Subscribe RSS

అమెరికా లో వారాంతాలు నాకు అప్పుడప్పుడు బహు విషాదాలు. అనుభవజ్ఞులు ఈ సరికి పట్టేసే వుంటారు.. అవును మీరు వూహించిందే నిజం. ఇల్లు శుభ్రం చేయవలసిన రోజన్నమాట. నేను అప్పటికి కష్టం లేకుండా చిన్న ఇల్లు కొనుక్కున్నా ఐనా తప్పదు కదా ఈ క్లీనింగ్ యాతన. ఆ క్లీనింగ్ వాళ్ళు వస్తే కోపం తో వాళ్ళ మీద అరిచి ఇద్దరు ముగ్గురు నన్ను సూ కూడా చేస్తామని బెదిరించేరు, ఎందుకంటే వాళ్ళు వాడే పేపర్ టవల్స్ కి వాడే కెమికల్స్ కి.. నాకు వచ్చే ఆవేశానికి, తుమ్ములకు అబ్బో ఎందుకులెండి.
సరే అటు వంటి విషాద దినం మొన్న ఆదివారం నాకు. అందులో బాగం గా మా అబ్బాయి ని పొద్దుటే ఫిజిక్స్ క్లాస్ కు పంపించి వాడు సాయింత్రం దాకా రాని శుభసంధర్బాన్ని నేను తీరిక గా ఈ పాచి పని తో సెలబ్రేట్ చేసుకోవటం మొదలు పెట్టుకున్నా. యధావిధి గా నా పాటలు పెట్టుకున్నా. ఈ మధ్య న " చిమటా వారి సంగిత విభావరి మన మది ని దోచే ఆనంద విహారి" అని రోజు కొక సారైనా అనుకోవటం అలవాటు ఐపోయింది, అందులో 80 వ శకం పాటలు పెడితే ఒక్క సారి ఇంట్లో జనరంజని రోజులు మధ్యాన్నం 4.15 పాటల టైం, ఇంకా మా ఇంటిలోని నా భాద్యతారహిత కాని ఆనందభరిత జీవితం మళ్ళీ నా చేతికొచ్చేసినట్లు వుంటుంది. సరే దాని గురించి ఇంకో పోస్ట్ రాస్తాను... 

అలా పాటలు వింటున్నా.. హాయి గా "నిరంతరము వసంతములే సంగీతముల సరాగము లె (ప్రేమించు పెళ్ళాడు)" అంటూ బాలూ పాడెస్తున్నారు, ఇంకా ఆగక హాయి గా తన గాంధర్వ గానం తో " ఓం నమహ నయన శృతులకు (గీతాంజలి)" అంటూ, "కీరవాణి... చిలుకలా... పలకవే (అన్వేషణ)" అంటూ మెరిపించి మరిపించి సరే నెమ్మది గా "ఏడంతస్తుల మేడ ఇది వడ్దించిన విస్తరిది (ఏడంతస్తుల మేడ)", "అరటి పండు వలిచి పెడితే తినలేని చిన్నది ఆదమరిచి వూరుకుంటే (ఏడంతస్తుల మేడ)" అంటూ "వుంగరం పడి పోయింది పోతే పోని పోతే పోని (సుజాత)" అంటూ ఏవో అర్ధం పర్ధం లేని పాటలు పాడుతున్నారు. మళ్ళీ నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటానని ఇంతలోనే "పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది (జడగంటలు)" ," తొలి చూపు తోరణమాయె కల్యాణ కారణమాయే (మల్లె పందిరి)" అని మనసును ఎంచక్క గా ఆయన గొంతులో అలలు అలలు గా సాగే వెన్నెల కెరటాలలో, మెరుపు నురగల్లో కలిపేసి తీస్కెళ్ళి పోతూ పోతూ వున్నారు. 

అలా సాఫి గా జరిగి పోతే నేను ఈ పోస్ట్ ఎందుకు రాస్తానండి ఏదో ఇల్లు శుభ్రం చేసుకుని మా వాడికి చికెన్ వేపుడు చేసుకునే దానిని కదా, ఇలా చిరపరిచితాలు, మరిచిపోయిన పరిచయాలు అన్నిటిని విని ఆనంద పడుతుండగా హటాత్తు గా "అచ్చా అచ్చా వచ్చా వచ్చా నీకు ప్రేమంటే తెలుసా బచ్చా" అంటూ చిరంజీవి పాట వచ్చింది, అది కూడా మర్చి పోయి అందేసుకున్నా ఖూనీ రాగం తొ, వెంటనే వులిక్కిపడి మా నాన్న అక్కడున్నారేమో అని అటూ ఇటూ చూసేను 'అమ్మయ్య లేరు' అనుకుని ఇంతలోనే అరే నేను ఇప్పుడు వున్న కాలం వేరు వేకప్ బేబీ అనుకుని చెంప తట్టుకుని మళ్ళీ క్లీన్ చేసు కుంటున్నా, ఇక నా మీద చిమాటా శ్రీని గారు కక్ష్య కట్టినట్లు వరుస చూసుకోండి "అందగాడా అందవేరా అందమంతా అందుకోరా అలిగి సొలిగి కరిగిపోకు సందెకాడ (జాకీ)" అంటు జానకమ్మ," అక్కుం అక్కుం అక్కుం ఓం నా సామిరంగ అక్కుం అక్కుం అక్కుం ఓం (కిరాతకుడు)","ఇదో రకం దాహం అదో రకం తాపం (గజదొంగ)" ఇంకా అదేమిటి అబ్బా ఆ "అగ్గిపుల్ల బగ్గు మంటది.. ఆడ పిల్ల సిగ్గులంటది" ఇంకా ఇంకా (ఎందుకులెండి రాయాలన్నా మొకమాటం గా వుంది).. అంటు బాలు వరుసగా షాక్ ల మీద షాక్ లు. అసలు నేను మరిచి పోయాను ఈ పాటలన్ని వున్నాయని కూడా. 

ఒక్క సారి అలా గత జీవితమంతా రింగురింగులు గా తిరిగింది, నేను పైన చెప్పిన పాటలన్ని వచ్చినప్పుడు నాకు పాటలు వాటికి అర్ధాలు ఖచ్చితం గా తెలియదు, కాని రెటమతం మాత్రం బాగా తెలుసు. ఏ పాట,ఏమిటి సంభందం లేదు, రేడియో లో వస్తే పాడాల్సిందే దానితో పాటు.నా గొంతు అంతో ఇంతో బాగానే వుండేది, మంచి పాటలైతే మా నాన్న (సుబ్బారావు ఏలూరి) మాట్లాడకుండా కూచుని చక్క గా వినేవారు, ఒక రోజు అక్కుం అక్కుం పాట పాడుతున్నా అనుకుంటా ఇంక చూడు...అక్షింతలు మొదలు, ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యిందో, "నీకు అసలు మంచి పాట పిచ్చి పాట తేడా తెలియదా ఏది పడితే అది పాడతావేమే కొంచమన్నా జ్ఞానం లేదు,పెరిగేవు మళ్ళీ... అసలు ఆలోచించావా ఏమి పాడుతున్నాము దానికి అర్ధం ఏమైనా వుందా వెర్రి మొర్రి పాటలు, కాసేపు చదువుకో అని ఇంక చూడు క్లాస్ లే క్లాస్ లు నేనేమో "ఎమి వుంది అందులో ఎందుకు పాడ కూడదు" అని ఒకటే రెట మతపు ఆర్గ్యుమెంట్ లు, పాపం మా నాన్న ఏంచెపుతారు ఆ పాటలకు అర్ధం, మా అమ్మేమో కూర్చుని మా ఇద్దరిని చోద్యం చూస్తుంది (అలా చూసినందుకు ఆమె కు కూడా అక్షింతలు పడ్దాయి లెండి అప్పుడు).

సరే ఆ రింగులు రింగులు ఆపితే ఇప్పుడు మా అబ్బాయి (సుబ్బారావు యలమంచిలి) కు 15 సవత్సరాలు. సుమారు 25 ఏళ్ళ కితం ఏమి జరిగింది కొంచం ఫార్వార్డ్ చేస్తే అదే సీన్. మొన్నీ మధ్య నా కొడుకు, నేను నా ఫ్రెండ్ "పుట్టిన రోజు కు పిల్లలతో బయటకు వెళదాము" అని అంటె బయలుదేరి, యధా విధి గా నీ పాటలా, నా పాటలా అని కొట్టుకుని యధావిధి గా వాడే గెలిచి ఆ కిస్108 అంట అదేదో స్టేషన్ వింటున్నాడు. ఇంక ఏదో పాట " నేనేమొ టీ షర్ట్ ఆమేమో టైట్ స్కర్ట్, నేనేమో స్నీకర్స్ ఆమేమో హై హీల్స్ వేసుకుంటుంది అందుకని నువ్వు ఆ అమ్మాయినే ప్రేమిస్తావు లే" అంటూ ఎవరో చిన్న పిల్ల పాడుతుంది అవాక్కయ్యి అదేమిటి రా ఆ పాట అన్నా...వెంటనే వాడు (నా రెటమతపు కొడుకు) క్లాస్ పెట్టేడు, వచ్చేప్పుడు నా ఫ్రెండ్ కూతురు దానికి 8 ఏళ్ళు అది నా కార్ లో వస్తూ ఈ పాటే మళ్ళీ వస్తుంటే మొత్తం పాట రేడియో తో పాటు పాడింది.

ఒక్క సారి ఆ సీన్ అలా కళ్ళ ముందు గిర గిరా తిరిగి ఆ శుభ్రం చేసే కర్ర ను అలా గడ్డం కింద పెట్టుకుని ఆలోచిస్తూ వుండి పోయాను. అవును అప్పుడు ఎందుకు పాపం మా నాన్న తో అంత ఆర్గ్యుమెంట్ చేసేను. ఏమి ఆర్గ్యూ చేసేనో కూడా గుర్తు లేదు అడగాలి ఈసారి మా అమ్మ కు ఫోన్ చేసినప్పుడు. "నువ్వేమి చేసేవో అదే నీకు తిరిగి వస్తుంది" హతోస్మి... ఇప్పుడు తెలుస్తోంది నాకు నొప్పి.ఎంత ఎబ్బెట్టు గా వుందో ఆ పాట వింటే అందులోను చిన్న పిల్లల నోటి నుంచి. 

జనరేషన్ గ్యాప్ ప్రతి తరానికి తప్పని ఒక సమస్య,అది మరీ భూతం లా ఏమి భయపెట్టటం లేదు కానీ "what goes around comes around" అనే పదానికి నిజమైన అర్ధం తెలుసుకుంటున్నా,ఇంకా మా నాన్నను మాత్రం ఇప్పుడు బాగా అర్ధం చేసుకుంటున్నా, అమ్మ ను కూడా....ప్చ్... టూ లేట్..

21 comments to “తరం.. తరం.... నిరంతరం..”

  1. chimatamusic లో విందు భోజనం లో రాళ్ళలా శ్రిని గారు ఇలాంటి పాటలు కూడా కొన్ని పెట్టారు ఎంతైనా బాలు వీరాభిమాని గద.ఇంకా పిల్లల విషయాని కొస్తే మొన్న మా మిసెస్ నాతొ మాట్లాడుతూ వొక విషయం లో నేనో తప్పు చేశా అని ఇంకా ఏదో చెప్పా బొయెన్తలొ మా వాడు మమ్మీ 24 hrs లో ఆ పిల్ ఏదో వేసేసుకో మమ్మీ అంటే నోరు వెల్ల బెట్టడం మా వంతయ్యింది .ఇక్కడ టీవీ చానెల్స్ లో వొక ఆమె రాత్రి నేనో తప్పు చేశా అంటే వాళ్ళ స్నేహితురాలు భయపడకు 24 గంటల లోపు ఆ పిల్ వెయ్యి ఏం ప్రాబ్లం వుండదని advertisement అది చుసిన మా వాడు తప్పు అనగానే పిల్ అని అందుకుంటున్నాడు నిజానికి ఆ ఆడ్ ఏంటో తేలిక పోయినా గాని .

  1. కత్తిలా ఉంది పాటల పందిరి పోస్టు భావనా!

    సాయంత్రం 4.15 కి(లాస్టవరు ఎగ్గొట్టి మరీ) అప్పుడే కాలేజీ నుంచి వచ్చి వివిధ భారతిలో పాటలు వింటూ గడిపిన ఆ బాధ్యతా రహిత రోజులు గుర్తు చేశారుగా, చేతిలో బూజు కొంచె పక్కన పారేసి కూచుని చింతిస్తున్నా!(దీపావళి వస్తోంది కదా, ఎంత ఇండియాలో ఉంటే మాత్రం మేము మాత్రం మీ అమెరికన్స్ లెవెల్లో కాకపోయినా పండగ చేసుకోవద్దూ! అందుకే క్లీనింగు)

    సో, అదండీ సంగతి! "నువ్వేమి చేసేవో అదే నీకు తిరిగి వస్తుంది" ఇదే జీవిత సత్యం! ఇంకా నయం! మీ అబ్బాయికి పదిహేనేళ్ళు! నా కూతురుకి ఆరేళ్ళే! ఇలాంటి జీవిత సత్యాలు చాలా బోధించింది నాకు ఇప్పటికే!

  1. మీ నాన్నగారు పీకిన క్లాసైనా మీ అబ్బాయికి పీకకపోతే ఎలాగండీ? మీరు క్లాసులు పీకడం నేర్చుకోవాల్సి ఉందైతే... :)

  1. భలే ఉందండి మీ పోస్టు, సరే గాని మనలో మన మాట నిజం చెప్పండి ఆ పాటలు ఎంత గా వింటే మాత్రం ఆ లిస్టు ఎలా గుర్తు పెట్టుకున్నారు ? ఏమినా లాజిక్ ఉందా దాని వెనక :)

  1. పోస్ట్ సంగతి అటుంచి మీ అబ్బాయికి సుబ్బారావు అని పేరు పెట్టడం చాలా సంతోషాన్నిచ్చింది.

  1. రవి గారు స్వాగతమండి నా బ్లాగ్ లోకం లోకి. మీరు మొదటి సారి కామెంటటం నా బ్లాగ్ ల లో. అబ్బ ఏమి నవ్వించారు అండి పొద్దుట పొద్దుటే .. వూహించుకుని వూహించుకుని నవ్వు కున్నా మీ, మీ అవిడ మొహం తలుచుకుని. ఇంకా నయ్యం బోలెడంత మంది వున్నప్పుడు అనలేదు ఆ మాట మీరు ఎంబరాస్ అయ్యే వారు. అవునండి అదొక్కటే కాదు మనకి ఇండియా లో ఎందుకనో ఇక్కడికి లా పిల్లలకోసమే సెపరేట్ గా చానల్స్ వుండవు. వుంటే కనీసం ఒక వయసు వచ్చే దాక అవి మాత్రమే పెట్టవచ్చు. అవును చిమటా శ్రీని గారు బాలు వీరాభిమాని అంతే కాదు బాలు గారే ఏమైనా పాటల రిఫరెన్స్ కావాలన్నప్పుడు ఈయన వెబ్సైట్ చూస్తారని శ్రీని గారే చెప్పేరు ఆయన వెబ్సైట్ లో.. ధన్యవాదాలు.

    @ సుజాత: దీపావళి క్లీనింగ్ మొదలు పెట్టెసేరా? :-( నేను అప్పట్లో పాటలతోనే బతికే దానిని, మరీ నీకు వెర్రి అనే వారు కాని ఇలా ఇంతమంది ఒకటే వెర్రి వున్న వాళ్ళను కలుసుకోవటం సంతోషం గా వుంది అమ్మయ్య నేను ఒక్క దాన్నే కాదు అని. ;-) అవును చందమామ లో ఆ ఫోజ్ పెట్టించటానికి మీరు పడ్డ అవస్తలు చదివేను కదా. నా స్నేహితురాలు ఇక్కడ ఒకామె అంటూ వుంటుంది మనం చేసిన పాపాలన్నిటికి దేవుడు పనిష్మెంట్ గా పిల్ల ల తో శిక్ష వేయించుతాడంట, మన పుణ్యాలు కూడాను.. పూర్తి గా నిజ ంకాక పోయినా కొంత వరకు నిజమే కదా. ధన్య వాదాలు.

  1. @ బృహస్పతి: ఆగమ్మా కొంచం ఆగు, ఈ తరం పిల్లలకు క్లాస్ పెడితే ఏమవుతుందో తెలుస్తుంది కదా.. వెండి తెర మీద వేచి చూడమ్మా... ;-) ధన్యవాదాలు.

    @శ్రావ్య: స్వాగతం నా బ్లాగ్ లోకం లోకి. నచ్చినందుకు కమెంటినందుకు ధన్యవాదాలు. ఏమీ లాజిక్ లేదండి విన్నవే వింటుంటాము కదా. నా దగ్గర కూడా చాలా కలక్షన్ వుంది వింటూనే వుంటాను ఎప్పుడు (ఒక్కోసారి నిద్ర పోయినంత సేపు కూడా) . నాకు పాటలలో సాహిత్యం, గొంతు లో పలికించే గమకం ముఖ్యం, సంగీతం తరువాత, కొత్త పాటల నుంచి డేటాబేస్ లోకి వచ్చి చేరేవి ఫొల్చుకుంటె తక్కువే కదా. ధన్యవాదాలు.

    @ శ్రీనివాస్ గారు: స్వాగతమండి నా బ్లాగ్ లోకం లోకి. ధన్యవాదాలు. "ఆ పోస్ట్ సంగతి పక్కన పెట్టి" అంటె నేను ఒప్పుకోను ఒప్పుకోను.. (ఇదే రెట మతమంటే అని మరి మా నాన్న తిట్టేది :-)) అవునండి మా అబ్బాయి పేరు కూడా సుబ్బారావు. పేరే కాదు నాకు మా నాన్నే పుట్టి ఇలా నేను చేసిన వాటికన్నిటికి తిరిగి సమాధానం చెపుతున్నారేమో అని గాట్టి నమ్మకం. :-) ధన్యవాదాలు.

  1. అక్కుం అక్కుం అక్కుం ఓం నా సామిరంగ అక్కుం అక్కుం అక్కుం ఓం :)

  1. భా రా రే .. హ హ హ అదే మరి.... :-) :-) :-) 5 నిమిషాలు ఆపకుండా నవ్వి అప్పుడు పబ్లిష్ చేసేను మీ కామెంట్...

  1. అక్కుం అక్కుం అక్కుం ఓం నా సామిరంగ అక్కుం అక్కుం అక్కుం
    ఇదేంపాటబ్బా...గెప్పుడూ ఇన్లే!!
    మేము రోజుకి యాభైసార్లు ఇల్లు సర్దుకుంటాం. మా వమ్మగారూ వయ్యగారూ కనిపించినవన్నీ లాగివతలేస్తుంటారు. వమ్మగారు, నడ్డితిప్పు గొల్లభామలా వయ్యారంగా కిచెనీలోకి వచ్చేసి డిష్ వాషర్ లోంచి సెంచాలు గంటెలు లాగివతలేస్తుంటుంది.
    ఓ చిన్న గిన్నెలో మరమరాలు ఇవ్వాలి రోజు. ఇల్లంతా జల్లుతూ తింటుంది వమ్మగారు, వయ్యగారు వచ్చిలాక్కుని కిందకుమ్మరిస్తాడు...ఇక వాక్యూం పెట్టేప్పుడో పాటలు పెడదాం అని పొరపాటున ఐట్యూన్స్ తెరిస్తే చాలు...రాక్ ఆన్ దగ్గర ఆగుతుంది కరుణ రధం!!

  1. @ భాస్కర్ గారు: స్వాగతమండీ నా బ్లాగ్లోకం లోకి. మొదటి సారి కామెంటటానికి వచ్చారు మీక్కూడా కొంచం మరమరాలు పోసిస్తాముండండీ పలహారం కింద. అసలే డైటింగ్ లో వున్నట్లున్నారు కదా. కాని మీరు వొలకపోసి ఆనక మీ ఆవిడకు నా మీద చెపితే కుదరదు మరి. ;-) మా అబ్బాయికి 15 ఏళ్ళు అండి... గొల్ల భామ, అల్లరి రౌడీ ల వయసు దాటి పోయాడు కదా..:-) ఈ అక్కుం అక్కుం కిరాతకుడని 80 ల మధ్య లో వచ్చినట్లు వుంది...అది ఒక్కటనే ఏమి వుందిలెండి, అప్పట్లో మరణ మృదంగమనుకుంటా "కొట్టండి గిల్లండి చంపండి రక్కండి ప్రేమా" అని ఒక పాట కూడా వుండేది..

  1. bhalE pOsT

  1. నేను లేటు గా వచ్చాను. పోస్ట్ బాగుంది ఉమా. నేనూ పాటలూ వింటాను కానీ మరీ ఈ రేంజిలో కాదు అంటే ఈ అక్కుం అక్కుం లూ,కొట్టండి గిల్లండి చంపండి రక్కండి " గట్రాలు:-)

  1. నేస్తం... అమ్మో నవ్వుల రాణి కి నా పోస్ట్ నచ్చిందే... టాంక్ యూ...

    సునీత నచ్చినందుకు ధన్య వాదాలు. అవునమ్మా అలాంటి (అక్కుం లు కొట్టండి గిల్లండి) పాటలు వినటానికి ఒక స్పెషల్ టేస్ట్ వుండాలి మరి, బేవార్స్ టేస్ట్ అంటారు దానిని. ;-)

  1. chaalaa baagundi hi hi hi .
    మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

  1. :) చాలా బాగుంది.
    సాహితీ మిత్రులకు
    ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.

  1. హ హ హా.......... బాగుంది.

    పిల్లలని ఆ వయసులో తిట్టడమూ తప్పే.... ఏమీ అంకుండా ఉండడామూ తప్పే.... ఏ సందర్భంలో ఏమనలో మీకే బాగా తెలుస్తుంది. మీ అబ్బాయి మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యే టట్లు చెప్పడానికి ప్రయత్నించండి.

  1. ప్చ్ .....ప్చ్ ........మరి మనవలరోజులొచ్చే సరికి వారూ అంతే కదా !

  1. సుజ్జి, మాల, శ్రీనిక ధన్య వాదాలు. మీ అందరికి నా హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు మరియు ప్రపంచ కవితా దినోత్సవపు శుభాకాంక్షలు.
    మాల మీ పిక్చర్ ప్రొఫైల్ లో పెట్టింది బాగుందండి మీరేనా?

    @ విశ్వ ప్రేమికుడు: అదే కదా ఈ కర్ర విరగకుండా పాము చావకుండా ఈ కత్తి మీద సాము ఈ పిల్లల పెంపకం వద్దు రా బాబోయ్.. ;-) మీకు హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు మరియు ప్రపంచ కవితా దినోత్సవపు శుభాకాంక్షలు.

    @పర్లిమళం: అవును కదా.. అంతం కాదిది ఆరభం ప్రతి తరానికి నిత్య నూతనం... మీకు హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు మరియు ప్రపంచ కవితా దినోత్సవపు శుభాకాంక్షలు.

  1. భావన గారు చాలా బాగా నవ్వించారు .....
    భలే ఉంది ఈ పోస్ట్

  1. భావన గారూ మీ మనసు పడుతున్న బాధ అర్థమయ్యింది. దానికి పూర్తి పరిష్కారం ఇప్పడికిప్పుడు లేనప్పటికీ...

    మీ బాబుకు రోజులో కొంత సేపు భగవత్ ప్రార్థన నేర్పించడం, అలాగే నియమంగా ఉండడంలో ఉండే ఆనందాన్ని రుచి చూపించడం వంటి వాటి వల్ల భవిష్యత్తులో బాబు ఒక సక్రమైన మార్గానికి రావడానికి సహకరించగలం. అంటే ఇప్పుడు సరిగా లేడని కదు. కానీ ఇలాగే ఉంటే కొంతకాలానికి కష్టమవ్వచ్చని.

    నిజానికి చాలా కష్టమైన విషయాన్ని కూడా చాలా సరదాగా పంచడం మీ రచనా పటిమను చాటుతున్నది. :)