Subscribe RSS





వెన్నెలంటే నా కిష్టం. సముద్రపు హోరంటే నా కిష్టం. .. వెన్నెలలో తడిసి అలలపై మెరిసే నురగంటే నా కిష్టం. వీటన్నిటిని మొగలి పూల దొప్పలో కలిపి ఇచ్చే మా వూరంటే నాకింకా ఇష్టం...... మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలం గా అల్లుకున్న పొదరిల్లు మాది అన్నట్లు మాది అటు పల్లెటూరికి ఎక్కువ ఇటు పట్టణానికి తక్కువ గా వుండే ఒక మోస్తరు వూరు....

మావూరు అనగానే గుప్పెడు సన్నజాజులు గుండెలపై కుమ్మరించినట్లు ఎన్నో అనుభూతులు ఒక్క సారి మనసును చుట్టుముట్టేస్తాయి నాకు. .. కొన్ని గాఢం గా సాంబ్రాణి పొగలా చుట్టు ముట్టేస్తూ వుక్కిరి బిక్కిరి చేసి మధురమైన స్మృతులను తలపుకు తెస్తే, కొన్ని అప్పుడే విచ్చిన చంద్రకాంత పూలు గాలితో కలిపి తెచ్చే పరిమళాలు మనసుకు అందిస్తాయి. ఇక మరి కొన్ని ఎండిన నేలపై కురిసే తొలి చినుకుల విరిని లేపుతూ మరీ ఆనందాన్ని ఇస్తాయి.

భాష ఏదైనా భావమొక్కటే గుండెకు. అనుభూతుల సాంద్రత వేరైనా సారం మాత్రం ఒక్కటే నాకు మా వూరును తలుచుకుంటే...

మా వూరికి మాత్రమే పరిమితమైన విశ్లేషణలు చాలానే వున్నాయి. నా చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి పొట్టకూటి కోసం ఈ దేశానికి వలస వచ్చే వరకు నా జీవితం మొత్తం మా వూరిలోనే గడిచింది. పుట్టటం దగ్గర నుంచి, చదువు, పెళ్ళి, వుద్యోగం అన్నీ కూడాను.. మా వూరు సరస్వతి నిలయం. ఒక్క మెడిసన్ తప్ప మా వూరిలో లేని చదువు అంటూ ఏమి లేదు.. అబ్బో అదేమి గొప్ప అంటారు మీరందరు, ఇప్పుడు గొప్ప కాదేమో కాని మరి 1980 ల లోనే అన్ని కాలేజీల్లోని కోర్స్ లు మా వూరిలో వున్నాయంటే మరి అది మాకు గర్వ కారణమే కదా..

మా వూరి లో మిరప కాయ బజ్జీ తిన్న వారెవ్వరైనా ఒప్పుకోవలసిందే ఇంత మంచి బజ్జీ ఎక్కడా తినలేదు అని.... అంతే కాదు మా వూరు జగద్విఖ్యాతమైన లడ్డు కు కూడా పేరెన్నిక కన్నది, తిరుపతి కాదండోయ్...తిరుపతి లడ్డు తరువాత అంత గా ప్రఖ్యాతి చెందిన బందరు లడ్డు మరి మాదే కదా...
లడ్డు ఏమిటి లెండి, హల్వా, అది అనే కాదు అసలు మా వూరి పేరు మీదే అంటారు కదా బందర్ మిఠాయి అని.

మా వూరికి ఒక్క పేరే కాదండోయ్..... మచిలీపట్టణం అని కూడా అంటారు.. ఎప్పుడో పోర్చుగీసు వాళ్ల కాలం లో జాలరులకు ఒక పేద్ద చేప దొరికితే , ఆ చేప కన్ను తో ఫోర్ట్ తలుపే కట్టించారట అందుకే మచిలీ (చేప) పట్టణం అని పేరు వచ్చిందట. మత్య ప్రియులకు మా వూర్లో చాలా రకాల చేపలు,పీతలు గట్రా దొరుకుతాయి.

మా వూరికు పక్కనే సముద్రం, క్రిష్ణమ్మ సంగమపు అందాలు చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కాదు.... నదులన్నీ వచ్చి సముద్రం లో కలవటం ఎంత సహజమో చదువుల కోసం, కోర్టు పనుల కోసం, మంచి వైద్యం కోసం, మా వూరుకు రావటం అంత సహజం గా వుండేది ఒకప్పుడు.

ఇప్పుడంటే రెసిడెన్షియల్ కాలేజ్ కల్చర్ పెరిగి పోయింది కాని మా వూరి హిందు కాలేజ్, నేషనల్ కాలేజ్ ఎంత మంది గొప్ప విద్యా వేత్తలకు, కళాకారు లకు పుట్టినిల్లు గా వుండేవి అనుకుంటున్నారు. ఆ లిస్ట్ మొదలు పెడితే అబ్బో ఇప్పట్లో అయ్యేది కాదులెండి. అంత ఎందుకండి... మా వూరి గురించి మంచి దర్శకులుగా పేరు వున్న జంధ్యాల గారు ఒక సినిమానే తీసేరు అంటే ఇంక మాటలెందుకు లెండి... ఏమిటా సినిమా అనుకుంటున్నారా? ష్... గుప్... చిప్.... చూడండి మీకు అందరికీ మా వూరి గొప్ప తనం తెలియక పోతే నేను మీ అందరికి ఫ్రీ గా ఒక డీ.వీ.డి పంపుతాను మరి...

ఈ దేశం వచ్చేక కూడా మా వూరి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ ఒక్క సారి మా పాండు రంగడి ని, మా పున్నాగ పూల ను, మా మాలతీ లతలను, అంత కంటే ఎక్కువ మా సముద్రపు గాలిని తలిచి మురవక పోతే మా కంటే కూడా మా పక్కన వాళ్ళు ఆశ్చర్య పోతారు... కావాలంటే మా బోస్టన్ లో ఎవరిని ఐనా అడగండి. నిజం... మా వూరి మీద ఒట్టు...!!!!!!!

సుజన రంజని కోసం ఎప్పుడో రాసిన ఈ టపా ను ఎక్కడో పారేసుకున్నా, అడగ గానే వెతికి ఇచ్చిన కాంతి కిరణ్ గారికి ధన్య వాదాలతో..

16 comments to “మా వూరంటే నా కిష్టం...”

  1. ఈ మద్య మచిలీ పట్నం గురించి, అక్కడి పాండురగడి గుడి గురించి చాలా వింటున్నాం ! తప్పక ఓ సారి వెళ్ళిరావలసిందే.
    మీ వూరి గురించి చదువుతుంటే బాగుంది .

  1. ఓ మీది బందరా? నేను విజయవాడలో సాంఘిక సేవ మీద ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో మా క్లాస్మేట్ అమ్మాయిది ఒకరిది బందరు. లడ్డులా వుండేది. సహజంగానే బందరు లడ్డు అని పిలిచేవారం.

    ఆ టవున్ చూడాలని వుంటుండేది కానీ ఇంతవరకు కుదరలేదు.

  1. @ మాల గారు. ధన్యవాదాలు. అవునండి మా వూరి పాండురంగడిని ఆ పక్కనే పాపనాశనం, మోపిదేవి సుబ్రమణ్యేశ్వరుడిని తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు.
    @ శరత్: మా బందరు అమ్మాయి ని ఏడిపించేవారా? అదీ విజయవాడ లో... మీకు ష్.. గుప్ చిప్ లో కోటా లాంటి వాళ్ళు తగిలి వుండరు అందుకే అంత ధైర్యం చేసేరు. అసలు మీకు ఒక విషయం తెలుసా. బందరు అమ్మాయిలు కేవలం బందరు లోనే పుడతారు అదేమి లాజిక్ అని అలా హాశ్చర్య పోకండి కోటా లాజిక్... ;-) ధన్యవాదాలు.

  1. "మావూరు అనగానే గుప్పెడు సన్నజాజులు గుండెలపై కుమ్మరించినట్లు ఎన్నో అనుభూతులు ఒక్క సారి మనసును చుట్టుముట్టేస్తాయి"---మా బాగా చెప్పారు. ఈ అనుభూతి అందరికీ అలానే ఉంటుందేమో!
    మరి మా ఊరు కూడా వెళ్లిరండి ఒక్కసారి.
    http://vareesh.blogspot.com/2008/07/blog-post.html

    బందరు గురించి వినటమే కాని ఎప్పుడూ చూడలేదు. మా నాన్న బందరు హిందూ కాలేజి పూర్వ విద్యార్థి.

  1. @ వరుధిని: చాలా బాగుంది మీ వూరు. మీ వురి గురించి మీ పోస్ట్ లోనే కామెంటేసా.. మీ వూరు నేను కూడా చూసేను రోడ్ మీదకే వుంటుంది కదా.. బాపట్ల నో అప్పికట్ల నో వెళుతున్నప్పుడు మీ వూరి మీదు గానే కదా వెళ్ళాలి..
    మీ నాన్న గారి లానే మా పెద నాన్న గారు చదువుకుని ఇంక అక్కడే సెటిల్ అయ్యి అన్ని కుటుంబాలను బందరు కు తీసుకుని వచ్చేసేరు విద్య వుద్యోగాల నిమిత్తం.... బాగుంది పని చెయ్యకుండా జ్ఞాపకాల తేనె తుట్టె కదిపినందుకు మా మేనేజర్ ఏమైనా అంటే మీ మీదే చెపుతా... ;-)

  1. ఆహా ఎంత బాగా రాసారు ఒక సారి మీ ఊరు చూసి రావాలనిపించేంతగా :)

  1. మీ ఊరి గురించి బాగా రాశారు. ఓ చక్కటి భావన కలిగింది. మా ఫ్రెండ్ వాళ్ల నాన్న గారిది కూడా బందరే.... ఈ బందరు వాళ్లందరికీ మా బందరు అనే అభిమానం చాలా ఉందనిపిస్తోంది :)

  1. ఆ ఫోటోలొని పూలని మీరేమంటారండి?మేమూ కాగదా మల్లి అంటము.పొడుగాటి కాద ఉంటుందని.ఆ పూల పరిమళం మనోహరం.మేమూ రొడ్దు మీద ఉన్న చిన్న చెట్టు తెచ్చి చిన్నాప్పుడు మ ఇంట్లో వెసాము.ఇప్పుడు అది ఆ ఊరిలో పెద్ద వృక్షమైపొయింది..మీ ఊరి కబుర్లు చాలా చల్లా బాగున్నాయి..మీ అక్షరాల్లాగ!!

  1. నేస్తం: మరి ఆలస్యమెందుకు ఒకసారి చూసి రండి, పాండురంగడిని, క్రిష్న సంగమం, సముద్రం, మోపిదేవి, మొవ్వ అన్ని మంచి ప్రాంతాలే బందరు చుట్టుపక్కల.

    విశ్వ ప్రేమికుడు గారు: ధన్య వాదాలు. అవును ఎందుకనో మా బందరు వాళ్ళకు కొంచం అభిమానం ఎక్కువ గానే వుంటుంది, మరి ఆ నీళ్ళ ప్రభావమేమో :-)

    తృష్ణా,
    వాటిని మేము తోక మల్లెపూలు పున్నాగ పూలు అంటాము కాగడా మల్లె అంటే వాసన లేకుండా వుంటాయి, కనకాంబరాలలో కలిపి వేసి కడతారు వాటిని అంటాము మేము..

  1. ఓ బందరు లడ్డు మా భావనమ్మోయ్, మీ వూరు చూసానోచ్, నిజానికి అక్కడ మా అత్తగారు వాళ్ళు కొన్నాళ్ళున్నారు, మరిది పెళ్ళి చేసామావూర్లోనే... మీరు చెప్పిన విశెషాలు అన్నీ కాకపోయినా ఎన్నో చూసాను. :) ష్ గప్ చిప్ చూసాము, ఇంకా చెప్పుకుని నవ్వుకుంటాము. ఆ పున్నాగ పూలతో నేను కాడలు మెలికేసి మాలలల్లగలను తెలుసా .. అమ్మీ?

  1. నిజమా వుషా.. ఎవరు మీ మావగారు వాళ్ళు చెప్పు చెప్పు.. నాకు తెలుసేమో ప్రయత్నిస్తాను..

  1. మీ ఊరు మచిలిపట్నమ!చాల బాగా రాసారు .పున్నగాపూలను చూడగానే జ్ఞాపకాలు ..చలికాలం లో ప్రొద్దున్నే వాటిని ఏరుకోవడం రేకులతో బుడగలు చేసి టాప్మని కొట్టడం .....మీ ఊరు తరుచు వెళ్తుంటాను ..హల్వా లడ్డు మనకి పరిచయమే :)

  1. అవునా చిన్నీ, మా వూరు వెళతారు అనగానే మీరెంతో ఆత్మీయమైపోయిన ఫీలింగ్ వచ్చేసింది ఒక్కసారి, ఆ పున్నాగ పూలతో అనుభందం ఎంత బాగుంటుంది కదు... పున్నాగలతో జడలల్లటం, రేకులతో బుడగలు, బదం కాయలు తెచ్చుకుని కొట్టుకోవటం, బాదం ఆకులతో విస్తరి కుట్టటానికి ప్రయత్నించి పక్క మామ్మ గారితో తిట్లు తినటం, పని అమ్మాయితో పాటు నాకు బాదం ఆకులో ఉప్మా కావాలని అమ్మతో పేచీలు.... బందరు హల్వా ఇంట్లో చేసి గిన్నెలు మాడ గొట్టటం అయ్యో మళ్ళీ పోస్ట్ ఐపోతోంది.. మీరు మీ వుద్యోగం పని మీద వెళతారా? అక్కడ R & B building పక్కనే మా స్నేహితురాలి ఇల్లు వుండేది...

  1. భావన గారు నా చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపారు !!
    మా నాన్న గారు పెరిగింది బందరులోనే. చదివింది హిందూ హై స్కూల్. పరాసుపేట, బుట్టయిపేట లో మా బంధువులు చాలామంది ఉన్నారు. మేము పరాసుపేట పెద్దమ, బుట్టయిపేట పెద్దమ, అని పిలిచేవాళ్ళము :)
    మా అన్నయ, నోబెల్ కాలేజీ లో చదువుకున్నాడు.

  1. after reading your post,
    i felt to collect on vooru for a sankalanam

    my eyes filled with wet

    i canot type more

  1. మా ఆవిడది కూడా బందరేనండీ. గొడుగుపేట.

    జంధ్యాల గారి సినిమాని పట్టుబట్టి చూపించింది నాకు.