Subscribe RSS





సుప్రభాత రాగాలు


ఉదయపు సుప్రభాత రాగాలను నాకు అనిపించిన/కనిపించిన/వినిపించిన రీతిన పంపిస్తుంటే వాటిలో కొన్నిటికి వర్ణాలద్ది ఒక టపా లా చేసి ఇచ్చిన నా ప్రియ/ప్రాణ మిత్రురాలు ఉష కు ప్రేమ తో ఈ టపా.....









ROYGBIV - VIBGYOR ఏదమ్మా నీ వైనం?


కెంపువర్ణ నునుసిగ్గు బుగ్గలు భూదేవి మురిపెమా?




రాత్రంతా ఆగాగి కురిసిన వాన జల్లులన్నీ భూదేవి ని స్నానమాడించి ప్రభాకరుని తో కలయిక కోసం సిద్ధం చేసాయి. జలకమాడిన పడతి మేనికి పుప్పొడి జాజర పూసి ఋణం తీర్చుకున్నట్లున్నాయి పూల కొమ్మలు... మేమేమైనా తక్కువా అని రాత్రి మిగిలిన నీటి తుంపరలను తెలి ముసుగు చేసి ఆమెకు అలంకరణలో సాయమోచ్చాడు వరుణదేవుడు. దుముకులాడే ఏరేమో ఆమె వొంపు సొంపుల్లో... ఎత్తు పల్లాల మధ్య సర్దుకుని పక పక లాడింది. ఇంత అలంకరణతో ప్రియురాలిని చూసిన సూరీడు రోజు కంటే ముందే వచ్చేసాడు ఆమె కోసం ఆనంద కిరణాలను వెద జల్లుకుంటూ.. అబ్బో రసికుడే.. అను నిత్యం జరిగే వారి సమాగమపు ఆనందాన్ని మొగ్గలేసి పువ్వులేసి కిల కిలా పిట్టల నవ్వులేసి.... ప్రకృతి సంబరాన్ని చేస్తోంది.... లోకులంతా సంబరపు నవ్వు బాకాలను , సంతోషాల బూరలను చేత పట్టి ఈ అధ్బుత ఆనంద రాగాలను వర్ణ మిశ్రమం చేసి పాడటానికి తయారవుతున్నారు. మరి భూదేవి మురిపెపు సిగ్గుల మెరుపు కాక ఏమిటి ఆ లేత వన్నెల ఎరుపు......


*****


నారింజ వన్నె పొద్దు ఆ వన్నె నెదుకుతూ పొద్దుగూకే వరకు..




ఎప్పటి లానే ఈ ఉదయం కొత్త వెలుగుల సూరీడుని, మరువలేని వెలుగులను తీసుకోచ్చేసింది.
ఎప్పటిలానే మానస మొక పద్మమయ్యి కనుల రేకుల విచ్చింది.
మరి ఎప్పటికి రాని చెలుని జాడలీనాడైనా ఆగాగి వీచే గాలి తెమ్మెర తెచ్చేనా...??????
దూరాన తానున్నా.... తన నీడ నేనైనా...... నేను నా నీడా కలిసేమా..
ఉదయమా చెప్పమ్మా సూరీడుని కుంగబోకమని
కుంగిన వెలుగున దీర్ఘమైన నా నీడ, మాయమయ్యి చెలికాని తలపు నుంచి నన్ను తప్పిస్తుందేమో....
నారింజ వర్ణాల వెలుగు  కమ్ముతుందేమో అని  ఉదయమే ఆశ 
సాయింత్రానికి  చెలుని జాడ కానక కాపు కాసిన చీకటి దాని వెంబడి వున్నదని దిగులు మిశ్రమమే ఈ నారింజ వెలుగులు.. 


******


పవిత్ర సమాగమాలన్నీ  పసుపు కుంకుమల మేలుకలయిక కాదా?




ప్రతి వుదయమొక నూతన జీవన సౌందర్యమే గా చూడగలిగిన కన్నులకు... ఇంత అందం లోను కొంత వెలితి, ఆ వెలితిలోను నిండిన సంపుర్ణత్వం తోచే సౌందర్యం ఈ ప్రకృతి లో కాక ఇంకెక్కడ తోస్తుంది చెప్పు. ప్రకృతి అంటే మనమే కదా ఆ పంచ ధాతువులతో చేసిన ఈ శరీరం... దానిని, అందులోని మనసును, బుద్ధి ని, హృదయాన్ని ప్రతి క్షణం ప్రభావితం చేసే ప్రకృతి తో అనుక్షణం చేసే సమాగమపు సంబరాలు ఎన్ని చెప్పినా అది ఒక అసంపూర్ణ కావ్యమే... ఎన్ని రాసినా అది ఒక రాయటానికి మిగిలిపోయిన లేఖే కదా... మౌనం ఎన్ని సార్లు కోట్ల జీవ రాగాలను కట్టి .....ఆకులను తట్టి పోయే గాలి తో కలిపి.. మన చెంప నిమిరే మందహాసమై...... ఎన్నెన్నో సార్లు నీ బుగ్గల మీదకు జారే కన్నీటి రాగమై కధలు పాడీ వినిపించలేదు... ఎన్ని సార్లు మధ్యాన్నపు ఎండ ఏటి మీద నీటి ని గాలి తో కదుపుతూ జీవిత సారాంశాన్ని వేదాంతం గా "ప్రశాంతత ఒక్కటే నీకు కావలసిన ఏకైక సాధనం అది నీతోనే నీలోనే వుంటుంది" అని నెమ్మది గా బుజ్జగిస్తూ చెప్పలేదు. ఎన్ని సార్లు సాయింత్రపు కడపటి కిరణం దూరం గా పచ్చటి చెట్టు మీద మెరుస్తూ ప్రణయ గీతాలను గతించిన కాలాలను గడపవలసిన కాలానికి మధ్య వారధేస్తూ నిను ముందుకు నడిపిస్తూ తనేమో వెనక్కి వాలిపోలేదు.. ఎన్నెన్నో భావాల అనుభవాల చిత్రాల మిశ్రమం పసుపు వన్నెల వెలుగులే గా నేస్తం... 


******


ఆకుపచ్చ విప్లవమా ఈ ఉదయం ?




శుభోదయం. పక పక నవ్వే పచ్చటి వనాలను విసిరిన సూరీడుకు వందనాలతో.... చిటపట లాడే ఎండలకు చిర చిర లాడే చెమటలకు... వుస్సో అస్సో ఆప సోపాలకు.. శుభోదయం. .. ఊరంతా ఘుమ ఘుమ లాడే సుగంధాల జాజర పూసిన కల కల మన్న పువ్వులకు శుభోదయం. ఆకుపచ్చ విప్లవమే మా ఊరినిండా.... చల చల్లని గాలి కలలే మా కళ్ళ నిండా మా కోసం  సూరీడిలా వెలుగు రేకలిస్తాడని.... రేకల విచ్చుకున్న జీవన సౌందర్యం మా జీవితాల వికసిస్తుందనీను.. కలలను సాకారం చేసిన భాస్కరుడికి శుభోదయం. సుభోదయాల విరిసిన హరిత వర్ణాలన్నీ మరి భాస్కరుడు మండిచే  విప్లవమేగా ????? కాదంటావా.... 






*******


నిండు నీలాల హారాలు మా దేవికి నయగారాల మురిపాలు..   




ఆగనా మాననా తేల్చని చినుకేమో
ఆగనంటున్న చిగురు కొమ్మల అంచున ఆగాగి మెరుస్తోంది...
నది అద్దం లో చూసి షోకు పడుతున్న కొమ్మ రెమ్మ లతో
అద్దాన్ని కదుపుతూ ఆట పట్టిస్తూ పక పక లోడుతోంది ఇంకో చినుకు.
వయ్యారాల ధరణి పుత్రిక శృంగార సరాగాల తో బద్దకించిన సూర్య వంశీయుడు ప్రతాపాలు కట్టి పెట్టి బోజ్జున్నాడేమో.....
సింగారాల హైమవతి సరస సల్లాపాల తేలిన శైల పతి దరహాసాల చంద్రికల చాయలు భూమిని వీడలేదు..
తప్పక... తప్పించుకోని బతుకు పరుగు పందెం లో అన్నిటిని ఆస్వాదిస్తూ అంతలోనే వురుకులెడుతూ
గమ్యమేదో తెలియకున్నా, గతి తప్పని పరుగుకు సిద్దమా.....
ఇన్ని పరుగుల బతుకు గతుల నీలాల హారాలను ఆ తల్లి మనకల్లితే  ఆ తల్లి కంఠాన నీలాల హారాల మురిపాలను కానుకిస్తోంది ఈ ఉదయం... 


*****


నీలాకాశం మళ్ళీ తొంగిచూస్తేనో?  




ఒంపులు తిరిగి వయ్యారాలు పొయ్యే నదికి చినుకు సోకుల సింగారాన్ని అద్దుతోంది ఈ వాన. పలకరించే వసంతుడి పిలుపుకు పులకరింతలతో సమాగమించి పచ్చదనాన్ని ప్రసవిస్తున్న పుడమి తల్లి కి పచ్చిక వొత్తుల పచ్చదనాన్ని దుప్పటి కప్పి చిగురుమోలకల ఎర్రదనాల నిగారింపును ఇంకా మెరిపిస్తూ మొగ్గల ఆవిర్భావానికి తన వంతు  సాయమందిస్తూ ప్రకృతి లో మమేకమవ్వాలని కాబోలు ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా చివరకు మా కిటికీ అద్దాల మీద కూడా మంచు ముత్యాలై మెరుస్తూ ఎన్ని హొయలు పోతుంది వాన మా ఊరిలో.. హొయల వెనుక మెరిసే నీలాకాశం నీకు కానుకిస్తూ ఈ ఉదయం నీతో.. 


******


ఊదా రంగు ఉదాసీనత అనగలమా ఈ ఉషారైన ఉదయాన్ని?   




రేయి పగలైనా పగలింకా రేయి ఛాయ లో మిగిలి పోయిందదేమో. ఆగక కురిసే వాన వస్తానన్న సూరీడును ధిక్కరించి గాఢమైన మబ్బులలో వూపిరాడని చినుకుముద్దులతో నిద్దరపుచ్చేసింది. ఇంక వాన గాలమ్మ తోటి  చెట్టాపట్టాలతో మొలక భామలకు, పూబాలల కు వూపిరిలూదేందుకు కావలసిన శక్తి ని తన వంతు గా ఇచ్చేస్తూ... ఇక్కడక్కడా అనని గడ్డీ మొలకల మీద పచ్చదనాలను వత్తు గా పేరుస్తూ గల గలల గానాన్ని పిల్ల కాలువలకు అరువిస్తోంది. ఇంత వుషారైన ఉదయాన్ని అందరు మబ్బు ముసురేసింది, మగత గా వుంది అంటారెందుకో కదా? ఈ మత్తు కన్నుల ఊదా వర్ణాల మధ్య మునిగి తేలుతూ ఈ ఉదయం ఇలా నీతో..... 


*****


అన్ని వన్నెలు... వైనాలు చూపాక ఇంకా వస్తూనే ఉన్న ఇంకో ఉదయం..  




ఎప్పటి లానే ఈ ఉదయం కొత్త వెలుగుల సూరీడుని, మరువలేని వెలుగులను తీసుకోచ్చేసింది.
ఎప్పటిలానే మానస మొక పద్మమయ్యి కనుల రేకుల విచ్చింది.
మరి ఎప్పటికి రాని చెలుని జాడలీనాడైనా ఆగాగి వీచే గాలి తెమ్మెర తెచ్చేనా
దూరాన తానున్నా తన నీడ నేనైనా...... నేను నా నీడా కలిసేమా..
ఉదయమా చెప్పమ్మా సూరీడుని కుంగబోకమని
కుంగిన వెలుగున దీర్ఘమైన నా నీడ, మాయమయ్యి చెలికాని తలపు నుంచి నన్ను తప్పిస్తుందేమో....


ఏమో? ఏమిటీ భావన...


అన్ని నాకే కావాలి అనుభవించాలి ప్రపంచం లో...... ఆనందాన్ని సాధించాలి జీవితం లో.. ప్రేమ కావాలి నా అనుకున్న వ్యక్తుల నుంచి.... నేనెంతో ప్రేమ నివ్వాలి నా వాళ్లకు..... ఇంకా ఇంకా..... ఇది కాదు జీవితం ఇంకా ఏదో సాధించాలి, ఇంకా చేతిలోకి తీసుకోవాలి అధ్బుత ఆనందాలు అనుభవాలు.... ప్రేమలు....సంపుర్ణమవ్వాలి ఆ అమృత ధార లో... కావాలి నాకు కావాలి అనే తపన నెమ్మది గా సన్నగిల్లి ఇచ్చేది, తీసుకునేది, కావాలనేది, కావాలన్నా వద్దనుకునేది అన్ని ఆ కృ ష్ణయ్యే అని నెమ్మది గా అర్ధమయ్యి ఆయన ఇచ్చినది ఇచ్చినట్లు తీసుకుని ఆయన కే మొత్తం అప్పచెప్పి హాయి గా చూడటమే. గీతాంజలి లో అన్నట్లు నా ఇంటి తాళాలు ఆయనకే ఇచ్చాను. తీసి నాకే సాదర స్వాగతం పలుకుతాడో మరి నన్నే తన కొరకు ఆసన మొకటి వేయమంటాడో నా కృష్ణయ్య.. 


విశ్వ వ్యాప్తమైన ప్రేమ ఎంత మంచి ఆలోచన కదా. నా వాళ్ళు.... నా భర్త/భార్య, తల్లి తండ్రులు, పిల్లలు.... అక్క చెల్లెళ్ళు స్నేహితులు ఈ బంధాలన్నీ వుంటాయి వాటిని తప్పించు కోవటం మనకు సాధ్యం కాక పోవొచ్చు కాని ఈ బంధాలన్నీ దాటిన విశ్వ వ్యాప్తమైన ప్రేమ... ఎందఱో యోగులు సాధన చేసి సాధించిన అమర ప్రేమ తత్త్వం, రాదా కృష్ణుల ల ప్రేమ తత్త్వం... జగాన నిండిన విశ్వ వ్యాప్తమైన ప్రేమ.... అవధులేని మల్లెల రజనల్లె, అంతు లేని అవధులే లేని సంద్రపు అలల నురగల్లె... విశ్వ వ్యాప్తమైన ప్రేమ. చెప్పటం చాలా తేలిక ఇలా రాసుకుంటూ వెళ్ళి పొతే పేరా పేరా లు రాసేయ్యొచ్చు కాని ఎంత తిరిగినా వృత్తం లోనే ఆవృత్తమైన నా ప్రేమ తిరిగి కేంద్ర బిందువైన నీ మీదకే మరలుతోంది కృష్ణయ్యా నీవే దిక్కు మొక్కు శరణాగతిని అని ఆయన కాలి మీదకే నా ప్రాణ మొక పూరేకై వురుకుతోంది అని ముగించాను వచ్చు.. మన మనసు మన ఇష్టం కదా...


హ్రస్వమవుతున్న నీడకు వీడ్కోలు చెప్తూ దీర్ఘమవుతున్న రోజులకు స్వాగతమంటూ... హరివిల్లు లోకాన అందాల జీవితాన సాగిపోతూ.. 


ఈ రోజు కు ఇలా నా ఉదయపు క్షణాల కొన్ని భావాలను అందరితో పంచుకుంటూ ఈ ఆలోచన ఇచ్చి అన్నిటిని కలిపి ఒక సూత్రాన గుచ్చిన నా నేస్తం ఉష కు ధన్యవాదాలతో... 

17 comments to “సుప్రభాత రాగాలు”

  1. kalhlhoo manasoo tappitae inkae sensoo pani cheyyalaedu. antae!adbhutam anaedi chaalaa chinna maaTa.

  1. pasupu aksharaalu kanipincatledu.. colour maarcandi. taruvaata caduvutaanu.

  1. భావన గారు గోదావరి అమ్మాయిని కోతి అన్నారని మీతో దెబ్బలాడాను కాని . ఇప్పుడు తెలిసింది ఇంత గొప్పావిడ తో దెబ్బలాటా? అని . నిజం చెప్పొద్దు అమ్మో మీరు రాసింది అర్ధం చేసుకోవడమే కాదు చదవడానికి నోరు తిరగడం కూడా కష్టం గా ఉంది నా మట్టి బుర్రకి... ఇప్పుడు మనం చదివిన పుస్తకం అర్ధం కాకపోతే ఇంకో పది సంవత్సరాలు తరువాత చదివితే అప్పటికి అర్ధమయ్యే నాలెడ్జె వస్తుందంట . అలా మీ రచనలు అర్ధం చేసుకోవాలంటే ఇంకో పది సంవత్సరాలు పడుతుందేమో నా మట్టి బుర్రకి..

  1. "నేస్తమా మన ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా.." పాడావుగా మరి! తప్పుతుందా..నేను చూసిన హరివిల్లు నీకు కానుకగా ఇచ్చేసా ఇలా. నీదే నీకు ఇవ్వటంలో ఏమి గొప్పరా, అంత లావు పేరు పెట్టను అక్కడ?

  1. అద్బుతం , పరమాద్బుతం .
    ఇంతకన్న చెప్పేందుకు మాటలు రావటము లేదు .

  1. ఆహా..ఎంతటి ప్రకృతి ఆరాధన. నా జన్మ కూడా ధన్యమయింది. ఈ నోముఫలమందుకున్ననేనూ అదృష్ఠవంతురాలినే. ఈ తొలిపొద్దు, ఉదయరాగాలు నా ఉనికినే మరిపించాయి. ఇంతటి సంబరాన్ని అనుభవించిన నా కన్నుల సౌభాగ్యానికి ఏమని ధన్యవాదాలు చెపితే సరిపోతుంది!!!! ఇటువంటి వాయనాలు కాస్త విరివిగా ఇవ్వొచ్చుగా....పుణ్యం కొంచెం ఎక్కువగానే మూటగట్టుకోవచ్చుగా....

  1. ఉషారైన ఉదయాన మేల్కొన్న నయనం చూసిన అందాల్ని, మనసులో బంధించి గుదిగుచ్చి మాకందించినందుకు ధన్యవాదాలండీ భావన గారు.

  1. భావన గారు! మీ వర్ణన గురించి వర్ణించడం మా తరం కాదు.
    చాలా..................................................................................... బాగుంది.

  1. aho adurs andi !!!

  1. @సునీత : అవును కళ్ళు తిప్పలేము మనసు మరల్చలేము మా వూళ్ళో వుదయాలను చూస్తే. ఇది ఒక్కటే రీజన్ ఈ చలి భరిస్తూ ఈ ఏరియా లో వుండటానికి. మరి మా వూరెప్పుడు వస్తున్నారు ఈ అందాలన్ని చూడటానికి? నచ్చినందుకు ధన్యవాదాలు
    @కృష్ణ : మార్చేను చూడండి
    @శివరంజని: అంతేమి లేదు ఏదో వుదయాన్ని చూస్తే వచ్చే ఆలోచనలు అంతే. అంత పెద్ద పేరు ఇచ్చేయకండీ. అబ్బ మీ గోదారోళ్ళ తో ఇదేనబ్బ చిక్కు.. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేము. వు ఇంక మొదలు పెట్టండి మరి పోట్లాట ;-) నచ్చినందుకు ధన్యవాదాలు

  1. @ఉష: నే రాసిన చెత్త లో వెతికి తీసి వర్ణాలద్ది కొత్త రూపులూదిన ఘనత నీదేగా ఉష. మరి ఆ క్రెడిట్ నీకే. "నీ బాట లోని అడుగులోని నావే.. నా పాట లోని మాటలు నీవె..."

    @మాల గారు: మా వూళ్ళో వుదయాలు ఎలాంటి వాళ్ళకైనా కవిత్వాన్ని తెప్పించగలవు. ప్రతి క్షణమొక సంబరం ప్రతి రోజొక వసంతోత్సవం... మరి రారూ మా వూరు చూడటానికి. :-). నచ్చినందుకు ధన్యవాదాలు

    @ జయ: ఎన్ని రోజులయ్యిందమ్మ నా వైపుకు తొంగి చూసి.. అమ్మయ్య ఈ వుదయాల సౌందర్యం జయ ను నా వైపు లాక్కొచ్చింది. నిజం జయ, ఎంత బాగుంటుందో ఆ శోభ చెప్పనలవి కాదు.. మా పల్లెటూరు వదిలి ఎటైనా వెళ్ళాలంటే నాకు భయం అందుకే. తప్పకుండా పంపుతా మిగతా వుదయాలు నా కంటి నుంచి చూసిన వైనం. నచ్చినందుకు ధన్యవాదాలు.

  1. @మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి భాస్కర రామి రెడ్డి గారు. ఆనందం నాది. (pleasure is mine)

    @కృష్ణ : నచ్చినందుకు ధన్య వాదాలు. పైన చెప్పినట్లు మా వూరి వుదయాలంత అందం గా వుంటాయన్నమాట.

    @సావిరహే : నచ్చినందుకు ధన్యవాదాలు. అదరహో లు మా వుదయాలకు. :-)

  1. ఉష గారూ.. మదిలో మెదిలిన హరివిల్లును... ఈ computer రంగులు సరిపోల్చలేక పోతున్నాయి కదూ!

    @others: computer రంగుల వల్ల చదవటానికి ఇబ్బందిగా అనిపిస్తే... Ctrl + a press చెయ్యండి.

  1. ఎండా వానా కలిస్తే అందమైన హరివిల్లు అంటారు ,,,,ఇప్పుడు ఉష గారు భావన గారు కలిసి మాకు మంచి హరివిల్లు లాంటి పోస్ట్ అందచేసారన్నమాట ! చాలా బాగా రాసారు బాగుందండి

  1. bhavana gaaru,

    నాకిప్పుడే రావాలనిపిస్తోంది. రానా?

  1. @ మురళి: మదిలోని వర్ణాలను ఏదో మన శక్తి కొద్ది వర్ణాలద్దటమే కాని పూర్తి గా చెప్పటం సాధ్యమా చెప్పు..

    @ధన్యవాదాలు వంశీకృష్ణ గారు. హరివిల్లు ల వర్ణాల మెరుపులు మీ ప్రశంసలే కదా. :-)
    @ నీహారిక: వచ్చెయ్యండీ వచ్చెయ్యండీ. వసంతాన్ని చూపించలేను కాని సముద్రపు నురగను, హరిత వర్ణాల అడవులలో అంబరాల నుంచి జల జల లాడే జలపాతాల నవ్వులను ాఅ నవ్వులలో నవ్వే చిత్రాల పువ్వులను చూపిస్తాను వచ్చెయ్యండి.

  1. మురళీ కృష్ణ గారు, కిటుకు చెప్పేసారుగా..ఇక అలా నడుస్తుందిలేండి. భావన భావనల్లోని వర్ణాలు లేనిదే ఈ వర్ణనలు సంపూర్తికావనే అలా హరివిల్లుగా అవిషరిస్త.

    పరుచూరి వంశీ కృష్ణ గారు, మీ అభినందన కి థాంక్స్..ఎండ ఎవరో వాన ఎవరో గానీ మీ నోటిచలవన అలా సాగితే మీ నోట్లో నిత్యం ఘీ శక్కర్ పడాలని మేమూ కోరుకుంటాం... :)