మీ జాతి ని చూసి పొంగిన మా కన్నీటి సముద్రపు కధ చెప్పనా.. పులసల పులుసల్లే రుచి గా వుండదు అంటావా ?... సరే ఐతే అదీ వద్దులే

సరే చిత్రాల లోకం లో వయ్యరాలు పోయే ఒక చిన్ని రంగు రంగుల చేప పిల్ల కధ చెప్పనా..
ఓహ్ అప్పుడే బావుందా చెప్పకుండానే చప్పట్లు కొడుతున్నావు.

అనగనగా ఒక లోకం లో........ అబ్బ అప్పుడే ప్రశ్నా..! ఏమి లోకమంటే... వు..... మత్స్య లోకమనుకో, ఒక చిన్నారి చేప పిల్ల వుండేది... అమ్మ నాన్నలకు ముద్దుల బుజ్జమ్మ, ఆట పాటలు తప్ప అన్యమెరుగని చిన్నమ్మ. తెలి తెల్లవారగానే తొలి కిరణం నీలపు నురగలను చీల్చుకుని అడుగుపెట్టీ పెట్టగానే ఆటలకు తయారైపోయేది... ముత్యపు చిప్పలలో ముత్యాలన్ని తన సొత్తే... నీలి నీలి పూల పోగులన్ని తన చిన్ని ఆల్చిప్పల ఇంటి ముందే, తన వూపిరి వదిలిన నీటి బుడగలే అను నిత్యం ఆడుకునే బంతులు...తన చెలికత్తెల తో కలిసి ప్రవాహపు జోరుకు ఎదురీదటమే జీవిత లక్ష్యం... ఆ సయ్యాటలో వూగే కెరటాల వూయాలలే ఆట ఆట కు మధ్య విరామ విహారాలు.

అలా ఆడుతున్న మన చిట్టి చేపమ్మకూ కాల ప్రవాహం లో ఈదటం తప్పలేదు మరి, కాని పాపం ఆ బుజ్జి చేపకు ఈ కాల ప్రవాహానికి ఎదురీదటం ఆట కాదు, ఆ ప్రవాహం అన్నిటిని మహా వేగం తో తనలోకి వూడ్చుకోవటమే తెలుసు కాని ఎదురెళితే వదిలెయ్యదని తెలియదు... తెలియక ఆ చిట్టి చేప తన అమాయకత్వం తో ఎన్ని ప్రయత్నాలనుకుంటున్నావు........వుండు ఒక్క నిమిషం నా బంగారం నిద్ర లేచిందేమో చూసి వస్తా...... వూ... లేదులే... ఎక్కడి దాకా వచ్చాము... ఆ ఆ ..చేప ఏమి చేసింది అని కదు చెప్పుకుంటున్నాము...

అమ్మ నాన్న ల కంటి కాపలా నుంచి దాటి వచ్చేక స్వేచ్హ, హక్కుల తో వచ్చే కొత్త తరంగాల వూయలలు భాద్యతను విధులను మరిపించి జోకొట్టేయి ఒక్కొక్క సారి.. భాద్యత తో జీవితాన్ని ముడి పెట్టుకోవటం అనే ఈతలో, భాద్యత గా చేసే పనులనేమో విధి కదిపే కెరటాలనుకుంది, విధి గా సాగించవలసిన సాగర యాత్ర నేమో విసిరేసిన భాద్యతల సుడిగుండమని భయపడేది...

ఏమిటీ.... భాద్యత విధి అంటే ఏమిటి అంటావా? విధి నీ ధర్మం, ప్రకృతి నీకిచ్చిన పని....., భాద్యతంటే ఆ ప్రకృతి ఇచ్చిన విధులను నెరవేర్చటం కోసం మనం చేయవలసిన కొన్ని పనులు... వు..... ఇంకా వివరం గా కావాలా? నీకు అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలబ్బా... నీ చిన్నారి బుజ్జమ్మ ను నువ్వు చూసుకోవటం, నీ బుజ్జమ్మ పాలు తాగటం మీ విధి ఐతే ఆ పాల కోసం నువ్వు పని చేయటం, తాగిన పాలు అరగటం కోసం బుజ్జమ్మ బొమ్మలను తిరగేస్తూ ఆడుకోవటం మీ భాద్యత, ఆగాగు నాకు తెలుసు నువ్వు ఏమి అడుగుతావో...

అమ్మాయి అది భాద్యత అని తెలియకనే విధి అని చేస్తోంది అందుకే ఆ పని ఆమె కు ఆనందాన్ని ఇస్తుంది, నీ భాద్యతను, నువ్వు నీ వయసుతో తెచ్చిన తెలివి కి, తర్కాన్ని కలిపి ఆ బాధ్యతను ఖర్మ అనుకుంటూ తర్కానికి బుద్ది, అహాన్ని కలిపి ఆలోచిస్తున్నావు కాబట్టి అది భారమవుతోంది.. సరే కధ కొద్దాము...

ఇలా ఈ బాధ్యతల బాధలు బంధనాలతో కాల ప్రవాహపు కెరటాల లయ లో చిన్ని చేపమ్మ ఎదుగుతు ఆ నీటి లో ఒదుగుతూ, కదులుతు తనను ఎత్తి ఈ భవ బంధనాల నుంచి తప్పించగల మత్స్యావతారం కోసం ఎదురు చూస్తూనే వుంది... చూస్తూనే వుంది, బుజ్జమ్మ అమ్మ అయ్యింది అమ్మ కి ఇంకో బుజ్జమ్మ వచ్చింది.. ఆగక సాగే ఈ జీవ యాత్ర అలుపెరుగక ఆది నుంచి, అనాది గా అలా సాగుతు కాలాలు కదులుతు..... చరిత్రలు మారుతూ వుంది... వుంటుంది ...
ఇంక కధ కంచికి మనం బతుకు ఈత లోకి..... ఇది ఈ చేప చెప్పే కత.