ఉష సాగిస్తున్న జల పుష్పాభిషేకానికి నేను అందించే చిన్ని పువ్వు...
మీకు తెలుసా, ఎప్పుడూ 7 చేపలను బయటకు తెచ్చి ఎండబెట్టటానికి ప్రయత్నించి అవి ఎండలేదని ఏడ్చి మొత్తుకుని కధలల్లేము కాని ఒక్క సారి సజీవం గా అలల వూయలలూగుతు అనంత జల సంపదలను అలవోక గా తోకలతో ఎగరేసి పట్టుకుంటున్న మీనమ్మ ను, మత్యావతారుడిని మరి కధ ఏమిటో అని అడిగితే ఏమని చెపుతాయో... వినాలని వుందా... మరి రండి ఐతే ఆలస్యమెందుకు...
చేపమ్మ చేపమ్మ కధ చెప్పవు నీ ముద్దుల మొప్పల విదిలింపుల నుంచి చిందే చినుకుల తునకలను వంపులు తిరిగే జల ప్రవాహం తో కలిపి మమైకమయ్యేట్లు, మా చిన్నారి పొన్నారి ని ఈ రోజు నిద్ర పుచ్చటానికి నా గళం నుంచి నీ వాక్కు గా...
అయ్యో బుజ్జమ్మా ఏ కధ చెప్పనమ్మా.. వినాలనున్న చెవి కి ఇంపైన కధ చెప్పనా ............అందులో ప్రణయాలు, పలకరింపులు, చుక్కల మధ్యన సాగే విరహాలు.. చూపుల పలకరింతల కౌగిలింతలు, కాలమాపేసిన విరహపు పలవరింతలు.. వద్దా...... చిన్నరి బుర్ర కు అర్ధం కాదా.. సరే ఐతే...
సముద్రపు అడుగున పుట్టే అగ్నీకీలలు దావానలమై ఆ వెలుగులో మారిన జీవితాలు, ఆ వెలుగులో వేటాడిన తిమింగలాల కధ చెప్పనా.. అయ్యో మొఖమలా పెట్టేవే సరే అదీ వద్దులే...
గాలికి, వెలుతురికి, ఆహారానికి, ఆహార్యానికి అన్నిటికి నీళ్ళలోనే వుండి వాటినే నమ్ముకున్న మమ్ములను మా చిటికంత ప్రాణాలను యముడల్లే దునిమిన మీ జాతి ని చూసి పొంగిన మా కన్నీటి సముద్రపు కధ చెప్పనా.. పులసల పులుసల్లే రుచి గా వుండదు అంటావా ?... సరే ఐతే అదీ వద్దులే
సరే చిత్రాల లోకం లో వయ్యరాలు పోయే ఒక చిన్ని రంగు రంగుల చేప పిల్ల కధ చెప్పనా..
ఓహ్ అప్పుడే బావుందా చెప్పకుండానే చప్పట్లు కొడుతున్నావు.
అనగనగా ఒక లోకం లో........ అబ్బ అప్పుడే ప్రశ్నా..! ఏమి లోకమంటే... వు..... మత్స్య లోకమనుకో, ఒక చిన్నారి చేప పిల్ల వుండేది... అమ్మ నాన్నలకు ముద్దుల బుజ్జమ్మ, ఆట పాటలు తప్ప అన్యమెరుగని చిన్నమ్మ. తెలి తెల్లవారగానే తొలి కిరణం నీలపు నురగలను చీల్చుకుని అడుగుపెట్టీ పెట్టగానే ఆటలకు తయారైపోయేది... ముత్యపు చిప్పలలో ముత్యాలన్ని తన సొత్తే... నీలి నీలి పూల పోగులన్ని తన చిన్ని ఆల్చిప్పల ఇంటి ముందే, తన వూపిరి వదిలిన నీటి బుడగలే అను నిత్యం ఆడుకునే బంతులు...తన చెలికత్తెల తో కలిసి ప్రవాహపు జోరుకు ఎదురీదటమే జీవిత లక్ష్యం... ఆ సయ్యాటలో వూగే కెరటాల వూయాలలే ఆట ఆట కు మధ్య విరామ విహారాలు.
అలా ఆడుతున్న మన చిట్టి చేపమ్మకూ కాల ప్రవాహం లో ఈదటం తప్పలేదు మరి, కాని పాపం ఆ బుజ్జి చేపకు ఈ కాల ప్రవాహానికి ఎదురీదటం ఆట కాదు, ఆ ప్రవాహం అన్నిటిని మహా వేగం తో తనలోకి వూడ్చుకోవటమే తెలుసు కాని ఎదురెళితే వదిలెయ్యదని తెలియదు... తెలియక ఆ చిట్టి చేప తన అమాయకత్వం తో ఎన్ని ప్రయత్నాలనుకుంటున్నావు........వుండు ఒక్క నిమిషం నా బంగారం నిద్ర లేచిందేమో చూసి వస్తా...... వూ... లేదులే... ఎక్కడి దాకా వచ్చాము... ఆ ఆ ..చేప ఏమి చేసింది అని కదు చెప్పుకుంటున్నాము...
అమ్మ నాన్న ల కంటి కాపలా నుంచి దాటి వచ్చేక స్వేచ్హ, హక్కుల తో వచ్చే కొత్త తరంగాల వూయలలు భాద్యతను విధులను మరిపించి జోకొట్టేయి ఒక్కొక్క సారి.. భాద్యత తో జీవితాన్ని ముడి పెట్టుకోవటం అనే ఈతలో, భాద్యత గా చేసే పనులనేమో విధి కదిపే కెరటాలనుకుంది, విధి గా సాగించవలసిన సాగర యాత్ర నేమో విసిరేసిన భాద్యతల సుడిగుండమని భయపడేది...
ఏమిటీ.... భాద్యత విధి అంటే ఏమిటి అంటావా? విధి నీ ధర్మం, ప్రకృతి నీకిచ్చిన పని....., భాద్యతంటే ఆ ప్రకృతి ఇచ్చిన విధులను నెరవేర్చటం కోసం మనం చేయవలసిన కొన్ని పనులు... వు..... ఇంకా వివరం గా కావాలా? నీకు అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలబ్బా... నీ చిన్నారి బుజ్జమ్మ ను నువ్వు చూసుకోవటం, నీ బుజ్జమ్మ పాలు తాగటం మీ విధి ఐతే ఆ పాల కోసం నువ్వు పని చేయటం, తాగిన పాలు అరగటం కోసం బుజ్జమ్మ బొమ్మలను తిరగేస్తూ ఆడుకోవటం మీ భాద్యత, ఆగాగు నాకు తెలుసు నువ్వు ఏమి అడుగుతావో...
అమ్మాయి అది భాద్యత అని తెలియకనే విధి అని చేస్తోంది అందుకే ఆ పని ఆమె కు ఆనందాన్ని ఇస్తుంది, నీ భాద్యతను, నువ్వు నీ వయసుతో తెచ్చిన తెలివి కి, తర్కాన్ని కలిపి ఆ బాధ్యతను ఖర్మ అనుకుంటూ తర్కానికి బుద్ది, అహాన్ని కలిపి ఆలోచిస్తున్నావు కాబట్టి అది భారమవుతోంది.. సరే కధ కొద్దాము...
ఇలా ఈ బాధ్యతల బాధలు బంధనాలతో కాల ప్రవాహపు కెరటాల లయ లో చిన్ని చేపమ్మ ఎదుగుతు ఆ నీటి లో ఒదుగుతూ, కదులుతు తనను ఎత్తి ఈ భవ బంధనాల నుంచి తప్పించగల మత్స్యావతారం కోసం ఎదురు చూస్తూనే వుంది... చూస్తూనే వుంది, బుజ్జమ్మ అమ్మ అయ్యింది అమ్మ కి ఇంకో బుజ్జమ్మ వచ్చింది.. ఆగక సాగే ఈ జీవ యాత్ర అలుపెరుగక ఆది నుంచి, అనాది గా అలా సాగుతు కాలాలు కదులుతు..... చరిత్రలు మారుతూ వుంది... వుంటుంది ...
ఇంక కధ కంచికి మనం బతుకు ఈత లోకి..... ఇది ఈ చేప చెప్పే కత.
9 comments to “చేప చెప్పిన కథ.”
-
భలే బాగుందండి!
-
కలల సాగరం లో ఈత కొట్టి వచ్చిన వలపు జంట కు పునః స్వాగతం.. ;-)
నచ్చినందుకు సంతోషం ఉషా.
ధన్య వాదాలు పద్మర్పిత... ఉష కు చేప కళ్ళ భామ కవిత ఇవ్వలేక పోయినా నా గోల కొంచం కధ చేసి ఇచ్చా.. మీరందరు కవితా కన్నియలు కదా. మీ కవితేది?
-
మీ రచనల్లో ఏదో స్పార్క్.. అంత సులభంగా అర్థం కాదు, టపా కాదండి, మీ రచనా తీరు.
"బాధలు బంధనాలతో కాల ప్రవాహపు కెరటాల లయ లో చిన్ని చేపమ్మ ఎదుగుతు ఆ నీటి లో ఒదుగుతూ, కదులుతు తనను ఎత్తి ఈ భవ బంధనాల నుంచి తప్పించగల మత్స్యావతారం కోసం ఎదురు చూస్తూనే వుంది... చూస్తూనే వుంది, బుజ్జమ్మ అమ్మ అయ్యింది అమ్మ కి ఇంకో బుజ్జమ్మ వచ్చింది.. ఆగక సాగే ఈ జీవ యాత్ర అలుపెరుగక ఆది నుంచి, అనాది గా అలా సాగుతు కాలాలు కదులుతు..... చరిత్రలు మారుతూ వుంది... వుంటుంది "
ఈ రచనా ప్రవాహంలో ఏటికి ఎదురీదే ఎంత చేపపిల్లైనా కాసేపు ఆగి "ఊ" కొట్టాల్సిందే !
-
హమ్మ్!ఇది నిజంగా చిన్ని చేప చెప్పిందా .....భావన చెప్పిందా ...అయితే మా ఇంట గాజు తోట్టేనున్న రంగుచేపలనుఅడుగుతాను ఇంతకన్నా మంచి అనుభవం చెప్పమని (నచ్చేసిందని వేరే చెప్పక్కరలేదుగా)మరువం కి సమర్పించాలని .:)
-
భా.రా.రె గారు.... జీవితానుభవాల కొలిమి లో మండినప్పటి వెలుగు మీరు స్పార్క్ అనుకుంటున్నారేమో... ;-) ఎన్ని అనుభువాలు ప్రతి మనిషి పధం లో, వెలిగే రవ్వల తళుకులు, ఎగిసిన అనుభందాల రంగులు, ముగుస్తున్న కళావిహీన కాంతులు, ముగిసిపోయిన చీకటి రాసులు, మధ్య మధ్య లో బోనస్ లు గా చిటపటలు, ఢమ,ఢమలు,, అబ్బో ఎన్ని స్పార్క్ లండి ఓపిక వుండి గుర్తు చేసుకోవాలి కాని...
అంతర్లీనమై వుంటూ సోహ మంటున్న వూపిరి ని ఆలంబన చేసుకుని సాగే నా జలతత్వం (చేపనుకుందాము కాసేపు) చూద్దాము వింటుందేమో ఆగి ఈ కథ :-)... నచ్చినందుకు ధన్యవాదాలు
చిన్నీ మీ గాజు తొట్టెలోని చేప పిల్ల తప్పకుండా మంచి అనుభవమివ్వగలదు సముద్రమనంతమైనా అది నిజ జీవితం తో సమన్వయ పరుచుకోవటం లో ఒంటరే కదా, గాజు తొట్టెలోని చేప పిల్ల కు నిజ జీవితాన్ని ఎక్కువ చూస్తుంది కదా. ఇంకా మంచి అనుభవమివ్వగలదు మన మరువపు కొమ్మకు... all the best నచ్చినందుకు ధన్యవాదాలు
-
భావన గారూ, ఏం స్పార్క్ ఇచ్చారండీ :)
-
భా.రా.రె గారు... :):)
-
చేప కత బహు బాగుంది సుమండీ ...
భావన, భలే వుంది ఈ కథ అలా అలా నేను అలల్లో కాసేపు ఎగిసి పడి వచ్చాను. తెలిసిందే కదా, "ప్రణయాలు, పలకరింపులు, చుక్కల మధ్యన సాగే విరహాలు.. చూపుల పలకరింతల కౌగిలింతలు, కాలమాపేసిన విరహపు పలవరింతలు" దగ్గర మాత్రం ఆగిపోయాను, వెనక్కి వచ్చి తననీ తోడు తీసుకుపోయాను, ;) ఏమిచేసారు అని అడగకు. ఈత నేర్చుకున్నాము. కలల సాగరాలు ఈదిరావాలి ఈ సారి.
"బుజ్జమ్మ అమ్మ అయ్యింది అమ్మ కి ఇంకో బుజ్జమ్మ వచ్చింది" ఎంత సున్నితంగా మన తరతరాల చరితని తిరిగేసావు బంగారం. అందుకే మా భావన మాటల గని, కైతలు కొట్టుకుపోయే అనంతవాహిని. చాలా సంతోషం.